Telugu Global
Health & Life Style

‘ఆ రెండు మందులపై సమాధానం చెప్పండి’... కేంద్రాన్ని అడిగిన సుప్రీం కోర్టు !

రెమ్ డెసివిర్, ఫావిపిరవిర్… ఈ రెండు మందులను కోవిడ్ 19 చికిత్సలో వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లేకుండానే వీటిని కోవిడ్ చికిత్సకి వాడుతున్నారంటూ సుప్రీం కోర్టులో  పిటీషన్ దాఖలు కాగా ఈ విషయంపై సమాధానం చెప్పాల్సిందిగా కోర్టు  ప్రభుత్వాన్ని కోరింది. ఈ రెండు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19కి వాడవచ్చని అధికారికంగా వెల్లడించలేదని తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పిటీషనర్… న్యాయవాది ఎమ్ ఎల్ శర్మ పేర్కొన్నారు. […]

‘ఆ రెండు మందులపై సమాధానం చెప్పండి’... కేంద్రాన్ని అడిగిన సుప్రీం కోర్టు !
X

రెమ్ డెసివిర్, ఫావిపిరవిర్… ఈ రెండు మందులను కోవిడ్ 19 చికిత్సలో వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లేకుండానే వీటిని కోవిడ్ చికిత్సకి వాడుతున్నారంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు కాగా ఈ విషయంపై సమాధానం చెప్పాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.

ఈ రెండు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19కి వాడవచ్చని అధికారికంగా వెల్లడించలేదని తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పిటీషనర్… న్యాయవాది ఎమ్ ఎల్ శర్మ పేర్కొన్నారు.

న్యాయమూర్తులు ఎస్ఎ బాబ్డే, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసుని విచారిస్తూ ఇది చాలా తీవ్రమైన విషయమని, కేంద్ర ప్రభుత్వానికి దీనిపై నోటీసు జారీ చేస్తున్నామని తెలిపింది.

అక్టోబరు 15న ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం రెమ్ డెసివిర్ ని కొన్నివందల సార్లు పరీక్షించి చూశారు. కొన్నిసార్లు చాలా తక్కువ ఫలితాన్ని ఇవ్వగా కొన్నిసార్లు అసలేమాత్రం ఫలితం చూపించలేదు. రెమ్ డెసివిర్, ఫావిపిరవిర్ రెండూ యాంటీ వైరల్ డ్రగ్స్. అయితే కోవిడ్ 19 విషయంలో ఇవి ఎంత వరకు పనిచేస్తాయనే దానిపై ఇంకా ఒక నిర్దిష్టమైన సమాధానం లేదు.

సెప్టెంబరు 16న సుప్రీంకోర్టు ‘నూతన మందులు…క్లినికల్ ట్రైల్స్ రూల్స్ 2018’ ప్రకారం… ఈ రెండు మందులకు ప్రభుత్వ అనుమతి ఉందని చెప్పింది. అయితే శర్మ తాను వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో…ఈ రెండు మందులను కేంద్ర ఔషధాల ప్రామాణిక నియంత్రణ సంస్థ అనుమతులు లేకుండానే అక్రమంగా తయారుచేసి అమ్ముతున్నారని పేర్కొన్నారు.

1940 ఔషధ చట్టం ప్రకారం ఆయా భారతీయ కంపెనీలపై కేసులు నమోదు చేసి విచారించాలని ఆయన కోర్టుని కోరారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఈ రెండు మందులు కోవిడ్ 19 చికిత్సకు తగినవని ప్రకటించలేదని, వీటిని తయారు చేస్తున్న కంపెనీలు మరీ ఎక్కువ ధరలకు భారత్ లో అమ్ముతున్నాయని, జనం కోవిడ్ భయంతో వాటిని కొంటున్నారని… ఫలితం లేక ప్రాణాలకు ముప్పుతెచ్చుకుంటున్నారని శర్మ తన పిల్ లో పేర్కొన్నారు.

పది ఔషధ తయారీ కంపెనీల పేర్లను తన పిటీషన్ లో చేర్చిన శర్మ… తన పిటీషన్ పై స్పందించాల్సిన బాధ్యులుగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖని, కేంద్ర ఔషధాల ప్రామాణిక నియంత్రణ సంస్థని పేర్కొన్నారు.

First Published:  30 Oct 2020 1:52 AM GMT
Next Story