Telugu Global
International

మాస్క్ వలన చెవుల నొప్పి... ఓ మంచి పరిష్కారం !?

ముఖానికి ధరించే మాస్క్… కోవిడ్ నియంత్రణకు సహాయపడుతుంది కానీ… అలవాటు లేని ఈ ముసుగుని రోజంతా ధరించి ఉండటం మాత్రం కాస్త ఇబ్బందే. చెవులు లాగినట్లై నొప్పి కలిగే అవకాశం ఉంది. చాలామందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతుండవచ్చు. మాస్క్ కారణంగా ఇలాంటి నొప్పులు కలగకుండా ఒక చక్కని పరికరాన్ని కనుక్కుంది దిగంతికా బోస్ అనే అమ్మాయి. పన్నెండవ తరగతి చదువుతున్న పదిహేడేళ్ల దిగంతిక… పశ్చిమ బెంగాల్ లోని బర్దమాన్ జిల్లాకు చెందిన అమ్మాయి. మాస్క్ ధారణతో చెవులకు […]

మాస్క్ వలన చెవుల నొప్పి... ఓ మంచి పరిష్కారం !?
X

ముఖానికి ధరించే మాస్క్… కోవిడ్ నియంత్రణకు సహాయపడుతుంది కానీ… అలవాటు లేని ఈ ముసుగుని రోజంతా ధరించి ఉండటం మాత్రం కాస్త ఇబ్బందే. చెవులు లాగినట్లై నొప్పి కలిగే అవకాశం ఉంది. చాలామందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతుండవచ్చు. మాస్క్ కారణంగా ఇలాంటి నొప్పులు కలగకుండా ఒక చక్కని పరికరాన్ని కనుక్కుంది దిగంతికా బోస్ అనే అమ్మాయి. పన్నెండవ తరగతి చదువుతున్న పదిహేడేళ్ల దిగంతిక… పశ్చిమ బెంగాల్ లోని బర్దమాన్ జిల్లాకు చెందిన అమ్మాయి.

మాస్క్ ధారణతో చెవులకు నొప్పి, ఒత్తిడి కలగకుండా… తలకు ధరించే వీలున్న హెడ్ బ్యాండ్ ని రూపొందించింది ఈమె. ముఖ్యంగా కోవిడ్ నియంత్రణలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని దిగంతిక హెడ్ బ్యాండ్ ని తయారుచేసింది. ఈ రూపకల్పనకు గానూ దిగంతిక… జాతీయ సైన్స్ పోటీల్లో అవార్డుని సైతం పొందింది. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ చిల్డ్రన్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2020ని సాధించిన తొమ్మిది మంది పిల్లల్లో దిగంతిక కూడా ఉంది.

కోవిడ్ నియంత్రణలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఎక్కువ గంటలు మాస్క్ లను ధరించి పనిచేయాల్సినందున మాస్కుల వలన చెవులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, వారికి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలనే దీనిని రూపొందించానని, దీనిని పనికిరాని ప్లాస్టిక్ లేదా వంచేందుకు వీలుగా ఉన్న మరేదైనా మెటీరియల్ తో తయారుచేయవచ్చని దిగంతిక తెలిపింది.

దిగంతిక తయారుచేసిన హెడ్ బ్యాండ్ కొనలను మాస్క్ కి ఇరువైపులా తగిలించి తల వెనుక భాగంలో బ్యాండ్ ని అమర్చుకోవాలి. అంటే మొహంపైన ఉన్న మాస్క్ కి అనుసంధానించి ఉన్న హెడ్ బ్యాండ్ తల వెనుక భాగంలో ఉండి… మాస్క్ ని పట్టి ఉంచుతుంది. అదే సమయంలో అది ఫ్లెక్సిబుల్ గా ఉండటం వలన కావలసినంత బిగుతుతో, సౌకర్యంగా కూడా ఉంటుంది. దీనిని వాడటం వలన చెవులకు ఎలాంటి బాధ ఉండదు.

ఇదేకాదు… ఇంతకుముందుకూడా దిగంతిక… కోవిడ్ 19ని నిరోధించేందుకు పనికొచ్చే ఐదు పరికరాలను కనుగొంది. సౌకర్యవంతంగా గాలిని అందిస్తూ… వైరస్ ని అడ్డుకునే మాస్క్ వాటిలో ఒకటి. దిగంతిక ఈ మాస్క్ ని ఏప్రిల్ లో తయారుచేయగా… ఇది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ పోటీల్లో చివరి స్థాయి వరకు వెళ్లింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గుర్తింపుని సైతం పొందింది.

తమ కుమార్తెకు పరిశోధనలంటే చాలా ఇష్టమని దిగంతిక తండ్రి సుదీప్త బోస్ అన్నారు. తన ఆలోచనలకు పలురకాల అవార్డులను ఆమె అందుకుందని ఆయన తెలిపారు.

First Published:  20 Oct 2020 8:40 AM GMT
Next Story