ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రైల్... వాలంటీర్ మృతి !
కోవిడ్ వ్యాక్సిన్ లకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్లినికల్ ట్రైల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని వ్యాక్సిన్ ల పేర్లు మరింతగా ప్రచారంలోకి వచ్చాయి. అందులో హార్వర్డ్ యూనివర్శిటీ తయారుచేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ వ్యాక్సిన్ ఒకటి. అయితే దీని గురించి ఒక ఆందోళనకరమైన వార్త బయటకు వచ్చింది. ఈ వ్యాక్సిన్ ట్రైల్స్ లో పాల్గొన్న వాలంటీర్ ఒకరు బ్రెజిల్ లో కోవిడ్ తో మరణించినట్టుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ మీడియా నివేదికలు మాత్రం… అతనికి ఇచ్చింది వ్యాక్సిన్ […]
కోవిడ్ వ్యాక్సిన్ లకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్లినికల్ ట్రైల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని వ్యాక్సిన్ ల పేర్లు మరింతగా ప్రచారంలోకి వచ్చాయి. అందులో హార్వర్డ్ యూనివర్శిటీ తయారుచేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ వ్యాక్సిన్ ఒకటి.
అయితే దీని గురించి ఒక ఆందోళనకరమైన వార్త బయటకు వచ్చింది. ఈ వ్యాక్సిన్ ట్రైల్స్ లో పాల్గొన్న వాలంటీర్ ఒకరు బ్రెజిల్ లో కోవిడ్ తో మరణించినట్టుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ మీడియా నివేదికలు మాత్రం… అతనికి ఇచ్చింది వ్యాక్సిన్ కాదని… వ్యాక్సిన్ అని నమ్మించి ఇచ్చే డమ్మీ మందు (ప్లేస్ బో) అని పేర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ట్రైల్స్ లో వాలంటీర్ మరణించడం ఇదే మొదటి కేసు.
అయితే వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి భయాలు లేవని, నిపుణుల చేత నిర్వహించబడిన ఒక ఇండిపెండెంట్ రివ్యూలో సైతం ఇదే తేలిందని, కనుక వ్యాక్సిన్ ని పరీక్షించడం కొనసాగుతుందని ట్రైల్స్ నిర్వహిస్తున్న ఆక్స్ ఫార్డ్ పేర్కొంది.
మరణించిన వాలంటీర్ 28 సంవత్సరాల వయసున్న వైద్యుడని మీడియా పేర్కొంది. కోవిడ్ ని ఎదుర్కోవటంలో నిరంతరం శ్రమిస్తున్న ఈ వైద్యుడు కోవిడ్ లక్షణాలతో మృత్యువాత పడ్డాడు.
బ్రెజిల్ వార్తా పత్రిక గ్లోబో, అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్… అతను వ్యాక్సిన్ ట్రైల్స్ లో కంట్రోల్ గ్రూపులో ఉన్నాడని, అతనికి ఇచ్చింది వ్యాక్సిన్ కాదని, డమ్మీ మందు ప్లేస్ బో మాత్రమేనని పేర్కొన్నాయి. వైద్యపరమైన గోప్యతా నిబంధనలను బట్టి ఆ వాలంటీర్ వివరాలను ఇవ్వలేమని ఆస్ట్రాజెనికా తెలుపగా, బ్రెజిల్ లోని జాతీయ ఆరోగ్య సంస్థ అన్విశా… ఈ సంఘటన ఈ నెల 19న జరిగినట్టుగా పేర్కొంది.
ఆక్స్ ఫార్ట్, ఆస్ట్రాజెనికా గతంలో ఒకసారి క్లినికల్ ట్రైల్స్ ని నిలిపివేశాయి. బ్రిటన్ లో ఒక వాలంటీర్ నిర్దిష్టంగా ఇదీ అని చెప్పలేని అనారోగ్య పరిస్థితికి గురికావటంతో అలా చేయాల్సి వచ్చింది. అయితే బ్రిటీష్ వైద్య సంస్థలు, ఇండిపెండెంట్ రివ్యూ… ఆ సమస్యలు వ్యాక్సిన్ కారణంగా వచ్చినవి కావని చెప్పాక తిరిగి పరీక్షలు కొనసాగించారు. బ్రెజిల్ లో 8వేలమంది వాలంటీర్లకు, ప్రపంచవ్యాప్తంగా 20వేలమంది వాలంటీర్లకు వాక్సిన్ ఇవ్వటం జరిగింది.