Telugu Global
Arts & Literature

రాత్రి ఏకాంతాన్ని వెలిగించే సాహిత్యం – గుడిపాటి

ఈ సాయంత్రం ఎందుకో రవిప్రకాష్‌ గురించి పంచుకోవాలనిపించింది. తన మూడు పుస్తకాలు చెంతన కనిపిస్తుండగా… ఆ పుస్తకాల సుగంధాలని ఆస్వాదిస్తూ, తన గురించి ఆలోచిస్తూ… తన గురించి ఏదో చెప్పాలనిపిస్తోంది… మంచి కవిత్వంతోపాటు మంచి వచనం రాయగలిగిన కవులు అరుదు. ఈ అరుదయిన వారిలో నాకు నచ్చిన కవిమిత్రుడు ఆకెళ్ళ రవిప్రకాష్‌. సమ్మోహనపరిచే అతని వచనశైలి నాకు ఇష్టం. అతని కవిత్వమూ ఇష్టం. కవులు నిరంతరం కవిత్వమే రాయాలనేం లేదు. కవిత్వం తప్ప మరొకటి రాయకూడదన్న నియమమూ […]

రాత్రి ఏకాంతాన్ని వెలిగించే సాహిత్యం – గుడిపాటి
X

ఈ సాయంత్రం ఎందుకో రవిప్రకాష్‌ గురించి పంచుకోవాలనిపించింది. తన మూడు పుస్తకాలు చెంతన కనిపిస్తుండగా… ఆ పుస్తకాల సుగంధాలని ఆస్వాదిస్తూ, తన గురించి ఆలోచిస్తూ… తన గురించి ఏదో చెప్పాలనిపిస్తోంది…
మంచి కవిత్వంతోపాటు మంచి వచనం రాయగలిగిన కవులు అరుదు.

ఈ అరుదయిన వారిలో నాకు నచ్చిన కవిమిత్రుడు ఆకెళ్ళ రవిప్రకాష్‌. సమ్మోహనపరిచే అతని వచనశైలి నాకు ఇష్టం. అతని కవిత్వమూ ఇష్టం. కవులు నిరంతరం కవిత్వమే రాయాలనేం లేదు. కవిత్వం తప్ప మరొకటి రాయకూడదన్న నియమమూ అక్కర్లేదు. నిజమైన సృజనశీలురు ఏదో ఒక ప్రక్రియకు పరిమితం కాలేరు. ఉండబట్టలేక కవిత్వం రాస్తారు. కానీ కొన్ని అంశాలని కవిత్వం ద్వారానే చెప్పలేరు. అందుకని వచనమూ రాస్తారు. అయితే ఫలానా వ్యక్తి ప్రధానంగా కవినా, వచన రచయితనా అనే చర్చ చేయబోతారు. కానీ ఈ విచికిత్స అనవసరం. ఇస్మాయిల్‌ కవిగా ప్రసిద్ధులు. కానీ ఆయనకు విమర్శనా రంగంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది. ఆయన విమర్శనా వ్యాసంగాన్ని సాహిత్యకారులు పట్టించుకోకపోతే అది వారి కర్మ. లేదా వారి దివాళాకోరుతనం.

ఆకెళ్ళ రవిప్రకాష్‌ చాలా కాలంగా కవిత్వమూ, వచనమూ రాస్తున్నారు. తొలుత కవిగా, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థిగా పరిచయం. అప్పట్లో సివిల్‌ సర్వీసు పరీక్షల కోసం చదువుతున్న ఆకెళ్ళ రవిప్రకాష్‌ ఒకటీరెండుసార్లు కలిసాడు. ఆ రోజులలో నూతన ఆర్థిక విధానాల గురించి చర్చల్లాంటివి చేసినట్టు గుర్తు. వి.వి.రమణమూర్తి, నేను ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌లో ఒక గదిలో ఉండేవాళ్ళం. గాలి నాసరరెడ్డి కూడా వచ్చేవారు. ఆ క్రమంలో అశోక్‌నగర్‌లోనో, మరో చోటనో ఏ ఇరానీకేఫ్‌లోనో, ఆ గదిలోనో కలుసుకున్న సందర్భాలు గుర్తున్నాయి.
ఆ తరువాత ఎవరి బతుకు ఒరవడిలో వారు సాగిపోయాం. జర్నలిస్టుగా నేను, తను పుదుచ్చేరిలో సివిల్‌ సర్వీసు అధికారిగా బతుకు పయనం…. ఈ క్రమంలో మొదట పాలపిట్ట బుక్స్‌, ఆ తరువాత పాలపిట్ట ప్రారంభించడం… అనుకోకుండా ఒకరోజు రవిప్రకాష్‌ నుంచి ఫోను వచ్చింది.

2009-2010 నుంచి మరల మా పరిచయం స్నేహంగా పరిణమించి కొనసాగుతోంది. మరో మొహంజోదారో రావడం తెలుసు. ఇసుక గుడి గురించి ఆలస్యంగా తెలుసుకున్నా. చాన్నాళ్ళ తరువాత మరల ప్రేమప్రతిపాదన తో కవితాప్రియులను పలకరించాలనుకున్నాడు ఆకెళ్ళ రవిప్రకాష్‌. అక్బర్‌ అందమైన కవర్‌డిజైన్‌తో ప్రేమప్రతిపాదన వచ్చింది. అచ్చుకు ముందు ఆ కవిత్వం చదివే అదృష్టం నాకు దక్కింది. 2010 డిసెంబర్‌లో వచ్చిందీ సంపుటి. ఆ తరువాత 2018లో భూమి పుట్టిన రోజు కవితా సంపుటి వెలువడింది. ఈ రెండు సంపుటాలకు నడు మ ఆకెళ్ళ రవిప్రకాష్‌ సాహిత్య ప్రయాణం దగ్గరగా గమనించా. అతని వ్యక్తిత్వం, సాహిత్య మూర్తిమత్వంలో ఒక ఆకర్షణ ఉంది. అదేమిటో చెప్పలేను గానీ సృజనశీలిగానే మనకు దగ్గరవుతాడు. వృత్తిరీత్యా అధికారి అయినప్పటికీ దానికి సంబంధించిన ఛాయ వ్యవహారశైలిలో లేశమాత్రమైనా పొడసూపదు. బహుశా ఇది నాకు బాగా నచ్చిందేమో.

వృత్తిరీత్యా అధికారి అనగానే అందునా సివిల్‌ సర్వీసు అధికారి అనగానే అతనిలో అహం ఉంటుందని, గర్వం తొణికిసలాడుతుంటుందని సాధారణంగా అనుకుంటారు. ఆ దర్పం వారు ప్రదర్శించకున్నా మనమే ఆ భ్రమకు లోనవుతాం. చాన్నాళ్ళ కిందట అధికారులలో రచయితలు, కవులు అని ఒక ఫీచర్‌ కూడా చేశా. ఆ సందర్భంగా చాలామందిని కలిసాను. కొందరు సృజనశీలురుగా దర్శనమిస్తే, కొందరు తాము రచయితలమే కాదు అధికారం ఉన్న రచయితలమనే ఎరుక కల్పించారు. ఆ సమయంలో ఆకెళ్ళ రవిప్రకాష్‌ని మాత్రం మరిచిపోయాను. అది కూడా ఇపుడు ఈ రైటప్‌ రాస్తుంటే గుర్తుకొచ్చింది. తెలుగు ప్రాంతాలకు ఆవల ఉన్నవారిని మనం అంతగా పట్టించుకోం కదా అనిపించింది. నిజమే, ఆకెళ్ళ రవిప్రకాష్‌ని నేనే కాదు, చాలామంది దగ్గరి మిత్రులు కూడా కనీసం పలకరించలేదు. నిజానికి నా కన్నా ఆ రోజులలో దగ్గరగా ఉన్న మిత్రులు వేరే ఉన్నారు. సరే తనకే ఆ ఫిర్యాదులు లేవు, ఇపుడు మనకు కూడా అక్కర్లేదు.

ప్రేమ ప్రతిపాదన తో తను సాహిత్యరంగంలో క్రియాశీలకంగా ఉన్నారు. కవితలే కాదు వ్యాసాలు, యాత్రా కథనాలు రాశారు. ఇపుడు కథలు రాస్తున్నారు.

2014 తరువాత విశాఖకు గిరిజన సహకార సంస్థ ఎం.డి.గా వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వచ్చినపుడల్లా కలిసేవారు. తెలుగు పుస్తకాల కోసం ఆబగా వెదుక్కునేవారు. మంచి కవిత్వం పుస్తకాలు పంపించమని అడిగేవారు. వృత్తి, ప్రవృత్తుల రీత్యా అంగలకుర్తి విద్యాసాగర్‌ని కలిసేవారు. యాకూబ్‌, శివారెడ్డిలను వీలయినపుడల్లా కలవడానికి ప్రయత్నించేవారు. ఫోన్లలో నయినా, కలిసినపుడయినా సాహిత్యం, పుస్తకాల గురించి మాట్లాడుకునేవాళ్ళం.
కొన్ని పుస్తకాల గురించి రాయవచ్చును కదా అని అడిగితే… మన ఆనందం కోసం చదువుకుంటాం., రాస్తే మనది జ్ఞాన ప్రదర్శన అనుకుంటారేమో అనేవారు. కానీ తను చదివిన పుస్తకాల గురించి ఎప్పటికయినా రాయాలి. ముఖ్యంగా తనను వెంటాడి, తనలో పలు ఆలోచనలకు లోను చేసిన పుస్తకాల గురించి రవిప్రకాష్‌ రాయాలి. అరుదుగా రాసే రచయిత కాదు రవిప్రకాష్‌. రాయాలని ఉన్నప్పటికీ రాయడానికి తీరిక చిక్కక రాయలేకపోతున్నాడని గమనించా.

ఏదో చెప్పాలన్న తపన, తనని తాను వ్యక్తం చేసుకోవాలన్న ఆరాటం ఉన్న రచయిత ఏదో సమయాన పరంపరగా రాస్తాడు. లాక్‌డౌన్‌ కాలాన్ని తను ఉపయోగించుకున్న తీరే ఇందుకు నిదర్శనం.
లాక్‌డౌన్‌ కాలాన్ని ఇంత బాగా ఉపయోగించుకున్న రచయిత మరొకరు కనిపించలేదు. మూడు పుస్తకాలు తీసుకొచ్చారు.

1. అరకు అనుభవాలు… నిజాయితీ, సున్నితత్వం, ప్రజల పట్ల ఉన్న మమకారం, ప్రేమ ఉన్న అధికారి అనుభవాలు ఇవి. నాలుగేళ్ళ పాటు విశాఖలోని జిసిసి (గిరిజన సహకార సంస్థ) ఎం.డి.గా అనేక గ్రామాలు తిరిగారు. ఆదివాసీలను నేరుగా కలిసారు. అరకు కాఫీకి పేరు తెచ్చిన ఘనత ఆయనదే. అరకు అనగానే ఆ ప్రాంత అందచందాల గురించే అందరూ ఆలోచిస్తారు. కానీ ఆ ప్రాంతాలలో నివాసముంటున్న ఆదివాసీలకు సంబంధించిన ఆలోచనలు మన మానసిక స్రవంతిలో తిరుగాడవు. అధికారిగా, రచయితగా, సున్నిత మనస్కుడయిన సృజనశీలిగా ఆకెళ్ళ రవిప్రకాష్‌ అనుభవాలు తెలుసుకోవడం కోసం ఈ పుస్తకం చదవాలి.

2. చంద్రుణ్ణి చూపించే వేలు – విమర్శనా వ్యాసాల పుస్తకం. ఒక కవికి సాటి కవుల పట్ల ఉండే ప్రేమ, రచయితల పుస్తకాలపై ఉండే మమకారం ఏమిటో తెలుస్తుంది ఈ పుస్తకం చదివితే. వీటిలో ప్రసేన్‌ గురించి రాసిన వ్యాసం మరింత ప్రత్యేకం. అంగలకుర్తి విద్యాసాగర్‌ని ఏవిధంగా అర్థం చేసుకోవాలో బాగా చెప్పారు. విన్నకోట రవిశంకర్‌ కవిత్వాన్ని ఎలా చూడాలో చెబుతారు. ముఖ్యంగా వాక్యంలోని సొగసుకు థ్రిల్లయిపోతాం. ఒక తెలియని పరవశానికి లోనవుతాం. మోహంతో కూడిన ఇష్టాన్ని పెంచుకుంటాం. ఇంత మంచి వచనం రాసే ఈ కవీశ్వరుడు ఇంకొంచెం ఎక్కువ రాస్తే బాగుండు కదా అనుకుంటాం. వాక్యం రసాత్మకం కావ్యం అని ఇందుకే అన్నారేమో. తన వ్యాసాలు ఈ మధ్యన నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇస్మాయిల్‌ మీద వ్యాసం, ఇస్మాయిల్‌తో ఇంటర్వ్యూ బాగా ఉపయోగించుకున్నా. వీటిని చదవడం మిస్సయితే ఓ అందమైన అధ్యయన అనుభవాన్ని కోల్పోయినట్టే.

3. నిరంతరం – యాత్రాకథనాల పుస్తకం ఇది. శాంతినికేతన్‌ సందర్శనానుభవాలు, ఉత్తర బెంగాల్‌ పర్యటనానుభవాలు, సిక్కిం యాత్ర… మరికొన్ని వ్యాసరాజాలు ఉన్నాయి. ఉత్తర బెంగాల్‌ యాత్ర అయితే మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే గత ఏడాది ఎన్నికల పరిశీలకునిగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు రవిప్రకాష్‌. ఆ పర్యటన ఎంత ఉద్విగ్నభరితమో! అక్కడికి అధికారిగా వెళ్ళినా అతనిలోని సృజనశీలి, పథికుడు, కవి, రచయిత నిరంతరం మెలకువతో ఉండి ప్రతి క్షణాన్ని మనసారా అనుభవంలోకి తీసుకున్న రీతి విస్మయం గొల్పుతుంది. వీటిని చదువుతూ తనతోపాటు మనమూ ఆయా ప్రాంతాలలో తేలియాడుతాం.

ఇలా మూడు పుస్తకాలు తీసుకొచ్చిన రవిప్రకాష్‌ ఈమధ్యన కొన్ని కథలు కూడా రాశాడు. పాండిచ్చేరి కేంద్రంగా తను ఇంకా కొన్ని కథలు రాయాలి. రెండు దశాబ్దాల పైబడి పాండిచ్చేరి నేల సుగంధ పరిమళాలను, వైవిధ్యమయిన సాంస్కృతిక వారసత్వాన్నితనలో లీనం చేసుకున్నందుకయినా రికార్డు చేయాలి.

రవిప్రకాష్‌ నచ్చడానికి మరో కారణం… తను అధికారిగా నిజాయితీగా, బాధ్యతగా ఆలోచిస్తారు, వ్యవహరిస్తారు. తన విధులను త్రికరణశుద్ధిగా నిర్వహించడం అతనిలోని సుగుణం. ఐ.ఏ.ఎస్‌. అధికారిగా ఎంత బాధ్యతగా ఉండాలో తనకు తెలుసు. అలాగే రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రసీ గురించిన అవగాహన ఉంది. తనకు, మనం దగ్గరగా చూస్తున్న మూడు దశాబ్దాల రాజకీయ, ఆర్థిక పరిణామాలు, పర్యవసానాల పట్ల స్పష్టమయిన అవగాహన ఉంది. ఇది ఉండటం వల్లనే అతని సాహిత్య వ్యాసంగంలో స్పష్టత ఉంది. కవిత్వం రాసినా, వచనం రాసినా ఆ అవగాహన తాలుకూ ప్రభావం ఆయా రచనలలో వ్యక్తమవుతుంది.

మరో విషయం… నిరంతరం వృత్తిరీత్యా బిజీగా ఉంటూనే కవిగా, రచయితగా బతికి వుండటం గొప్ప సృజనశీలత్వం. ఇది తెచ్చి పెట్టుకున్నది కాదు., గుర్తింపు కోసం అల్లాడటం కాదు. రాయకుండా ఉండలేనితనంతోనే రాయడం అలవాటు. సమయం లేకున్నా సమయం కుదిరించుకొని రాయడం నాకు నచ్చే లక్షణం. అధ్యాపక వృత్తులలో ఉన్నవారికి ఉండేంత తీరుబడి ఇతరేతర రంగాల వారికి ఉండదు. అందునా కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులకు అస్సలు ఉండదు. అయినప్పటికీ అంతరాంతరాలలోని తపన వారిని నిలువనివ్వదు. ఆ నిలువనియ్యని తనంతోనే రాస్తుంటారు. చదువుతుంటారు. లోకంతో సంభాషిస్తుంటారు.

ఆ విధంగా తన రచనలతో మనలని పలకరిస్తున్న రవిప్రకాష్‌కు లాక్‌డౌన్‌ సమయం బాగా ఉపయోగపడింది. ఈ మూడు పుస్తకాలు వచ్చాయి. వీటిని తను రాసే క్రమాన నాకు చదివే అవకాశం కల్పించాడు. నేను కూడా వెంటనే ఒక వ్యాసం పంపగానే చదవకపోయేవాడిని. ఏ రాత్రో తీరికగా, ఒంటరిగా తన అక్షర లోకాల్లోకి ప్రయాణించే వాణ్ణి. ఆ రాత్రి తన వాక్యాలతో వెలిగిపోయేది.

కవిత్వాన్ని, వచనాన్ని దీప్తిమంతంగా రాసే కొద్దిమంది నా సమకాలీన రచయితలలో, కవులలో రవిప్రకాష్‌ నాకు అత్యంత ఇష్టుడు. మంచి వచనం కోసం తహతహలాడేవారు ఆకెళ్ళ రవిప్రకాష్‌ పుస్తకాలను చదవాలి. అలాగే రాత్రి ఏకాంతంలో మన చేతిలోకి ఏదైనా ఒక కవిత్వ పుస్తకం చేతిలోకి తీసుకోవాలనుకునే వారు తన ప్రేమ ప్రతిపాదన గానీ, భూమి పుట్టిన రోజు గానీ చేతులలోకి తీసుకోవాలి. మీ సమయాన్ని మరింత సృజనాత్మంగా వెలిగించే మాంత్రిక శక్తి ఏదో అతని వచనంలో, కవిత్వంలో దాగుంది. అందుకే మరల మరల రవిప్రకాష్‌ అక్షరాలతో ప్రేమలో పడతాం. అంతటి తాదాత్మ్యతకు లోను చేసే కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు జాషువా చెప్పినట్టు.

Next Story