Telugu Global
International

వ్యాక్సిన్‌ రాకముందే పంపిణీ పై అభిప్రాయభేదాలు

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కి ఎన్నికల హామీల్లో కూడా చోటు దక్కింది. మేం అధికారంలోకి వస్తే వ్యాక్సిన్ ఫ్రీ అంటూ కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. అసలు కరోనా వ్యాక్సిన్ తొలిదశలో ఎవరికి ఇవ్వాలో లిస్ట్ పంపించండి అంటూ.. కేంద్రం రాష్ట్రాలకు ఓ సూచన చేసిందని, దాని ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పేరున్న వైద్య […]

వ్యాక్సిన్‌ రాకముందే పంపిణీ పై అభిప్రాయభేదాలు
X

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కి ఎన్నికల హామీల్లో కూడా చోటు దక్కింది. మేం అధికారంలోకి వస్తే వ్యాక్సిన్ ఫ్రీ అంటూ కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. అసలు కరోనా వ్యాక్సిన్ తొలిదశలో ఎవరికి ఇవ్వాలో లిస్ట్ పంపించండి అంటూ.. కేంద్రం రాష్ట్రాలకు ఓ సూచన చేసిందని, దాని ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పేరున్న వైద్య సిబ్బంది జాబితా తయారవుతోందని కూడా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఓ విలువైన సూచన చేశారు. కరోనా వ్యాక్సిన్ తో వివిధ దేశాలు తమ ప్రజలనే మొదట కాపాడుకోవాలనుకోవటం సహజమేనని.. అయితే దీనివల్ల కొవిడ్‌ నిర్మూలనకు మరింత సమయం పడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ధనిక దేశాలు తొలుత వ్యాక్సిన్ ని తమ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తే.. పేద దేశాలన్నీ ఇబ్బంది పడతాయని స్పష్టం చేశారు.

అంటే.. కేవలం ధనిక దేశాల్లో కరోనా తగ్గిపోయినంత మాత్రాన ఫలితం లేదని పేద దేశాలలో కరోనా విజృంభిస్తుంటే.. ధనిక దేశాలకు అది ఎంతమాత్రం లాభదాయకం కాదని తేల్చి చెప్పారు. కేవలం కొన్ని దేశాల్లో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం కంటే.. అన్ని దేశాల్లో కొందరికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా.. సమతూకం ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భేదాభిప్రాయాలు పక్కనపెట్టి ఏకతాటిపై నడవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. బెర్లిన్‌లో జరుగుతున్న మూడు రోజుల వరల్డ్ హెల్త్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సంస్థ డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్‌ అథనోమ్ తన వీడియో సందేశాన్ని వినిపించారు.

కొవిడ్‌-19 టీకా విషయంలో జాతీయవాదాన్ని పాటించటం తెలివైన చర్య కాదని ఆయన అన్నారు. ధనిక దేశాలతోపాటు, పేద దేశాలకు కూడా టీకా సక్రమంగా అందినప్పుడే ఇది సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వందల సంఖ్యలో కొవిడ్ వ్యాక్సిన్ పై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వాటిలో కొన్ని మూడో దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సంపన్న దేశాలైన అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ సహా వివిధ యూరోపియన్‌ దేశాలు ఆయా ఫార్మా సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ రేసులో పేద దేశాలు వెనుకబడటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ‘కోవాక్స్‌’ పేరుతో అంతర్జాతీయ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంది. అయితే ఈ సంస్థకు అమెరికా నిధులు ఆపేయడంతో ఆ ప్రక్రియకు విఘాతం కలుగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా 11 లక్షలమందిని బలి తీసుకుంది. సగానికి పైగా కొత్త కేసులు యూరోపియన్‌ దేశాలకు చెందినవే కావటం గమనార్హం.

ఉత్తరార్థ గోళంలో ఉన్న దేశాలు కరోనా విజృంభణ ముంగిట్లో ఉన్నట్టు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వస్తే కేవలం ధనిక దేశాలు దాన్ని గంపగుత్తగా స్వాధీనం చేసుకోకూడదని, పేద దేశాలతో కలసి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని విలువైన సూచన చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్. మరి ఈ సలహాను ధనిక దేశాలు పాటిస్తాయో లేదో చూడాలి.

First Published:  26 Oct 2020 5:21 AM GMT
Next Story