Telugu Global
International

కరోనా కోసం చేతులు కడిగితే... కొత్త బాధలు!

ఒక సమస్యని తప్పించుకోవడానికి పాటించే వైద్యం కానీ… చిట్కాలు ఉపాయాలు కానీ… కొన్నిసందర్భాల్లో మరొక సమస్యను తెచ్చిపెడుతుంటాయి. కరోనా నివారణకు మసాలా పానీయాలు ఎక్కువగా తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురవుతున్నట్టుగా అన్నమాట. కరోనాని ఆపేందుకు వాడుతున్న శానిటైజర్లు సైతం అలాగే కొత్త ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. వీటిని అతిగా వాడితే చేతులకు అపాయం కలిగే అవకాశం ఉందని చర్మవ్యాధుల వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మం పొడిబారటం, దురదలు, వాపు వంటివి తాజాగా చాలామందిలో కనబడుతున్నాయని డెర్మటాలజిస్టులు అంటున్నారు. ఇప్పుడు వస్తున్న […]

కరోనా కోసం చేతులు కడిగితే... కొత్త బాధలు!
X

ఒక సమస్యని తప్పించుకోవడానికి పాటించే వైద్యం కానీ… చిట్కాలు ఉపాయాలు కానీ… కొన్నిసందర్భాల్లో మరొక సమస్యను తెచ్చిపెడుతుంటాయి. కరోనా నివారణకు మసాలా పానీయాలు ఎక్కువగా తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురవుతున్నట్టుగా అన్నమాట.

కరోనాని ఆపేందుకు వాడుతున్న శానిటైజర్లు సైతం అలాగే కొత్త ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. వీటిని అతిగా వాడితే చేతులకు అపాయం కలిగే అవకాశం ఉందని చర్మవ్యాధుల వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మం పొడిబారటం, దురదలు, వాపు వంటివి తాజాగా చాలామందిలో కనబడుతున్నాయని డెర్మటాలజిస్టులు అంటున్నారు.

ఇప్పుడు వస్తున్న కేసుల్లో పదిశాతం చర్మ సమస్యలకు కారణం శానిటైజర్ ని మరీ ఎక్కువగా వాడటమేనని… ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పటల్ లో డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ కబీర్ సర్దనా అంటున్నారు.

కరోనా నుండి రక్షణకోసం 60శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లని వాడమని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో వాటిని దాదాపు అందరూ వాడుతున్నారు. బయటకు వెళ్లి పనులు చేసుకుంటున్న వారంతా శానిటైజర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఇళ్లలో ఉన్నవారు సైతం అలాగే వాడుతున్నారు.

అయితే వాటిని మరీ విపరీతంగా వాడితే…అరచేతుల్లో చర్మం పైన ఉండి చర్మాన్ని కాపాడే నూనె పొర పోతుందని, సకాలంలో దానిని సరిచేయకపోతే చర్మం దెబ్బతింటుందని, చర్మం ఎరుపెక్కడం, వాపు, నొప్పి లాంటివి …ఆపై ఎగ్జిమా లాంటి సమస్యలు వస్తాయని చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ సర్దనా అంటున్నారు. అర చేతుల్లోని చర్మం అలాంటిస్థితికి చేరితే… ఇక ముందుముందు ఆ తరహా రసాయనాలున్నవి ఏవి తగిలినా చేతులు అలర్జీకి గురవుతుంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ తో చేతులు కడిగిన ప్రతిసారీ అది చేతులపై రక్షణగా ఉండే నూనె పొరని కొంతవరకు నాశనం చేస్తుందని, దాంతో పొడిబారి, దురదలు వచ్చి…ఇరిటెంట్ డెర్మటిటిస్ అనే పరిస్థితికి దారితీయవచ్చని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్నడాక్టర్ సోమేష్ గుప్తా తెలిపారు.

ఇలాంటి సమస్యలనుండి తప్పించుకోవాలంటే శానిటైజర్లకు బదులుగా మంచి సబ్బు, నీళ్లను వాడితే చాలని, హాస్పటల్స్ లో వాడే శానిటైజర్లను ఇళ్లలో వాడవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తొంభైశాతం ఆల్కహాల్ ఉంటేనే శానిటైజర్ బాగా పనిచేస్తుందనే అపోహ చాలామందిలో ఉందని, కానీ 70శాతం స్పిరిట్ ఉన్న శానిటైజర్లు సైతం అంతే ప్రభావవంతంగా పనిచేస్తాయని డాక్టర్ సోమేష్ గుప్తా అన్నారు.

సబ్బులు, శానిటైజర్లను సువాసనలు వెదజల్లే వాటిని వాడవచ్చా… అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘ ఇప్పుడు చాలా పరిశోధనల్లో ఉపరితలాలపై చేతులు పెట్టటం వలన వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరగటం లేదని తేలింది… అందువలన చేతులను ఎక్కువసార్లు శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. సబ్బులు శానిటైజర్లను మరీ సువాసనా భరితమైనవి వాడకపోవడమే మంచిది. ఎందుకంటే అవి అలర్జీలను కలిగించే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.’ అన్నారు డాక్టర్ గుప్తా.

చేతులకు అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఎన్ 9 గ్లవుజులను వాడాలని, లాటెక్స్ గ్లవుజులను పూర్తిగా వాడకపోవటమే మంచిదని , అలాగే నైట్రిల్ గ్లవుజులను, చేతులకు పైపూతలుగా వాడే టాపికల్ స్టిరాయిడ్స్ ని సైతం వాడవచ్చు కానీ… వాటిని డెర్మటాలజిస్టుల సలహా మేరకు మాత్రమే వాడాలని డాక్టర్ సోమేష్ గుప్తా, డాక్టర్ సర్దానా తెలిపారు.

First Published:  7 Aug 2020 8:09 AM GMT
Next Story