కోవిడ్ ‘చెత్త’.... ఎంతో తెలుసా?!
కరోనా కారణంగా కాస్త పర్యావరణ పరిశుభ్రత పెరిగిందని, గాలిలో కాలుష్యం తగ్గిందని అనుకుంటున్నాం కదా… అయితే ఇది తగ్గించిన కాలుష్యం సంగతేమో కానీ… పెంచిన చెత్త మాత్రం చాలానే ఉంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు భారత్ లో కోవిడ్ కారణంగా పెరిగిన బయోమెడికల్ వ్యర్థాల పరిమాణం 18,006 టన్నులు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కాలుష్య నియంత్రణ మండలుల నుండి అందిన సమాచారం ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ వివరాలను వెల్లడించింది. కరోనా […]
కరోనా కారణంగా కాస్త పర్యావరణ పరిశుభ్రత పెరిగిందని, గాలిలో కాలుష్యం తగ్గిందని అనుకుంటున్నాం కదా… అయితే ఇది తగ్గించిన కాలుష్యం సంగతేమో కానీ… పెంచిన చెత్త మాత్రం చాలానే ఉంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు భారత్ లో కోవిడ్ కారణంగా పెరిగిన బయోమెడికల్ వ్యర్థాల పరిమాణం 18,006 టన్నులు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కాలుష్య నియంత్రణ మండలుల నుండి అందిన సమాచారం ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ వివరాలను వెల్లడించింది.
కరోనా కేసుల విషయంలో ముందున్న మహారాష్ట్రలోనే ఈ వ్యర్థాలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నాలుగునెలల్లో 3,587 టన్నుల కోవిడ్ వ్యర్థాలున్నట్టుగా తేలగా ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, గుజరాత్, కేరళ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. సెప్టెంబరు… అత్యధిక స్థాయిలో కోవిడ్ వ్యర్థాలు నమోదైన నెల. ఈ నెలలో కోవిడ్ వ్యర్థాల పరిమాణం 5,500 టన్నులు.
కరోనా వైరస్ నిర్దారణ, చికిత్సల సందర్భాల్లో ఉపయోగించిన పరికరాలు, వస్తువుల తాలూకూ వ్యర్థాలను 198 ‘కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్’ ద్వారా సమీకరించి డిస్పోజ్ చేస్తున్నారు. పిపిఇ కిట్లు, మాస్కులు, షూ కవర్లు, గ్లవుజులు, మానవ కణజాలం, డ్రెస్సింగ్ కి వాడిన మెటీరియల్, కాటన్ స్క్వాబ్స్, రక్తం ఇంకా శరీరంలోని ద్రవాలతో తడిసిన దుప్పట్లు దిండ్లు, బ్లడ్ బ్యాగులు, నీడిల్స్… వంటివి ఈ వ్యర్థాల్లో ఉన్నాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్చి నెలలోనే… వ్యర్థాల విషయంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇళ్లలో, క్వారంటైన్ కేంద్రాల్లో, హెల్త్ కేర్ సెంటర్లలో, శాంపిల్ కలెక్షన్ కేంద్రాల్లో… ఇలా వ్యర్థాలు పోగయ్యే ప్రదేశాల్లో, వాటిని సమీకరించే ప్రాంతాల్లో…. వాటిని ఎలా పట్టుకోవాలి, ఎలా విడగొట్టాలి, ఎలా డిస్పోజ్ చేయాలి… లాంటి విషయాల్లో ఈ మార్గదర్శకాలు ఉపకరిస్తాయి.
కోవిడ్ వ్యర్థాలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ‘కోవిడ్ బిడబ్యుఎమ్’ అనే మొబైల్ యాప్ ని మే నెలలో డెవలప్ చేసింది. స్థానిక పాలనా సంస్థలు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలులు ఈ యాప్ ని తప్పకుండా వినియోగించాలని, ప్రతిరోజు బయోమెడికల్ వ్యర్థాలను ట్రాక్ చేసి… అవి సమీకరించబడి నమోదైన ‘కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్’ లకు చేరేలా చూడాలని సుప్రీంకోర్టు సైతం ఉత్తర్వులు జారీ చేసింది.