Telugu Global
National

బెయిలొచ్చిన సంతోషం... గంటల్లోనే ఆవిరి

వాహనాల దొంగ రిజిస్ట్రేషన్ కేసులో కొడుకుతో సహా జైలుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డికి, బెయిలుపై విడుదలైన సంతోషం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. కడప జైలునుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి దారి పొడవునా తమ ప్రతాపం చూపించాలనుకున్నారు. జేసీ అభిమానులు ఏకంగా కడప జైలునుంచి తాడిపత్రి వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఎదురవుతోందని, కనీసం అంబులెన్స్ కి అయినా దారివ్వాలని సూచించిన తాడిపత్రి రూరల్ […]

బెయిలొచ్చిన సంతోషం... గంటల్లోనే ఆవిరి
X

వాహనాల దొంగ రిజిస్ట్రేషన్ కేసులో కొడుకుతో సహా జైలుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డికి, బెయిలుపై విడుదలైన సంతోషం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. కడప జైలునుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి దారి పొడవునా తమ ప్రతాపం చూపించాలనుకున్నారు.

జేసీ అభిమానులు ఏకంగా కడప జైలునుంచి తాడిపత్రి వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఎదురవుతోందని, కనీసం అంబులెన్స్ కి అయినా దారివ్వాలని సూచించిన తాడిపత్రి రూరల్ సీఐ దేవేంద్రను రోడ్డుమీదే తీవ్రంగా దూషించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కారులోనుంచి దిగి అరెస్ట్ చేస్తావా, నీ అంతు చూస్తానంటూ మీద మీదకు వచ్చారు.

జేసీ ఆవేశాన్ని చూసి ఆయన అభిమానులు మరింతగా రెచ్చిపోయారు. సీఐపై దాడి చేసినంత పనిచేశారు. వారి ఆవేశాన్ని చూసి సీఐ దేవేంద్ర అక్కడినుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. కండిషనల్ బెయిల్ కారణంగా శుక్రవారం తాడిపత్రి పోలీస్ స్టేషన్ కి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.

దళిత సీఐ దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి సహా మరో 31మంది టీడీపీ కార్యకర్తలపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుతనం, సీఐని ఆయన బెదిరించిన తీరు అప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జేసీ తీరుపై ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు.

50రోజులకి పైగా జైలులో ఉండొచ్చినా కూడా జేసీ వ్యవహారంలో ఏమాత్రం మార్పు రాలేదని అంటున్నారు. మొత్తమ్మీద బెయిలొచ్చిన సంతోషం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. కొడుకు సహా మరోసారి కటకటాల వెనక్కు వెళ్లారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గతంలో నమోదైన కేసులకు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కేసులు అదనం. ప్రభుత్వాన్ని మోసం చేసి కొనితెచ్చుకున్న కేసులు కొన్నయితే.. అంతులేని అహంకారంతో నెత్తిన వేసుకున్న కేసులు మరికొన్ని.

First Published:  7 Aug 2020 8:11 AM GMT
Next Story