తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని, కాకపోతే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. దీంతో పదో తరగతి పరీక్షలకు మార్గం సుగమమం అయ్యిందని అందరూ భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరీక్షలు మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడం లేదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా జూన్ 8 నుంచి పరీక్షలు […]
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని, కాకపోతే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. దీంతో పదో తరగతి పరీక్షలకు మార్గం సుగమమం అయ్యిందని అందరూ భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరీక్షలు మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడం లేదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని శనివారం హైకోర్టు తీర్పునిచ్చిన గంటల వ్యవధిలోనే మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.
లాక్‌డౌన్ ఆంక్షలు సడలడంతో జూన్ 8 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వడం, మూడు జిల్లాల పరిధిలో నిర్వహించవద్దంటూ కోర్టు ఆంక్షలు విధించడం వంటి పరిణామాలతో… మొత్తానికే వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంతకు ముందు హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా… ఒకటి కంటే ఎక్కువ సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల పలు సమస్యలు వస్తాయని ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ వాదించారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేనందువల్ల హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పరీక్షలు నిర్వహించవద్దని, మిగిలిన జిల్లాల్లో నిర్వహించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఇలా పలు దఫాల్లో పరీక్షలు నిర్వహించడం కష్టమని అధికారులు సూచించడంతో మంత్రి సబిత మొత్తం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్ కూడా విడుదల చేశారు. సప్లిమెంటరీ విద్యార్థులను కూడా కలుపుకొని.. భౌతిక దూరం పాటించడం వల్ల అదనంగా సెంటర్లను కూడా గుర్తించింది. కానీ హైకోర్టు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షలు నిర్వహించవద్దంటూ ఆదేశాలు ఇవ్వడంతో…. మొత్తానికే పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ ప్రాంతాల్లోనే అత్యధికంగా విద్యార్థులు ఉండటం.. రెండు సార్లు పేపర్లు సెట్ చేయడం కష్టం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరీక్షలు మొత్తానికే రద్దు చేయడం మంచిది – TSUTF రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంగు జయప్రకాశ్
కరోనా ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. పదో తరగతి పిల్లలంటే వాళ్లందరూ 16 ఏండ్ల కంటే తక్కువ వయసు వాళ్లే ఉంటారు. వీళ్లకు కరోనా సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు వాయిదా వేయడం మంచిదే.. కానీ మేం ఏం డిమాండ్ చేస్తున్నామంటే.. అసలు పదో తరగతి పరీక్షలనే రద్దు చేసి గతంలో నిర్వహించిన ప్రిఫైనల్స్, ఇతర పరీక్షల ఆధారంగా పిల్లలను పాస్ చేస్తే మంచిది. అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి మార్కులు ఇప్పటికే బోర్డుకు చేరాయి.. వాటి ఆధారంగా మనం పిల్లలను ఈ ఒక్కసారి పాస్ చేస్తే వచ్చే నష్టమేమీ ఉండదని అన్నారు.