Telugu Global
National

నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీం కోర్టు చెప్పింది ఏంటి?

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ వాదనలను పూర్తి స్థాయిలో వినేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసి పుచ్చడం వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఊరటగానే చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రధాన ఉద్దేశంలో ఇంకా తీర్పు రావాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం పూర్తిగా […]

నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీం కోర్టు చెప్పింది ఏంటి?
X

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ వాదనలను పూర్తి స్థాయిలో వినేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసి పుచ్చడం వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఊరటగానే చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రధాన ఉద్దేశంలో ఇంకా తీర్పు రావాల్సి ఉంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం పూర్తిగా గవర్నర్ విచక్షణ ఆధారంగానే జరగాలని… రాష్ట్ర మంత్రి మండలికి గానీ, ముఖ్యమంత్రికి గానీ సిఫార్సు చేసే అధికారం లేదని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాని ఆధారంగానే కనగరాజు నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది.

రాష్ట్ర కేబినెట్ సిఫార్సు మేరకే కనగరాజును గవర్నర్‌ నియమించినట్టుగానే… 2015 డిసెంబర్ 12న చంద్రబాబునాయుడు పంపిన సిఫార్సు లేఖ ఆధారంగానే నాటి గవర్నర్‌ నరసింహన్… నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించారు. కాబట్టి కనగరాజు నియామకం చెల్లని పక్షంలో… నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నియామకం కూడా చెల్లదు అన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఈ గందరగోళానికి తెర దింపేందుకే ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.

హైకోర్టు తీర్పు ప్రకారం కనగరాజు నియామకం చెల్లకపోతే… అదే తరహాలో నాటి సీఎం చంద్రబాబు సిపార్సు ఆధారంగా నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నియామకం కూడా చెల్లదు అన్న అంశాన్ని సుప్రీం కోర్టు ముందు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు ఉంచారు.

ఈ అంశాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఈ అంశంలో ప్రభుత్వ వాదనలు పూర్తిగా వింటామని ప్రకటించింది. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది.

హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం కూడా చెల్లదన్న ఏపీ ప్రభుత్వ వాదనలను పూర్తి స్థాయిలో వింటామని సుప్రీం కోర్టు ప్రకటించడం బట్టి కొత్త పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు.

First Published:  10 Jun 2020 9:49 AM GMT
Next Story