Telugu Global
Health & Life Style

యాస్ప్రిన్... కోవిడ్ ని తరిమికొడుతుందా?!

కోవిడ్ 19 పాజిటివ్ తో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వారికి యాస్ప్రిన్… ప్రాణాలు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఓ నూతన అధ్యయనంలో తేలింది.  అమెరికాలోని మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనాకు హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న పేషంట్లలో… గుండెకు సంబంధించిన వ్యాధులనుండి రక్షణ కోసం ప్రతిరోజు తక్కువ మోతాదులో యాస్ప్రిన్ తీసుకుంటున్నవారిలో కోవిడ్ నుండి కోలుకునే శక్తి ఎక్కువగా ఉండటం శాస్త్రవేత్తలు గమనించారు. అంతేకాదు యాస్ప్రిన్ తీసుకున్నవారిలో […]

యాస్ప్రిన్... కోవిడ్ ని తరిమికొడుతుందా?!
X

కోవిడ్ 19 పాజిటివ్ తో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వారికి యాస్ప్రిన్… ప్రాణాలు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఓ నూతన అధ్యయనంలో తేలింది. అమెరికాలోని మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనాకు హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న పేషంట్లలో… గుండెకు సంబంధించిన వ్యాధులనుండి రక్షణ కోసం ప్రతిరోజు తక్కువ మోతాదులో యాస్ప్రిన్ తీసుకుంటున్నవారిలో కోవిడ్ నుండి కోలుకునే శక్తి ఎక్కువగా ఉండటం శాస్త్రవేత్తలు గమనించారు. అంతేకాదు యాస్ప్రిన్ తీసుకున్నవారిలో ప్రాణాపాయ స్థితి… ఈ మందు తీసుకోని వారిలో కంటే తక్కువగా ఉంది.

యాస్ప్రిన్ తీసుకుంటున్నవారిలో ఐసియులో చేరాల్సిన పరిస్థితి కానీ, వెంటిలేటర్ పై ప్రాణాలను నిలపాల్సిన అవసరం కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నదని… వారు కోవిడ్ ఇన్ ఫెక్షన్ ని విజయవంతంగా ఎదుర్కొని క్షేమంగా బయటపడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. అనస్థీషియా, అనాల్జీషియా అనే పత్రికలో ఈ నూతన అధ్యయనం తాలూకూ వివరాలను ప్రచురించారు. చవకైన, అందుబాటులో ఉన్న, సురక్షితమైనదనే గుర్తింపు ఉన్న యాస్ప్రిన్… ఇలాంటి మేలు కలగజేస్తుందని తెలియటంతో దీనిపట్ల శాస్త్రవేత్తలు ఆశావాద దృక్పథంతో ఉన్నారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే రాండమ్ క్లినికల్ ట్రైల్స్ నిర్వహించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఒకవేళ ఇది నిజమని పూర్తి స్థాయిలో నిర్దారణ చేయగలిగితే… కోవిడ్ మరణాలను తగ్గించే ఓ మేలైన ఔషధం… అదీ మెడికల్ షాపుల్లో విస్తృతంగా లభించే ఔషధం ఇదే అవుతుందని అధ్యయనానికి సారధ్యం వహించిన జొనాథన్ ఛో అంటున్నారు. ఈయన మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ లో ఎమ్ డిగా అనెస్థీషియాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ అధ్యయనం కోసం ఛో, అతని సహ శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కోవిడ్ లక్షణాలతో హాస్పటల్లో చేరిన 412 మంది పేషంట్ల మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. వీరందరి సగటు వయసు 55 సంవత్సరాలు. వీరిలో నాలుగోవంతు మంది పేషంట్లు… తమకున్న గుండె సమస్యకు చికిత్సగా రోజూ చాలా తక్కువ మోతాదులో (దాదాపు 81 మిల్లీగ్రాములు) యాస్ప్రిన్ తీసుకుంటున్నవారు. హాస్పటల్ లో చేరకముందు లేదా చేరిన తరువాత వీరు యాస్ప్రిన్ ని తీసుకున్నారు.

సాధారణంగా గుండెపోటు, స్ట్రోక్ లాంటి అనారోగ్యాలకు గురయినవారికి వైద్యులు తక్కువ మోతాదులో యాస్ప్రిన్ ని తీసుకోమని సూచిస్తుంటారు. భవిష్యత్తులో రక్తం గడ్డకట్టే పరిస్థితులు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటివారు కోవిడ్ కి గురయినప్పుడు… విపరీతమైన పరిణామాలకు దారితీయకుండా వారు వాడుతున్న యాస్ప్రిన్ కాపాడే అవకాశాలున్నాయని నూతన అధ్యయనం చెబుతోంది. ఎందుకంటే … కోవిడ్ 19 పేషంట్లలో రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. కొంతమంది విషయంలో ఈ పరిస్థితి ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. యాస్ప్రిన్ ఈ తీవ్రతని తగ్గిస్తున్నదని అధ్యయనం చెబుతోంది. వైద్యుల సలహా మేరకు కోవిడ్ పేషంట్లు తక్కువ మోతాదులో యాస్ప్రిన్ వాడవచ్చని అధ్యయన నిర్వాహకులుగా వ్యవహరించిన కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారిలో రోజూ యాస్ప్రిన్ ని తీసుకోవటం వలన రక్తస్రావం జరిగే రిస్క్, పెప్టిక్ అల్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దీనిని తప్పనిసరిగా వైద్య సలహామేరకు మాత్రమే వాడాలి. ఏదిఏమైనా దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.

Next Story