Telugu Global
NEWS

కేసులొచ్చాయని కార్యకర్తలను దూరం పెట్టబోం.. వారికి అండగా ఉంటాం- విజయసాయిరెడ్డి

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులాంటిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈసీగా ఉంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా లేఖ రాశారని… ఆ లేఖను కూడా టీడీపీ కార్యాలయంలో రాయించారని చెప్పారు. నిమ్మగడ్డ ఒక క్రిమినల్ చర్య చేశారన్నారు. ఈసీ పదవి కాలం తగ్గిస్తే నిమ్మగడ్డ కోర్టుకు వెళ్తే అర్థముంది కానీ… టీడీపీ ఎందుకు కోర్టుకు వెళ్లింది అని ప్రశ్నించారు. తీర్పు రాగానే టీడీపీ సంబరాలు ఎందుకు చేసుకుందని నిలదీశారు. ఏ ఉత్తర్వులైనా ప్రభుత్వం […]

కేసులొచ్చాయని కార్యకర్తలను దూరం పెట్టబోం.. వారికి అండగా ఉంటాం- విజయసాయిరెడ్డి
X

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులాంటిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈసీగా ఉంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా లేఖ రాశారని… ఆ లేఖను కూడా టీడీపీ కార్యాలయంలో రాయించారని చెప్పారు.

నిమ్మగడ్డ ఒక క్రిమినల్ చర్య చేశారన్నారు. ఈసీ పదవి కాలం తగ్గిస్తే నిమ్మగడ్డ కోర్టుకు వెళ్తే అర్థముంది కానీ… టీడీపీ ఎందుకు కోర్టుకు వెళ్లింది అని ప్రశ్నించారు. తీర్పు రాగానే టీడీపీ సంబరాలు ఎందుకు చేసుకుందని నిలదీశారు. ఏ ఉత్తర్వులైనా ప్రభుత్వం నుంచి వస్తాయని.. కానీ తనకు తాను పదవిలో నియమించుకున్న వ్యక్తి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

హైకోర్టు సోషల్ మీడియా నెటిజన్లకు నోటీసులు ఇచ్చిన అంశంపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు చట్టం మీద అపారమైన గౌరవం ఉందన్నారు. న్యాయస్థానాలపై గౌరవం ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులుపెట్టి జగన్‌ను అరెస్ట్ చేసినా శాంతియుతంగానే పోరాడుతున్నామన్నారు. పదేళ్ల చరిత్రలో తాము గాంధేయమార్గంలోనే ప్రయాణం సాగించామన్నారు. ఎవరైనా చట్టవిరుద్ద చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు 2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వం పెట్టిన కేసుల్లో నలిగిపోయారన్నారు. నీతికోసం, నిజాయితీగా తమ సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేశారన్నారు. ఇప్పుడు నోటీసులు అందుకున్న వారంతా తప్పు చేశారనో… తప్పు చేయలేదనో తాను చెప్పడం లేదని… అందులోనూ కొందరు తప్పుడు అకౌంట్లు సృష్టించి వైసీపీకి చెడ్డపేరు వచ్చేలా పోస్టులు పెట్టిన టీడీపీ వారు కూడా ఉన్నారన్నారు.

వైసీపీకి పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు నిందితులు అయినంత మాత్రాన వారంతా దోషులు కాదన్నారు. నేరం నిరూపితం అయ్యే వరకు వారంతా నిందితులు మాత్రమేనన్నారు. వారంతా నిందితులు కాబట్టి వారందరినీ దూరం పెట్టేయాలి…లేకుంటే కోర్టు నుంచి ఇబ్బంది వస్తుంది అని భయపడే పరిస్థితుల్లో తాము లేమన్నారు.

ఐదేళ్లుగా పార్టీ వ్యవహారాలను తాను చూసుకుంటున్నానని… సోషల్ మీడియా వ్యవహారాలను కూడా తానే చూసుకుంటున్నానని… కార్యకర్తలు ఎవరైనా కేసులకు గురైతే వారికి అండగా ఉంటానని విజయసాయిరెడ్డి చెప్పారు.

కార్యకర్తలు, నేతలు కేసుల్లో ఇరుక్కున్నంత మాత్రాన వారిని పక్కనపెట్టే ప్రసక్తే ఉండదన్నారు. అదే పార్టీకి, కార్యకర్తలకు మధ్య ఉన్న బంధం అన్నారు. కోర్టులపై తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగానే తాము కోరుతామన్నారు.

ఎదుటివారు కవ్వించినప్పుడే వైసీపీ కార్యకర్తలు విమర్శలు చేశారే గానీ… తమంతకు తామే ఎదుటివారిపై దాడి చేసింది లేదన్నారు. ఐదేళ్లలో టీడీపీ వాళ్లు, వారి కార్యకర్తలు చేసిన ఘోరాలపై కేసులు పెడితే జైళ్ళు కూడా చాలవన్నారు విజయసాయిరెడ్డి. తమ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని… వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

మంగళవారం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. అమిత్ షాతో పాటు జలశక్తి మంత్రిని కలుస్తారని… గనుల శాఖ మంత్రినీ కలిసే అవకాశం ఉందన్నారు. వివిధ ప్రాజెక్టులపై చర్చించేందుకే ఢిల్లీ వెళ్తున్నట్టు వివరించారు.

పోతిరెడ్డిపాడు అంశంపై సమస్య ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటామన్నారు. జలశక్తి మంత్రిని ఇతర ప్రాజెక్టుల విషయంలో కలుస్తున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు.

First Published:  1 Jun 2020 11:43 AM GMT
Next Story