Telugu Global
International

కార్మిక చట్టాలను రద్దు చేయడంపై మండిపడ్డ అజీమ్ ప్రేమ్‌జీ

ఆయన ఒక పెద్ద పారిశ్రామిక వేత్త. ఎన్నో కంపెనీలు, ఫ్యాక్టరీలు ఆయనకు ఉన్నాయి. అలాంటి వ్యక్తి… కార్మిక చట్టాలు రద్దు చేస్తున్నారంటే సంతోషపడాలి. కానీ ఏకంగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కార్మిక చట్టాలను రద్దు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదంటూ మండిపడ్డారు. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీ. ఇటీవల ప్రముఖ జాతీయ పత్రిక కోసం ఆయన రాసిన ఒక వ్యాసంలో కరోనా, లాక్‌డౌన్, వలస కార్మికులు, చట్టాలపై పలు విషయాలను చర్చించారు. కొన్ని రాష్ట్ర […]

కార్మిక చట్టాలను రద్దు చేయడంపై మండిపడ్డ అజీమ్ ప్రేమ్‌జీ
X

ఆయన ఒక పెద్ద పారిశ్రామిక వేత్త. ఎన్నో కంపెనీలు, ఫ్యాక్టరీలు ఆయనకు ఉన్నాయి. అలాంటి వ్యక్తి… కార్మిక చట్టాలు రద్దు చేస్తున్నారంటే సంతోషపడాలి. కానీ ఏకంగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కార్మిక చట్టాలను రద్దు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదంటూ మండిపడ్డారు. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీ. ఇటీవల ప్రముఖ జాతీయ పత్రిక కోసం ఆయన రాసిన ఒక వ్యాసంలో కరోనా, లాక్‌డౌన్, వలస కార్మికులు, చట్టాలపై పలు విషయాలను చర్చించారు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార, పారిశ్రామిక వేత్తల ఒత్తిడితో కార్మిక చట్టాలను రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. తన యాభై ఏళ్ల పారిశ్రామిక జీవితంలో ఎన్నడూ బలవంతంగా కార్మిక చట్టాలను అమలు పరచలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అలవికాని ట్రేడ్ యూనియన్లను కూడా అనుమతించలేదని చెప్పారు.

కరోనాను అడ్డుకోవడంలో మనం ప్రాథమిక దశలోనే ఉన్నామని, ఈ క్రమంలో జీవనోపాధితో పాటు జీవించి ఉండటం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని రకాల విధివిధానాలను అవలంభించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. దీనికోసం అదనంగా మరో లక్ష కోట్లను ప్రభుత్వం కేటాయించాలి. అందరికీ అధిక పని రోజులు కేటాయించాలి. వేతనాన్ని కూడా పెంచాల్సి ఉంటుంది. ఆలస్యం లేకుండా సరైన సమయంలో నగదు చెల్లించాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పథకాన్నే ప్రవేశపెట్టాలి. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు.

ప్రభుత్వ పెట్టుబడులతో అందరికీ మెరుగైన ఆరోగ్యం అందిస్తూ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వం వ్యవసాయంలో అధిక పెట్టుబడులు పెట్టాలని, రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధరలను కల్పిస్తూ నాణ్యమైన కొనుగోలు విధానాన్ని తీసుకురావాలన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు 6నెలల వరకు ఉచిత రేషన్ అందించాలని అజీమ్ ప్రేమ్‌జీ సూచించారు. ఈ రేషన్‌లో బియ్యం, ఉప్పు, పప్పు సహా శానిటరీ ప్యాడ్, సోప్ లు కూడా ఉండాలన్నారు. వాటిని ప్రజల ఇంటి వద్దకే డెలివరీ చేసే ఏర్పాట్లు చూడాలి. ఒక్కో కుటుంబానికి కనీసం మూడు నెలల వరకు 7వేల రూపాయల చొప్పున అత్యవసర నిధి కింద అందించాలని… దీనికి బయోమెట్రిక్ విధానం లేని ప్రక్రియను అనుసరించాలని సూచించారు. పట్టణాల్లోని పేద ప్రజలకు నెలకు కనీసం 25 రోజుల పని దినాలను కల్పిస్తూ… లాక్‌డౌన్ తర్వాత కూడా మరో రెండు నెలల పాటు దీనిని కొనసాగించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.

First Published:  17 May 2020 8:55 PM GMT
Next Story