Telugu Global
National

కరోనా కాలంలో రెట్టింపైన కార్పొరేట్ దోపిడీ...

మామూలుగానే కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అంతూ పొంతూ ఉండదు. కరోనా కష్టకాలంలో ఇది తారాస్థాయికి చేరుకుంది. కరోనా నివారణకు కచ్చితమైన మందు లేకపోవడం, టీకా కనుక్కోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ సంధి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి కార్పొరేట్ ఆస్పత్రులు. కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనై వైద్యం జరిగేది. ఇప్పుడు కేసుల సంఖ్య పెరగడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా కొవిడ్ కేర్ సెంటర్లు నిర్వహించుకునే వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం. […]

కరోనా కాలంలో రెట్టింపైన కార్పొరేట్ దోపిడీ...
X

మామూలుగానే కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అంతూ పొంతూ ఉండదు. కరోనా కష్టకాలంలో ఇది తారాస్థాయికి చేరుకుంది. కరోనా నివారణకు కచ్చితమైన మందు లేకపోవడం, టీకా కనుక్కోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ సంధి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి కార్పొరేట్ ఆస్పత్రులు.

కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనై వైద్యం జరిగేది. ఇప్పుడు కేసుల సంఖ్య పెరగడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా కొవిడ్ కేర్ సెంటర్లు నిర్వహించుకునే వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో కార్పొరేట్ ఆస్పత్రుల పంట పండింది. ప్రభుత్వం కరోనా వైద్యం ఖర్చు గురించి మార్గదర్శకాలు విడుదల చేసినా ప్రైవేట్ ఆస్పత్రులు అవేవీ పట్టించుకోవడంలేదు. ఓ మోస్తరు ఆస్పత్రిలో 20బెడ్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 50నుంచి 70 బెడ్లు నిర్వహించుకునే అవకాశం ప్రైవేట్ ఆస్పత్రులకు ఉంది.

నాన్ క్రిటికల్ కేర్ కొవిడ్ ట్రీట్ మెంట్ కి ప్రభుత్వం నిర్థారించిన ఫీజు కేవలం 3,250 రూపాయలు మాత్రమే. వసతికోసం ప్రత్యేక రూమ్ కావాలంటే పేషెంట్ అదనంగా 600 రూపాయలు చెల్లించాలి. ఐసీయూ, వెంటిలేటర్.. ఇతర అత్యాధునిక సదుపాయాలున్న క్రిటికల్ కేర్ కొవిడ్ ట్రీట్ మెంట్ ఖర్చు 10,380 రూపాయలు.

అయితే ప్రైవేట్ ఆస్పత్రులు ఈ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తున్నారు. గతంలో లాగా ఆరోగ్యశ్రీ వార్డులు లేవు కాబట్టి.. ఆరోగ్యశ్రీ కింద చేరేవారికి కనీసం బెడ్లు కూడా అందుబాటులో ఉంచడంలేదు. నేరుగా ఫీజు కట్టి చేరేవారికి మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఫీజు రోజుకి 20వేలనుంచి లక్ష రూపాయల వరకు ఉంటోంది. అందులోనూ ఆస్పత్రి బెడ్స్ కి ఎక్కడలేని గిరాకీ. వైద్యం ఖరీదు ఎక్కువైనా కూడా ఓ మోస్తరు స్థితిమంతులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లక్షణాలు తగ్గిపోయినా కూడా డిశ్చార్జి కావడానికి వీరు ఆసక్తి చూపించడంలేదంటే కరోనాపట్ల ప్రజల్లో ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదే భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి కార్పొరేట్ ఆస్పత్రులు. రమేష్ ఆస్పత్రి వ్యవహారమే తీసుకోండి.. ఓ మహిళా పేషెంట్ దగ్గర రోజుకి లక్ష రూపాయలు వసూలు చేయడంతోపాటు.. నాలుగు బంగారు గాజులు కూడా ఫీజు కింద జమ చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మందులతోపాటు, వాడి పడేసే పీపీఈ కిట్లకు కూడా అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక వార్డులోకి వైద్యుడు పీపీఈ కిట్ లో వచ్చాడంటే.. ఒకేసారి అందరు పేషెంట్ల దగ్గరకు వెళ్లి వస్తాడు. మరి ప్రతి రోగి వైద్య ఖర్చులో రోజుకి రెండు పీపీఈ కిట్ల రేటుని ఎందుకు ఖర్చు రాస్తున్నారో అర్థం కాని పరిస్థితి. వాడి పడేసే గ్లౌజ్ లు, మాస్క్, పీపీఈ కిట్ ఖర్చు కూడా రోగి ఖాతాలో వేస్తున్నారంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? అత్యవసర వైద్యం కోసమే ప్రభుత్వం రెమెడిసెవిర్ ఇంజక్షన్లు వాడుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం ఉన్నా లేకపోయినా రెమెడిసెవిర్ వైద్యం చేస్తున్నామంటున్నారు వైద్యులు. నిజంగానే వారు ఆయా ఇంజక్షన్లు వేస్తున్నారో లేదో తెలియదు. ఇటు బిల్లు చూస్తే తడిసి మోపెడవుతోంది. ఇష్టపడి వస్తున్నారు కాబట్టి.. కార్పొరేట్ దోపిడీపై ఎవరూ నోరు మెదపడంలేదు. ఒకవేళ సమస్యలు వస్తాయి అనుకుంటే.. అలాంటి పేషెంట్లను అసలు చేర్చుకోరు, చేర్చుకున్నా.. వెంటనే పంపించేస్తున్నారు.

మరోవైపు పల్మనాలజిస్ట్ ల కొరత వల్ల పీజీ స్టూడెంట్లు, ఎంబీబీఎస్ చదువుతున్న జూనియర్ డాక్టర్లను కొవిడ్ కేర్ సెంటర్లకోసం విధుల్లోకి తీసుకుంటున్నారు. రోగుల వద్ద లక్షలు గుంజేస్తున్నా.. ప్రాణభయంతో విధులకు వస్తున్న డాక్టర్లకు కార్పొరేట్ ఆస్పత్రులు చెల్లించేది మాత్రం అరకొర జీతాలే. పీజీ విద్యార్థులకు నెలకు 50వేలు ఇస్తూ.. డాక్టర్లు రోజుకి 50వేలు తీసుకుంటున్నారు, అందుకే వైద్యం ఖరీదు పెరిగిందంటూ పేషెంట్లకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాయి యాజమాన్యాలు. జనాలకు కరోనా కష్టకాలం అయితే.. కార్పొరేట్ హాస్పిటల్స్ కి మాత్రం కరోనా కాసులకాలంగా మారింది.

First Published:  17 Aug 2020 4:00 AM GMT
Next Story