Telugu Global
CRIME

ఒకే కుటుంబంలోని నలుగురు చిన్నారుల హత్య!

మహారాష్ట్రలోని జలగాన్ జిల్లాలో ఒకే కుటుంబంలోని నలుగురు చిన్నారులు దారుణహత్యకు గురయ్యారు.  12, 11,8, 3 సంవత్సరాల వయసున్న సంగీత, రాహుల్, అనిల్, సుమన్ అనే ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు మెహతాబ్, రుమాలీ బాయి భిలాలా. ఈ భార్యాభర్తలకు సంజయ్ అనే పదహారేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. రవేర్ తాలూకాలోని బోర్కెడా షివర్ గ్రామంలో ఓ అరటిపళ్ల తోటలో ఈ కుటుంబం నివసిస్తోంది. రవేర్ పట్టణానికి ఈ గ్రామం కిలోమీటరు దూరంలో ఉంటుంది. పోలీసులు చెబుతున్న […]

ఒకే కుటుంబంలోని నలుగురు చిన్నారుల హత్య!
X

మహారాష్ట్రలోని జలగాన్ జిల్లాలో ఒకే కుటుంబంలోని నలుగురు చిన్నారులు దారుణహత్యకు గురయ్యారు. 12, 11,8, 3 సంవత్సరాల వయసున్న సంగీత, రాహుల్, అనిల్, సుమన్ అనే ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు మెహతాబ్, రుమాలీ బాయి భిలాలా. ఈ భార్యాభర్తలకు సంజయ్ అనే పదహారేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. రవేర్ తాలూకాలోని బోర్కెడా షివర్ గ్రామంలో ఓ అరటిపళ్ల తోటలో ఈ కుటుంబం నివసిస్తోంది. రవేర్ పట్టణానికి ఈ గ్రామం కిలోమీటరు దూరంలో ఉంటుంది.

పోలీసులు చెబుతున్న వివరాలను బట్టి మెహతాబ్, రుమాలీ, సంజయ్ ముగ్గురు కలిసి మధ్యప్రదేశ్ ఖార్గోన్ జిల్లాలోని గాధీ అనే తమ సొంత గ్రామానికి… మరణించిన ఓ బంధువు అంత్యక్రియల నిమిత్తం వెళ్లారు. చిన్నపిల్లలందరినీ కనిపెట్టుకుని ఉండమని తాము నివసిస్తున్న ఇల్లు, అరటితోటల యజమాని ముష్తాఖ్ షైక్ కి చెప్పి వెళ్లారు.

భిలాలా కుటుంబం బతుకుతెరువుకోసం మధ్యప్రదేశ్ నుండి ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రకు వలస వచ్చింది. ఈ కుటుంబం చాలా పేదరికాన్ని భరిస్తోందని, ఇంట్లో కనీస అవసరాలైన వస్తువులు మాత్రమే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 350మంది ప్రజలు ఉన్న గ్రామంలో గిరిజన కుటుంబం వీరిదొక్కటే. పవారా అనే గిరిజన తెగకు చెందినవారు వీరు. పిల్లల్లో పెద్దవాళ్లయిన సంజయ్, సంగీతలు రవేర్ టౌన్ లోని స్కూల్లో 11, 9 తరగతులు చదువుతున్నారు.

శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు షేక్… పిల్లలను నిద్రలేపేందుకు వెళ్లగా తలుపు వేసి ఉంది. పిల్లలు ఇంకా నిద్రపోతున్నారా… అని ఆశ్చర్యపోయిన షేక్ తలుపుతీసి లోపలికి వెళ్లగా… వాళ్లందరూ రక్తపు మడుగులో కనిపించారు. ఒక గొడ్డలి నేలపై పడి ఉంది. భయభ్రాంతులకు గురయిన షేక్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో నాసిక్ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జలగాన్ సూపరింటెండెంట్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు వెంటనే సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. ఫోరెన్సిక్, ఫిగర్ ప్రింట్ నిపుణులు, జిల్లా పోలీసుల డాగ్ స్క్వాడ్… హత్యలు జరిగిన ఇంటిని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హత్యలను ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం పనిచేస్తుందని జలగాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ ముంఢే తెలిపారు. హత్యలవెనుక ఉన్న కారణాలు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.

చిన్నారుల మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం జల్ గాన్ జిల్లా హాస్పటల్ కి తరలించారు. విషయం తెలియగానే పిల్లల తల్లిదండ్రులు, సోదరుడు వెంటనే బయలుదేరి మహారాష్ట్రకు వచ్చి… పిల్లల మృతదేహాలున్న హాస్పటల్ కి వెళ్లారు. జలగాన్ రూరల్ ఎమ్మెల్యే, మంత్రిహోదాలో ఉన్న గులాబ్ రావ్ పాటిల్… అత్యంత వేగంగా దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకోవాల్సిందిగా పోలీసులను కోరినట్టుగా చెప్పారు.

Next Story