Telugu Global
NEWS

ఎంతో మంది రాజులు గెలిచారు... రఘురామకృష్ణంరాజు మాత్రం హీనంగా రాజకీయం చేస్తున్నారు...

సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ నేతలు నేరుగా అటాక్ మొదలుపెట్టారు. మంత్రి రంగనాథ్‌రాజు, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణలు, గ్రంధి శ్రీనివాస్‌, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు లు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి ఫైర్ అయ్యారు. గత పదిపదిహేను సంవత్సరాలుగా ఏ పార్టీ కూడా క్షత్రియులకు మంత్రి పదవి ఇచ్చింది లేదని… ఈసారి జగన్‌మోహన్ రెడ్డి తమకు కూడా మంత్రి పదవి ఇచ్చి ఆదరించారన్నారు. ప్రతి చిన్నచిన్న కులాలకు కూడా ప్రాతినిధ్యం […]

ఎంతో మంది రాజులు గెలిచారు... రఘురామకృష్ణంరాజు మాత్రం హీనంగా రాజకీయం చేస్తున్నారు...
X

సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ నేతలు నేరుగా అటాక్ మొదలుపెట్టారు. మంత్రి రంగనాథ్‌రాజు, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణలు, గ్రంధి శ్రీనివాస్‌, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు లు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి ఫైర్ అయ్యారు.

గత పదిపదిహేను సంవత్సరాలుగా ఏ పార్టీ కూడా క్షత్రియులకు మంత్రి పదవి ఇచ్చింది లేదని… ఈసారి జగన్‌మోహన్ రెడ్డి తమకు కూడా మంత్రి పదవి ఇచ్చి ఆదరించారన్నారు. ప్రతి చిన్నచిన్న కులాలకు కూడా ప్రాతినిధ్యం ఉండేలా టికెట్లు ఇచ్చారని.. మంత్రులను చేశారని వివరించారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పలువురు కరోనా బారినపడితే ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేశారన్నారు.

ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు మాత్రం పర్యటించలేదన్నారు. పైగా ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలపై నిందలు వేయడం సరికాదన్నారు. వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకుని ప్రజల మధ్య చిచ్చుపెట్టడం సరికాదన్నారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని మంత్రి రంగనాథ్‌రాజు సలహా ఇచ్చారు.

ఏలూరు ఎంపీ శ్రీధర్‌… రెండు నెలల్లో నాలుగైదు సార్లు ముఖ్యమంత్రిని కలిశారన్నారు. ఎంపీలకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని రఘురామకృష్ణంరాజు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. అందరూ గౌరవించే క్షత్రియ కులంలో పుట్టి ఇలాంటి రాజకీయాలు చేయడం రఘురామకృష్ణం రాజుకు సరికాదన్నారు. గౌరవమైన కుటుంబాల్లో పుట్టి కులాల మధ్య చిచ్చు పెడుతున్నది రఘురామకృష్ణంరాజేనన్నారు. క్షత్రియులకు ఒక ఎంపీ టికెట్, మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని మంత్రి రంగనాథరాజు వ్యాఖ్యానించారు.

ఏరుదాటాక తెప్పతగలేసే సామెత రఘురామకృష్ణంరాజు లాంటి వారిని చూసిన తర్వాతే వచ్చినట్టుగా ఉందని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు ఇది వరకు ఏమైనా ఎంపీగా ఎమ్మెల్యేగా నాలుగైదు సార్లు గెలిచి రాజకీయాల్లో పొడిచేశారా అని ప్రశ్నించారు. జగన్‌ మీద అభిమానంతోనే ప్రజలు ఓట్లేసి అందరినీ గెలిపించారన్నారు. రఘురామకృష్ణంరాజుకు సొంత ఎజెండా ఉంటే దాన్ని చూసుకోవాలి గానీ… పార్టీపై మాట్లాడే హక్కు ఎక్కడ ఉందన్నారు. జగన్‌ ఫొటో లేకుండా రఘురామకృష్ణం రాజుకు ఎంపీ అయ్యే యోగ్యతే లేదన్నారు.

ఏ ఊరిలో కూడా రఘురామకృష్ణంరాజు తరపున బ్యానర్లు కట్టే కార్యకర్తలు కూడా లేరన్నారు. ఎన్నికల సమయంలో తనకు తానే బ్యానర్లు కట్టించుకున్నారన్నారు. నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఏ పత్రిక అయినా బాగా ప్రాధాన్యత ఇస్తుందని… దాన్ని చూసుకుని రఘురామకృష్ణంరాజు తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నారని కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చాలా అన్యాయంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారని… ఆయన చెప్పే దాంట్లో ఒక్క శాతం కూడా నిజం లేదన్నారు. జగన్‌ ఫొటో మీద గెలవలేదని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలని కొట్టు సత్యనారాయణ సవాల్ చేశారు. ఇలాంటి వారికి ఇతర పార్టీలు కూడా మర్యాద ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు.

ప్రజలంతా రఘురామకృష్ణంరాజును చూసి నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీడీపీతో కొంత కాలం, బీజేపీతో కొంత కాలం ప్రయాణించి చివరకు ఎంపీగా కావాలంటే వైసీపీలో ఉంటేనే సాధ్యమవుతుందని భావించి రఘురామకృష్ణంరాజు వైసీపీలోకి వచ్చారన్నారు.

గతంలో జగన్‌మోహన్ రెడ్డి తన కుమారుడి రిసెప్షన్‌కు వచ్చినప్పుడు… జగన్‌తో ఒక్కసారి మాట్లాడుతా ఫోన్ ఇవ్వండి అంటూ బతిమలాడుకున్నారన్నారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. చివరకు బతిమలాడుకుని పార్టీలోకి వచ్చి ఎంపీ అయ్యారన్నారు. రాష్ట్రంలో 151 సీట్లు కూడా తన బొమ్మ వల్లే గెలిచిందని రఘురామకృష్ణంరాజు చెప్పలేదని అందుకు సంతోషం అని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ మీడియాలో ఉండాలన్న ఆలోచనతోనే రఘురామకృష్ణంరాజు ఇలా వ్యవహరిస్తున్నారన్నారు.

ఇది వరకు బాపిరాజు లాంటి వారు ఎంతో మంది ఎంపీగా గెలిచారని.. వారంతా ఎంతో హుందాగా పనిచేశారని… రఘురామకృష్ణంరాజు అంత హీనంగా రాజకీయం ఎవరూ చేయలేదన్నారు మరో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. జగన్‌మోహన్ రెడ్డి, తాము అందరం కలిసి సుధీర్ఘకాలం పనిచేసి పార్టీని బలోపేతం చేస్తే ఆఖరిలో 20 రోజుల ముందు వచ్చి టికెట్ సాధించి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు తన వల్లే వైసీపీ గెలిచిందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. జగన్‌మోహన్ రెడ్డి దగ్గరకు కూడా రానివ్వకపోతే ఎంతో మంది ద్వారా బతిమలాడి పార్టీలోకి వచ్చిన వ్యక్తి రఘురామకృష్ణంరాజు అని కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.

ఇదే రఘురామకృష్ణంరాజు గతంలో టీడీపీలోకి వెళ్లిపోయిన చలమశెట్టి సునీల్‌తో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు తాను పక్కనే ఉన్నానని… ఫోన్‌లో మాట్లాడుతూ ఓడిపోయే పార్టీలోకి నీవు వెళ్లావ్… గెలిచే పార్టీలోకి నేను వచ్చా అంటూ చలమశెట్టి సునీల్‌తో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారని కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. రఘురామకృష్ణంరాజును ఇతర పార్టీలు తీసుకున్నా ఆ తర్వాత వారు కూడా బాధపడుతారని… ఆ తరహాలోనే రఘురామకృష్ణంరాజు తీరు ఉందన్నారు.

First Published:  16 Jun 2020 7:40 PM GMT
Next Story