Telugu Global
Health & Life Style

కరోనా కాలం... గుండె పదిలం !

కరోనా ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత మానసిక ఒత్తిడిని పెంచిందనేది… నూటికి నూరుపాళ్లు నిజం. ముఖ్యంగా పెద్దవయసువారు… ఇంట్లోంచి బయటకు వెళితే ఏమవుతుందో అనే భయంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. మానసిక ఒత్తిడి పెరిగితే గుండెకు ప్రమాదం. అందుకే… కరోనా భయం గుండెకు భారంగా మారకుండా జాగ్రత్తగా ఉండమంటున్నారు వైద్యులు. ముంబయి… ములంద్ లోని ఫార్టీస్ హాస్పటల్ లో కార్డియో థొరాసిక్ కన్సల్టెంట్ గా ఉన్న డాక్టర్ మనీష్ హిందుజా… గుండెని పదిలంగా ఉంచుకునే సూచనలు సలహాలు […]

కరోనా కాలం... గుండె పదిలం !
X

కరోనా ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత మానసిక ఒత్తిడిని పెంచిందనేది… నూటికి నూరుపాళ్లు నిజం. ముఖ్యంగా పెద్దవయసువారు… ఇంట్లోంచి బయటకు వెళితే ఏమవుతుందో అనే భయంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. మానసిక ఒత్తిడి పెరిగితే గుండెకు ప్రమాదం. అందుకే… కరోనా భయం గుండెకు భారంగా మారకుండా జాగ్రత్తగా ఉండమంటున్నారు వైద్యులు.

ముంబయి… ములంద్ లోని ఫార్టీస్ హాస్పటల్ లో కార్డియో థొరాసిక్ కన్సల్టెంట్ గా ఉన్న డాక్టర్ మనీష్ హిందుజా… గుండెని పదిలంగా ఉంచుకునే సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం…

  • ఇప్పుడు మనమంతా మన జీవితం నార్మల్ గా లేదనే భావంతో ఉన్నాం. దానిని పోగొట్టుకోవాలంటే… ఇంతకుముందులాగే మన దినచర్య వేళప్రకారం ఉండాలి. ఉదయాన్నే లేవటం, రోజువారీ పనులు, భోజనం, నిద్ర అన్నీ సమయాన్ని బట్టి చేస్తూ… వీకెండ్ ప్రశాంతంగా హాయిగా గడపాలి. ఇలా చేయటం వలన … ఎప్పటిలా సాధారణంగానే జీవిస్తున్నామనే భావం కలుగుతుంది. అలాగే ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవటం గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.
  • గుండెకు హాని చేసే అంశాల్లో ఒంటరితనం కూడా ఒకటి. మనుషులను కలవలేకపోతున్నామే అనే బాధ ఈ కరోనా కాలంలో చాలామందిలో పెరిగిపోయింది. వీడియో కాల్స్ లో ఆప్తులతో మాట్లాడటం, యోగా, ధ్యానం లాంటివి చేయటం, ఆన్ లైన్ ద్వారా ఏదైనా నేర్చుకోవటం… వీటన్నింటితో ఒంటరితనపు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
  • సిగరెట్లు.. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. సిగరెట్లు ఎక్కువ తాగటం వలన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ (మన కణాలకు హానిచేసి అనారోగ్యాలను కలిగించే ఫ్రీ రాడికల్స్ పెరిగి… వాటిని అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గటం) పెరిగి గుండె నుండి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకుని వెళ్లే రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి తగ్గి… ఇన్ ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది.

30 నుండి 49 ఏళ్ల వయసువారు…

  • ఈ వయసువారు తమ బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. కోవిడ్ కారణంగా వచ్చిన జీవనశైలి మార్పులతో ఒక్కసారిగా పని, నిద్ర, విశ్రాంతి, ఆహారం అన్నింట్లో మార్పులు రావటం వలన బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే వారానికి ఒకసారి శరీర బరువుని, బిఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్)ని చూసుకుంటూ ఉండాలి. బిఎమ్ఐ 18.5…24.9కి మధ్యలో ఉంటే ఆరోగ్యకరం.
  • వేగంగా నడక, ఏరోబిక్స్, డాన్స్… ఇలా ఏదో ఒక వ్యాయామం రోజూ అరగంటపాటు చేయాలి. ఇవన్నీ మన ధ్యాసని ఏకాగ్రతని పూర్తిగా వాటిపైనే నిలిపి ఉంచే అంశాలు.
  • గార్డెనింగ్, పుస్తకాలు చదవటం, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవటం లాంటివి చేయాలి.

యాభై నుండి అరవైతొమ్మిది ఏళ్ల వయసువారు…

  • ఎక్కువ సమయం ఒకేచోట కూర్చోకండి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోండి.
  • ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామాలు చేయండి… శరీరాన్ని సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు సైతం గుండెని చురుగ్గా ఉంచుతాయి.
  • ఛాతీలో నొప్పి, ఆయాసం, కాళ్లలో వాపు, మైకం కమ్మినట్టుగా ఉండటం… లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవన్నీ గుండెకు సంబంధించిన అనారోగ్యానికి సూచనలు కావచ్చు.

డెభై…ఆపైన వయసున్నవారు…

  • గుండెకు ఏవైనా సమస్యలున్నవారు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ లాంటి సమస్యలున్నవారు తప్పకుండా వైద్య సలహా మేరకు మందులువాడాలి. బిపి, షుగర్ వీలైతే ఇంట్లోనే చెక్ చేసుకుంటూ… ఆన్ లైన్లో డాక్టర్ ని సంప్రదించగల ఏర్పాటు చేసుకుంటే మంచిది.
  • గుండె ఆరోగ్యం పట్ల దానికి వచ్చే సమస్యల పట్ల వీలయినంత వరకు అవగాహన కలిగి ఉండటం అవసరం.
First Published:  3 Nov 2020 2:07 AM GMT
Next Story