Telugu Global
International

కోవిడ్ విషయంలో ఇండియా తన పొరుగు దేశాల కంటే ఎందుకు అధ్వాన్నంగా ఉంది?

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో బ్రెజిల్‌ను కూడా దాటేసి ఇండియా దూసుకొని పోతున్నది. కేసులు ఇలాగే భారీ సంఖ్యలో నమోదైతే మరి కొన్ని రోజుల్లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాను కూడా దాటేయడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణం కరోనా మహ్మారిని నియంత్రించడంలో విఫలం కావడమే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం, ఇంకా అభివృద్ది చెందుతున్న దేశం ఇండియా అని.. ఇక్కడ […]

కోవిడ్ విషయంలో ఇండియా తన పొరుగు దేశాల కంటే ఎందుకు అధ్వాన్నంగా ఉంది?
X

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో బ్రెజిల్‌ను కూడా దాటేసి ఇండియా దూసుకొని పోతున్నది. కేసులు ఇలాగే భారీ సంఖ్యలో నమోదైతే మరి కొన్ని రోజుల్లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాను కూడా దాటేయడం ఖాయంగానే కనిపిస్తున్నది.

ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణం కరోనా మహ్మారిని నియంత్రించడంలో విఫలం కావడమే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం, ఇంకా అభివృద్ది చెందుతున్న దేశం ఇండియా అని.. ఇక్కడ ఎంతో మంది పేదరికంలో మగ్గిపోతున్నారని.. అందువల్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని భావించినా కుదరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

మనకు ఆర్థిక వనరులు, వైద్య సదుపాయాలు తక్కువగా ఉండటంతో కరోనాపై పోరాటం విజయవంతం కావట్లేదని అంటున్నారు. ఇది నిజమే కావొచ్చు.. కానీ ఇండియాకు పొరుగున కూడా ఇదే స్థితిలో ఉన్న దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల్లో కూడా అధిక జనాభా, తక్కువ వనరులే ఉన్నాయి. కానీ ఆయా దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. జనాభా పరంగా చూస్తే కోవిడ్ కేసుల నమోదు, మరణాల్లో పొరుగు దేశాల కంటే ఇండియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.

దక్షిణాసియా దేశాలతో పోలిస్తే ఇండియాలో కోవిడ్ కేసులు ఎంత వేగంగా పెరిగాయో ఇటీవల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో జులై నెలాఖరు వరకు జనాభాతో పోల్చి చూస్తే అత్యధిక కేసులు నమోదయ్యాయి. కానీ జులై తర్వాత ఆ రెండు దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టగా.. ఇండియా మాత్రం వేగంగా దూసుకెళ్లి కేసుల నమోదు రేటులో పాకిస్తాన్‌ను కూడా దాటేసింది. కరోనాను కట్టడి చేయడంలో శ్రీలంక పూర్తి సామర్థ్యాన్ని వినియోగించడంతో జులై ఆఖరు నుంచి ఇప్పటి వరకు వ్యాప్తిలో పెరుగుదల లేదు. ఇక మరణాల రేటులో కూడా ఇండియాలో ఇదే విధమైన స్థితి ఉంది. జనాభాతో పోల్చగా అత్యధిక మరణాల రేటు ఇండియాలోనే నమోదవుతున్నది. మరణాల రేటును తగ్గించడంలో శ్రీలంక విజయం సాధించగా.. నేపాల్ ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగింది.

దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న ఇండియా, కోవిడ్ విషయంలో ఎందుకు చేతులెత్తేసిందనేది చర్చకు వస్తున్నది. భారత ప్రభుత్వం ఈ మహమ్మారి విషయంలో సరిగా స్పందించలేదనేది మెజార్టీ అభిప్రాయం. కోవిడ్ విషయంలో ఎలా వ్యవహరించవొద్దో భారత ప్రభుత్వ దృక్పదం ఒక పాఠంగా నిలిచిపోతున్నది. భారత ప్రభుత్వం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి విధించిన అత్యంత కౄరమైన లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తిని ఆలస్యం చేయగలిగారే తప్ప, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు 3టీ (టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్) విధానాన్ని సరిగా అమలు చేయలేకపోయారు.

లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వానికి దొరికిన సమయాన్ని సరిగా వినియోగించుకోవడంలో విఫలమైనది. ఆ సమయంలో వైద్య సదుపాయాలు మెరుగు పరచడం, వైద్య సిబ్బందిని నియమించడం వంటి కార్యక్రమాలను చేపట్టలేదు. పైగా ఈ లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఆదాయం కోల్పోవడం, తమ జీవనాధారాన్ని పోగొట్టుకోవడం, చివరికి తినడానికి తిండి కూడా దొరకని స్థితికి చేరుకోవడం జరిగింది. వలస కూలీలు తమ జీవన ఆధారాన్ని కోల్పోయి స్వగ్రామాలకు వెళ్లడం ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది.

బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా కోవిడ్‌పై పోరాటానికి తమదైన వ్యూహాలను రూపొందించారు. లాక్‌డౌన్ విధించడానికి అవసరమైన సమయాన్ని ప్రజలకు ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆ దేశాల్లో కంటే ఇండియాలోనే కోవిడ్ ప్రమాదకరంగా మారింది. మరోవైపు ఆరోగ్యంపై ఇండియాలో ఖర్చు చేసే డబ్బు కూడా చాలా తక్కువ. ఇది కూడా వైరస్ త్వరగా వ్యాప్తి చెందడానికి కారణమైందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ఖర్చు చేసే మొత్తం చాలా తక్కువ. జీడీపీతో పోల్చుకుంటే ఇండియా కంటే శ్రీలంకలోనే అత్యధిక మొత్తం ప్రజారోగ్యంపై ఖర్చు చేస్తుండటం గమనార్హం. మన దేశంలో చిన్న పిల్లల మరణాల రేటు బంగ్లాదేశ్, నేపాల్ కంటే దారుణంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇక ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కూడా కరోనా మహమ్మారిని సరైన విధంగా మేనేజ్ చేయలేకపోయింది. దీన్ని ఆయుష్మాన్ భారత్ కిందకు తీసుకొని వస్తున్నామనే ఒక కంటి తుడుపు చర్య తప్ప మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదు.

First Published:  11 Aug 2020 6:45 AM GMT
Next Story