Telugu Global
Health & Life Style

మంచినీళ్లతో… మంచి శరీర ఆకృతి !

బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో ఎక్కువ నీరు తాగితే మరింత బరువు పెరుగుతామేమో అనే అనుమానం ఉంటుంది కొందరికి. అలాంటివారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. తగినన్ని మంచినీళ్లు తాగకపోతేనే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో 70శాతం నీళ్లే ఉంటాయి. దీనివలన మెటబాలిజం, ఇతర శరీర విధులు సవ్యంగా జరగాలంటే తప్పకుండా తగినన్ని నీళ్లు తాగాలి. నీళ్లే కాకుండా ఇతర ద్రవ పదార్థాలను సైతం తీసుకోవటం మంచిది. అయితే […]

మంచినీళ్లతో… మంచి శరీర ఆకృతి !
X

బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో ఎక్కువ నీరు తాగితే మరింత బరువు పెరుగుతామేమో అనే అనుమానం ఉంటుంది కొందరికి. అలాంటివారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. తగినన్ని మంచినీళ్లు తాగకపోతేనే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మన శరీరంలో 70శాతం నీళ్లే ఉంటాయి. దీనివలన మెటబాలిజం, ఇతర శరీర విధులు సవ్యంగా జరగాలంటే తప్పకుండా తగినన్ని నీళ్లు తాగాలి. నీళ్లే కాకుండా ఇతర ద్రవ పదార్థాలను సైతం తీసుకోవటం మంచిది. అయితే ఏసీల్లోనూ, నీడపట్టున ఉద్యోగాలు చేసేవారికి దాహం తక్కువగా ఉండటం వలన వారు శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తాగక డీ హైడ్రేషన్ కి గురవుతుంటారు. ఇలాంటివారు బరువు పెరిగితే కూర్చుని చేసే ఉద్యోగాల వలన… అనుకుంటారు కానీ నీళ్లు తక్కువగా తాగటం కూడా ఒక కారణమని అర్థం చేసుకోలేరు.

డీ హైడ్రేషన్ కి గురయినవారు అతి తక్కువ కాలంలోనే బరువు పెరిగే అవకాశం ఉందని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లవనీత్ బాత్రా అంటున్నారు. డీ హైడ్రేషన్ కి గురయినవారిలో దాహం తాలూకూ సంకేతాలు తప్పుదోవ పట్టి… అవి మెదడుకి ఆకలి తాలూకూ సంకేతాలుగా వెళతాయని దాంతో వారు మరింత ఎక్కువ ఆహారం తీసుకుంటారని బాత్రా తెలిపారు.

శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. దీనివలన కూడా మరింత ఆహారం తీసుకునే అవకాశం ఉంది. పైగా ఇలాంటప్పుడు తీపి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినాలపిస్తుంది. వీటితో పాటు తగినన్ని నీరు తాగకపోతే మలబద్దకం, పొట్టలో నొప్పి, గడబిడలు, అజీర్తి లాంటి సమస్యలు సైతం పెరుగుతాయి. ఇవన్నీ అధిక బరువుకి దారితీస్తాయి.

వర్కవుట్ చేయడానికి అరగంట ముందు రెండుగ్లాసుల నీరు తాగితే జీవక్రియల వేగం 30శాతం పెరుగుతుంది. అంటే అలా చేసే వ్యాయామంతో మరింతగా బరువు తగ్గుతారు. మంచినీరు ఎక్కువగా తాగటం వలన మన శరీరంలో లిపోలిసిస్ అనే ప్రక్రియ సవ్యంగా జరుగుతుంది. అంటే లిపిడ్స్ అనే కొవ్వులు ముక్కలు కావటం. అందుకే తగినన్ని నీరు తాగటం అనేది అధికబరువుని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

First Published:  23 Aug 2020 9:55 AM GMT
Next Story