Telugu Global
NEWS

తెలంగాణలో కరోనా తగ్గుముఖం

నాలుగు జోన్లలోనే కేసులు 17 తర్వాత మరిన్ని సడలింపులు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేవలం నాలుగు జోన్లకే పరిమితం అయ్యిందని.. అక్కడ తప్ప రాష్ట్రంలో మరే చోటా కరోనా పాజిటివ్ కేసులు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడి, రాష్ట్రంలో పరిస్థితులపై ఆయన శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు రాబోయే సీజనల్ వ్యాదుల నియంత్రణకు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన […]

తెలంగాణలో కరోనా తగ్గుముఖం
X
  • నాలుగు జోన్లలోనే కేసులు
  • 17 తర్వాత మరిన్ని సడలింపులు
  • సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేవలం నాలుగు జోన్లకే పరిమితం అయ్యిందని.. అక్కడ తప్ప రాష్ట్రంలో మరే చోటా కరోనా పాజిటివ్ కేసులు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడి, రాష్ట్రంలో పరిస్థితులపై ఆయన శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు రాబోయే సీజనల్ వ్యాదుల నియంత్రణకు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోందని.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా కరోనా పాజిటివ్ కేసులు లేవని ఆయన చెప్పారు. ఈ నాలుగు జోన్లలోని కంటైన్మెంట్ ప్రాంతాల పరిధిలో దాదాపు 1500 కుటుంబాలు ఉన్నాయని.. వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచామని కేసీఆర్ చెబుతున్నారు.

ఇక యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో కరోనా పాజిటివ్‌గా తేలిన వాళ్లు వలస కూలీలని.. వాళ్లు మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వచ్చారని చెప్పారు. వారందరికి కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం.. కాబట్టి ఇప్పుడు ఆయా జిల్లాల్లో పాజిటివ్ కేసులు లేనట్లేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

కరోనా వైరస్ గురించి ప్రజలు పెద్దగా భయపడాల్సిన పని లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ 19 నుంచి కోలుకున్న వాళ్లే ఎక్కువని.. ఇక్కడ మరణాలు 2.38 శాతం మాత్రమేనని కేసీఆర్ చెప్పారు.

కరోనా కట్టడికి నియంత్రణ చర్యలు చేపడుతూనే పట్టణాలు, పల్లెల్లో పారిశుథ్య పనులు చేయాలని సీఎం ఆదేశించారు. సీజనల్ వ్యాదులు ప్రబలకుండా వెంటనే చర్యలు చేపట్టాలని.. దీనికి సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు నిధులు అందిస్తున్నామని అన్నారు. దీంతో పాటు హైదరాబాద్‌లో బస్తీ దావఖానాలను పెంచాలని ఆయన మంత్రులు ఈటెల, కేటీఆర్‌లను ఆదేశించారు.

ఈ నెల 17తో దేశవ్యాప్తంగా మూడో విడత లాక్‌డౌన్ పూర్తవుతుంది. కేంద్రం ఈ లోపు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని పరిశీలించిన అనంతరం రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు శనివారం నుంచి ఏసీ అమ్మకాలు, ఆటోమొబైల్ షోరూర్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అమ్మకాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

ఇక విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి వెంటనే అక్కడే వైద్య పరీక్షలు చేయాలని.. వైరస్ అనుమానిత లక్షణాలు ఉంటే ఆసుపత్రికి తరలించాలని కేసీఆర్ ఆదేశించారు. విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే ఇతర రాష్ట్రాల వారిని నేరుగా వారి ప్రాంతాలకు తరలించడానికి బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

First Published:  15 May 2020 8:40 PM GMT
Next Story