Telugu Global
NEWS

పోటుగాడివైతే పంచలు మార్చడం ఎందుకు?... చాలా ఆపరేషన్లు ఉన్నాయి... ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌ కూడా ఉంటుంది...

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. తన వల్లనే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని రఘురామకృష్ణంరాజు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణంరాజు సొంతంగా గెలిచేంత పోటుగాడైతే పదేపదే పార్టీలు ఎందుకు మారారని ప్రశ్నించారు. 2014లో వైసీపీలో జాయిన్ అయి ఆ తర్వాత టీడీపీలో చేరుందుకు చంద్రబాబుతో చర్చలు జరిపి… ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారని నాని గుర్తు చేశారు. అంతటి ఘనకీర్తి ఉన్న రఘురామకృష్ణంరాజు మూడు పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చిందని నిలదీశారు. 2014లో […]

పోటుగాడివైతే పంచలు మార్చడం ఎందుకు?... చాలా ఆపరేషన్లు ఉన్నాయి... ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌ కూడా ఉంటుంది...
X

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. తన వల్లనే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని రఘురామకృష్ణంరాజు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణంరాజు సొంతంగా గెలిచేంత పోటుగాడైతే పదేపదే పార్టీలు ఎందుకు మారారని ప్రశ్నించారు.

2014లో వైసీపీలో జాయిన్ అయి ఆ తర్వాత టీడీపీలో చేరుందుకు చంద్రబాబుతో చర్చలు జరిపి… ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారని నాని గుర్తు చేశారు. అంతటి ఘనకీర్తి ఉన్న రఘురామకృష్ణంరాజు మూడు పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చిందని నిలదీశారు.

2014లో మూడు పార్టీలు కూడా టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2014లో బీజేపీ, టీడీపీ తరపునే కాకుండా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసి ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలను గెలిపించేంత పోటుగాడైతే సొంతంగా పోటీ చేసి గెలవకుండా నామినేషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నారని నిలదీశారు.

ఎమ్మెల్యేలను గెలిపించేంత సత్తా ఉన్నోడైతే ఇతర పార్టీల పంచన చేరే బదులు సొంతంగా పార్టీ పెట్టుకుని… సొంత గుర్తుపై పోటీ చేయవచ్చు కదా అని పేర్నినాని సలహా ఇచ్చారు. ఎవరో పార్టీ పెడితే వారి పంచన చేరాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. వైసీపీలో చేరేందుకు ఇతరనాయకుల ద్వారా ఎంతగా బతిమలాడుకున్నారో అందరికీ తెలుసన్నారు. బతిమలాడుకుని పార్టీలో చేరి గెలిచిన తర్వాత ఇలా మాట్లాడడం ఒక్క రఘురామకృష్ణంరాజుకు మాత్రమే సాధ్యమని వ్యాఖ్యానించారు.

భీమవరంలో వైసీపీ తరపున గెలిచిన గ్రంధి శ్రీనివాస్‌కు 70వేల ఓట్లు వస్తే… ఎంపీగా పోటీ చేసిన రఘురామకృష్ణంరాజుకు 66 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఉండిలో ఎమ్మెల్యే అభ్యర్థికి 71వేల ఓట్లు వస్తే ఎంపీగా పోటీ చేసిన రఘురామకృష్ణంరాజుకు 68వేల ఓట్లు వచ్చాయని పేర్ని నాని వెల్లడించారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేకు 70వేల 741 ఓట్లు వస్తే… రఘురామకృష్ణంరాజుకు 68వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. తణుకులో వైసీపీ ఎమ్మెల్యేకు 75వేల ఓట్లు వస్తే… రఘురామకృష్ణంరాజుకు 71వేలుఓట్లు వచ్చాయన్నారు. అచంటలో రంగనాథరాజుకు 66వేల ఓట్లు వస్తే… రఘురామకృష్ణంరాజుకు 63వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేల కంటే ఎంపీగా పోటీ చేసిన రఘురామకృష్ణంరాజుకే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఈయన బొమ్మ వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే… వారి కంటే ఈయనకు తక్కువ ఓట్లు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలని పేర్ని నాని సవాల్ చేశారు.

గతంలోనూ 23 మంది అమ్ముడుపోయారని దాని వల్ల వైసీపీకి ఏమైనా అయిందా అని ప్రశ్నించారు. 2014లో 9మంది ఎంపీలు గెలిస్తే వారిలో ముగ్గురు ఈయనలాగే గోడ దూకారని… ఇప్పుడు ఆ ముగ్గురు ఏమైపోయారో తెలియదా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని గోడలు దూకి వెళ్లి అరెస్ట్ చేయడం తప్పు అంటున్న రఘురామకృష్ణంరాజు… మరి ఇదే ప్రశ్న మోడీకి వేయగలరా అని నిలదీశారు. పొద్దున లేస్తే మోడీ తనను చంక ఎక్కించుకుంటారు… ఎత్తుకుని తిప్పుతారు అని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజు … తమిళనాడులో చిదంబరంను ఏ విధంగా అరెస్ట్ చేయించారో గుర్తు లేదా అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పోలీసులు వెళ్లినప్పుడు తలుపులు తీయకపోతే డోర్లు పగలగొట్టే అరెస్ట్ చేస్తారన్నారు.

వైసీపీ నుంచి ఏదో చేయించుకుని వెళ్లి… ఏదో సాధించాలని రఘురామకృష్ణంరాజు అనుకుంటున్నారని… కానీ ఆ పప్పులు ఉడకడానికి ఇదేమీ టీడీపీ కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణంరాజు అనుకున్నది జరిగే ప్రసక్తే లేదన్నారు. పార్టీకి చాలా వ్యూహాలుంటాయని… చాలా ఆపరేషన్లు ఉంటాయని… ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఉంటుందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

First Published:  16 Jun 2020 9:28 PM GMT
Next Story