Telugu Global
International

కరోనా కట్టడిలో...మహిళానేతలే ముందు!

కరోనా మహమ్మారి… కష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు, అన్యాయాలు, అవమానాలు, మనిషిలోని వికృత కోణాలు లాంటి వ్యతిరేక అంశాలతో పాటు… కొన్ని మంచి విషయాలను, నిజాలను సైతం మన కళ్లముందుకు తెస్తోంది. కడుగు, కడుగు… ఈ మాటలు ఈ మధ్య ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంటింటా ఆడవాళ్లు ఇదే పనిలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టేదాకా కరోనా మహమ్మారిని సబ్బునీటితో కడిగిపారేయటం ఒక్కటే పరిష్కార మార్గమని తేలిపోయాక… మన జీవనశైలి చాలా మారిపోయింది. ఇంట్లో మహిళల […]

కరోనా కట్టడిలో...మహిళానేతలే ముందు!
X

కరోనా మహమ్మారి… కష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు, అన్యాయాలు, అవమానాలు, మనిషిలోని వికృత కోణాలు లాంటి వ్యతిరేక అంశాలతో పాటు… కొన్ని మంచి విషయాలను, నిజాలను సైతం మన కళ్లముందుకు తెస్తోంది.

కడుగు, కడుగు… ఈ మాటలు ఈ మధ్య ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంటింటా ఆడవాళ్లు ఇదే పనిలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టేదాకా కరోనా మహమ్మారిని సబ్బునీటితో కడిగిపారేయటం ఒక్కటే పరిష్కార మార్గమని తేలిపోయాక… మన జీవనశైలి చాలా మారిపోయింది. ఇంట్లో మహిళల బాధ్యతలు మరింతగా పెరిగిపోయాయి.

ఇల్లు, పరిసరాలు, తింటున్న ఆహారం, పిల్లల చేతులు, ఒళ్లు, ఇంటిల్లిపాదీ ధరిస్తున్న దుస్తులు, వేసుకుంటున్న మాస్కులు…. వీటన్నింటి శుభ్రతపట్ల ఎక్కువగా శ్రమిస్తున్నది ఆడవారే. కరోనా నియంత్రణ గురించి అడిగితే ప్రతి మహిళా ఒక కథ చెబుతుంది. అయితే సాధారణ మహిళలే కాదు… దేశాలను పాలిస్తున్న వనితలు కూడా కరోనా పోరాటంలో తమదైన శైలిని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

మహిళలు అధినేతలుగా ఉన్న దేశాలు కరోనాపై పోరాటంలో ఎక్కువ విజయం సాధిస్తున్నాయి. మగవారు దేశాధినేతలుగా ఉన్న అమెరికా, యుకె, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, భారత్ లతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండగా, మహిళలు పరిపాలిస్తున్న జర్మనీ, తైవాన్, న్యూజీలాండ్, ఐలాండ్, ఫిన్ లాండ్, నార్వే, డెన్మార్క్ లలో కరోనాని సమర్ధవంతంగా కట్టడి చేస్తున్నారు.

ఏంజిలా మార్కెల్ ఛాన్సలర్ గా ఉన్న జర్మనీలో కరోనా మరణాల రేటు బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్ల కంటే తక్కువగా ఉంది. 34 ఏళ్ల సనా మారిన్… మరో నాలుగు మహిళా సారధ్యంలో ఉన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఫిన్లాండ్ లో సైతం కరోనా మరణాలు ఒకశాతం కంటే తక్కువగా ఉన్నాయి. దానికి చేరువలో ఉన్న స్వీడన్ లో మాత్రం కరోనా మరణాలు ఎక్కువే ఉన్నాయి.

ఇక తైయింగ్ వెన్ అధ్యక్షురాలిగా ఉన్న తైవాన్ అయితే కరోనా కట్టడిలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం, కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారితో కలిసిమెలసి ఉన్నవారిని గుర్తించడం, ఐసోలేషన్ చేయటం లాంటి చర్యలతో…. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించకుండానే కరోనాని కట్టడి చేశారు.

న్యూజీలాండ్ ప్రధాని జకిందా ఆర్డెర్ మార్చి 25న విధించిన లాక్ డౌన్ ని మే 11న ఎత్తివేస్తూ…కరోనా వ్యాప్తిని అరికట్టడమే కాదు… దానిని అంతం చేయటంలోనూ విజయం సాధించామంటూ దేశప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

పరస్పర సహాయ సహకారాలు, వ్యవహారశైలిలో వినయం, ప్రజల్లో సహజంగా ఉండే విజ్ఞతపైన నమ్మకం, దయాగుణం, కష్టనష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో పోరాడే లక్షణం, సమస్యకు తగినట్టుగా పరిస్థితులకు అనుగుణంగా ప్రాక్టికల్ గా నిర్ణయాలు తీసుకోవటం, ఇతరుల పట్ల దయ, సహాయ సహకారాలు అందించే గుణం స్వతహాగా ఉండటం….ఇవన్నీ మహిళా నేతలు మగ వాళ్లకంటే భిన్నంగా పనిచేసేందుకు దోహదం చేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

అంతేకాదు ఈ విషయాన్ని మరింత విశాలంగా ఆలోచించాలని… మహిళా నేతలను ఎన్నుకున్నారు అంటే ఆయా దేశాల్లో మహిళలు మరిన్ని ప్రధాన పదవుల్లో ఉన్నారని అర్థమని, మహిళలు అనేక రంగాల్లో ప్రముఖంగా పనిచేయటం కూడా కరోనా కట్టడికి దోహదం చేసిందని అంటున్నారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం వారి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు చెబుతున్న వివరాలను బట్టి…. స్త్రీ పురుష సమానత్వం అధికంగా ఉన్నదేశాలు, ఉన్నత పదవుల్లో మహిళలు ఉన్నదేశాలే కరోనాని మరింత సమర్ధవంతంగా నియంత్రిస్తున్నాయి. అంతేకాదు కార్పొరేట్ బోర్డుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నది కూడా ఈ దేశాల్లోనే. దీనిని బట్టి మహిళల నిర్వహణ ఎక్కువ భాగం ఉన్న దేశాల్లో పరిపాలన, ప్రజాసంక్షేమం బాగున్నాయని చెప్పకతప్పదు.

First Published:  13 July 2020 6:03 PM GMT
Next Story