విశాఖపై ఎందుకీ విష ప్రచారం...
సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ చంద్రబాబుకి సుతరామూ ఇష్టంలేదు. అమరావతిలో తన భూదందా ఆగిపోతుందనేది ఆయన భయం. పవన్ కల్యాణ్ కూడా మూడు రాజధానుల ఏర్పాటుకి బద్ధ వ్యతిరేకి అని ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది. కానీ అమరావతి రైతు కష్టాలు అంటూ ఆయన మొసలి కన్నీరు కారుస్తుంటారు. ఓవైపు అమరావతికి అండగా ఉంటూనే.. మరోవైపు విశాఖపై విష ప్రచారం చేయడానికి కూడా వీరిద్దరూ వెనకాడ్డంలేదు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ఈ విషరాజకీయం […]
సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ చంద్రబాబుకి సుతరామూ ఇష్టంలేదు. అమరావతిలో తన భూదందా ఆగిపోతుందనేది ఆయన భయం. పవన్ కల్యాణ్ కూడా మూడు రాజధానుల ఏర్పాటుకి బద్ధ వ్యతిరేకి అని ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది. కానీ అమరావతి రైతు కష్టాలు అంటూ ఆయన మొసలి కన్నీరు కారుస్తుంటారు.
ఓవైపు అమరావతికి అండగా ఉంటూనే.. మరోవైపు విశాఖపై విష ప్రచారం చేయడానికి కూడా వీరిద్దరూ వెనకాడ్డంలేదు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ఈ విషరాజకీయం మరింత జోరందుకుంది. పారిశ్రామిక ప్రాంతం రాజధానికి అనువు కాదని టీడీపీ అనుకూల పత్రికలు కథలల్లాయి. సముద్రంలో ఖండాంతర చీలికలు విశాఖకు ముప్పు తెస్తాయా అంటూ ఈనాడు ఏకంగా ఓ పరిశోధనాత్మక కథనాన్నే వండివార్చింది.
ఇలా చంద్రబాబు విషప్రచారం జోరందుకుంటున్న వేళ.. పవన్ కల్యాణ్ తాజాగా విశాఖపై తనకున్న అక్కసు వెళ్లగక్కారు. ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్ లో జరిగిన భారీ పేలుడు ఘటనని ఉదాహరణగా చెబుతూ పవన్ కల్యాణ్ విశాఖను ఏకంగా నిప్పుల కుంపటిగా అభివర్ణించారు.
దేశంలో అమ్మోనియం నైట్రేట్ దిగుమతికి అనుమతి ఉన్న ఏకైక ఓడరేవు విశాఖ అని, అక్కడ బీరుట్ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా అమ్మోనియం నైట్రేట్ నిల్వలున్నాయని, ఇది ఎప్పటికైనా ప్రమాదమేనని చెప్పారు పవన్ కల్యాణ్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తన ఉద్దేశం కాదంటూనే పవన్ కల్యాణ్ విశాఖ ప్రమాదకరమైన ప్రాంతమని తేల్చారు.
ఈమేరకు “విశాఖ ఒడిలో నిప్పుల కుంపటి – అమ్మోనియం నైట్రేట్ నిల్వలనుంచి కాపాడమని విజ్ఞప్తి” అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్ కల్యాణ్. వాస్తవానికి 270 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే అమ్మోనియం నైట్రేట్ తో ముప్పు ఉంటుంది. అలాంటి ఉదాహరణలు బీరుట్ మినహా ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.
విశాఖలో కూడా ఆ రసాయన నిల్వలు అధికంగా ఉన్నట్టు బీరుట్ పేలుడు తర్వాతే ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ లేనిది, ఇప్పుడు ప్రమాదకరం ఎలా అవుతుందో పవన్ చెప్పాలి. కేవలం విశాఖపై విషప్రచారం కాకపోతే.. నిప్పుల కుంపటి అంటూ సాగర తీరంపై నిందలు వేయడం ఎందుకు? అమరావతి అంతబాగా నచ్చితే.. ఆ ప్రాంతాన్ని పొగడాలి కానీ, విశాఖపై లేనిపోని నిందలు వేయడం కరెక్టేనా? పవన్ రాసిన లేఖ చూస్తే.. విశాఖపై విషం చిమ్మడంలో చంద్రబాబుని కచ్చితంగా మించిపోతున్నాడని అర్థమవుతుంది.