Telugu Global
International

మీ కిటికీ నుండి... నేను తొంగి చూడనా?!

కరోనా కట్టడి… ఈ మాట కరోనాకంటే ఎక్కువగా మనకే వర్తిస్తుంది. ఎందుకంటే దాన్ని కట్టడి చేయడమంటే మనల్ని మనం ఒకచోట కట్టి పడేసుకోవడమే కనుక.  రద్దీ రోడ్లు, సాయంత్రం షాపింగులు, కాఫీతో కబుర్లు, పనీపాటా లేకుండా అలా జాలీగా నాలుగు రోడ్లు తిరిగి రావడం, సినిమాలు, షికార్లు, హోటల్ భోజనాలు, పార్టీలు, ఫంక్షన్లు… అన్నింటినీ కట్టడి చేయడమే కరోనా కట్టడి. ప్రతి రోజూ… మన ఇల్లు, మనవాళ్లు, మన కిటికీలోంచి కనిపించే పూలమొక్కలు, మన బాల్కనీలోంచి కనిపించే […]

మీ కిటికీ నుండి... నేను తొంగి చూడనా?!
X

కరోనా కట్టడి… ఈ మాట కరోనాకంటే ఎక్కువగా మనకే వర్తిస్తుంది. ఎందుకంటే దాన్ని కట్టడి చేయడమంటే మనల్ని మనం ఒకచోట కట్టి పడేసుకోవడమే కనుక. రద్దీ రోడ్లు, సాయంత్రం షాపింగులు, కాఫీతో కబుర్లు, పనీపాటా లేకుండా అలా జాలీగా నాలుగు రోడ్లు తిరిగి రావడం, సినిమాలు, షికార్లు, హోటల్ భోజనాలు, పార్టీలు, ఫంక్షన్లు… అన్నింటినీ కట్టడి చేయడమే కరోనా కట్టడి.

ప్రతి రోజూ… మన ఇల్లు, మనవాళ్లు, మన కిటికీలోంచి కనిపించే పూలమొక్కలు, మన బాల్కనీలోంచి కనిపించే ఇళ్లు… ఇంతేనా జీవితం… ఒక్క కొత్త దృశ్యం కూడా కంటికి కనిపించడం లేదే…జీవితం ఇంత బోర్ గా మారిపోయిందే… అనే బాధ చాలామందిలో ఉండవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఈ బాధ మరింతగా ఉంటుంది.

అవును… మన కిటికీనుండి రోజూ చూసే మొక్కలు ఎంత అందంగా ఉన్నా కొన్నాళ్లకు బోర్ అనిపిస్తాయి. ఇలాంటప్పుడు మరో ప్రాంతంలో, మరో దేశంలో, మరో ఇంటి కిటికీలోంచి కనిపించే దృశ్యం చూడగలిగితే ఎంత బాగుంటుంది కదా… ఈ ఆలోచనుండి పుట్టిందే విండో స్వాప్… ఉపాయం. కిటికీలనుండి కనిపించే దృశ్యాలను మార్పిడి చేసుకోవటం అన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా నివసించే వ్యక్తులు తమ కిటికీల్లోంచి, బాల్కనీల్లోంచి కనిపించే దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేయటం…. అదే విండో స్వాప్ ప్రాజెక్టు.

దీనివలన పలుదేశాలనుండి పలువురు తమ కిటికీలనుండి కనిపించే దృశ్యాలను పోస్ట్ చేయగలుగుతారు. అలాగే ఇతరులు పోస్ట్ చేసిన అందమైన దృశ్యాలను చూడగలుగుతారు. ఇంట్లోంచి కాలు కదపలేని ఈ గడ్డుకాలంలో పలు కొత్త ప్రదేశాలను చూసిన అనుభూతిని పొందడం ఇందులో ప్రధాన ఉద్దేశ్యం.

ఈ సరికొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేసినవారు సోనాలీ రంజిత్, వైష్టవ్ బాలసుబ్రమణియన్ అనే దంపతులు. సింగపూర్ వాసులైన వీరు అడ్వర్ టైజింగ్ రంగంలో పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఇండియా, షాంఘై, శాన్ ఫ్రాన్సిస్కో తదితర ప్రాంతాల్లో పనిచేసి ఉన్నారు. లాక్ డౌన్ తో ఒకే ప్రాంతంలో ఉండాల్సి రావటం వారికి చాలా ఒత్తిడిగా అనిపించింది.

వివిధ దేశాలలో ఉన్న తమ స్నేహితులంతా ఎలా కాలం గడుపుతున్నారో కదా… అని ఆలోచించినప్పుడు ఈ జంటకి విండో స్వాప్ ఆలోచన తట్టింది. ‘టేక్ మీ ఎల్స్ వేర్’ అనే పేరుతో ఇంతకుముందే ఇలాంటి ప్రాజెక్టు ఒకటి మొదలైంది. అయితే అందులో స్టిల్ ఇమేజ్ లు ఉంటాయి. విండో స్వాప్ లో మాత్రం వీడియోలు ఉంటాయి.

సోనాలీ రంజిత్, వైష్టవ్ బాలసుబ్రమణియన్ మొదట దీనిని తమ దగ్గరి స్నేహితులతోనే మొదలుపెట్టారు. విభిన్నమైన దృశ్యాలను వీడియోల రూపంలో చూడటం వారికి చాలా ఆహ్లాదంగా అనిపించింది. దాంతో ఈ ప్రాజెక్టులోకి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా వచ్చేలా వీలు కల్పించారు. ఇప్పుడు విండో స్వాప్ లో 26దేశాల నుండి పోస్టయిన వీడియోలు 60 ఉన్నాయి.

ఇందులో తమ వీడియోలను పోస్ట్ చేయాలని అనుకునేవారు తమ కిటికీ నుండి లేదా బాల్కనీ నుండి ఒక వీడియోని తీసి పంపాల్సి ఉంటుంది. అన్ని వీడియోలను ఈ జంట ఒకసారి చూసి తరువాత పోస్ట్ చేస్తుంటారు. వీడియోలు రెండునుండి పదినిముషాల నిడివితో ఉండవచ్చు. కిటికీ నుండి లేదా బాల్కనీనుండి తీసినట్టుగా వీడియోలో తెలవాల్సి ఉంటుంది.

భిన్నదేశాలనుండి తమకు అందుతున్న వీడియోలు అన్నీ అందమైనవి, విభిన్నమైనవని…. వాటిలో ఏవి మరింత బాగున్నాయి… అనేది చెప్పటం కష్టమని అంటారు సోనాలీ, వైష్టవ్ లు. మనకు సాధారణంగా కనిపించేది మరొకరికి ఎంతో గొప్పగా అనిపించవచ్చని…అందుకే ఎలాంటి కిటికీ నుండైనా వీడియోలు పంపవచ్చని వీరు చెబుతున్నారు.

విండో స్వాప్ డాట్ కామ్ (https://window-swap.com) లోకి వెళ్లి… ఇతరుల కిటికీలనుండి మీరూ తొంగి చూడొచ్చు. మన వీడియోలు ఎలా పంపాలి… అందుకు నిబంధనలేమిటి తదితర వివరాలు సైతం అందులో ఉన్నాయి.

Next Story