Telugu Global
NEWS

లాక్‌డౌన్‌తో అస్తవ్యస్తంగా తెలంగాణ గ్రామీణ జీవనం

కుదేలైన ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి ఎన్నడో..? కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. తెలంగాణలో మార్చి 23 నుంచే పూర్తిగా లాక్‌డౌన్ అయ్యింది. వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్ సరైన నిర్ణయమే అయినా అది తెలంగాణలోని గ్రామీణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజల జీవన విధానం మారిపోవడంతో పాటు అక్కడి ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ఏరియాలో చిల్లర వ్యాపారాలు, రోడ్డు పక్కన పెట్టుకునే దుకాణాలు, మెకానిక్ […]

లాక్‌డౌన్‌తో అస్తవ్యస్తంగా తెలంగాణ గ్రామీణ జీవనం
X
  • కుదేలైన ఆర్థిక వ్యవస్థ
  • సాధారణ స్థితికి ఎన్నడో..?

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. తెలంగాణలో మార్చి 23 నుంచే పూర్తిగా లాక్‌డౌన్ అయ్యింది. వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్ సరైన నిర్ణయమే అయినా అది తెలంగాణలోని గ్రామీణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజల జీవన విధానం మారిపోవడంతో పాటు అక్కడి ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ఏరియాలో చిల్లర వ్యాపారాలు, రోడ్డు పక్కన పెట్టుకునే దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఎలక్ట్రిక్ షాపులు పరిమితంగా ఉంటాయి. గ్రామాల్లో ఉండే వారికి ఈ దుకాణాలతో అనుబంధం ఉంటుంది. చిన్న చిన్న వస్తువుల కోసం పట్టణాలకు పరుగులు తీయకుండా ఇక్కడే కొంటుంటారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతంలోని రైతుల దగ్గర కూలీలుగా పని చేసేవాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు వీళ్లందరిపై ఈ లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపింది.

ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపింది. తెలంగాణలోని వికారాబాద్, తాండూరు మండలాల్లో పర్యటించిన ఈ బృందం పలు విషయాలు వెలుగులోనికి తీసుకొని వచ్చింది.

షాపూర్ గ్రామానికి సమీపంలో చిన్న టీ కొట్టు నడిపే వ్యక్తి తన అనుభవాన్ని తెలిపాడు. లాక్‌డౌన్ ముందు టీ, బిస్కెట్, ఇతర తినుబండారాలు అమ్మి రోజుకు 500 వరకు సంపాదించేవాడిని.. కాని ఇప్పుడు 300 రూపాయల వ్యాపారం కూడా చేయలేకపోతున్నానని చెప్పాడు. తన భార్య పేరు మీద ముద్ర లోన్ తీసుకొని వ్యాపారం నడిపిస్తున్నానని.. లాక్‌డౌన్ కారణంగా వాయిదాలు చెల్లించలేకపోతున్నానని వాపోయాడు. అలాగే రోడ్ల పక్కన పంక్చర్ షాపులు పెట్టుకున్న వారి పరిస్థితి కూడా అంతే ఉంది. రవాణా పూర్తిగా స్తంభించడంతో వారి ఆదాయ మార్గాలకు గండిపడింది.

గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి కూలీ పనులే ఆదాయ వనరు. ప్రస్తుతం పనులు లేకపోవడంతో ఆదాయం రావడం కూడా కష్టంగా మారింది. ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా ఎక్కువగా ఏమీ జరగడం లేదు. యాసంగి పంట కోతలు, అమ్మకాలకు కూడా గ్రామాల్లో బయటి వ్యక్తులను కూలీకి పిలవకుండా కుటుంబ సభ్యులే చేసుకుంటున్నారు. దీంతో కూలీ దొరకడం చాలా కష్టమైతుందని ఒక ఊరి సర్పంచ్ వెల్లడించారు. మరోవైపు వ్యవసాయ పనులకు భౌతిక దూరం పాటించడం వల్ల తక్కువ మందినే పనుల్లోకి తీసుకోవాల్సి వస్తోందని.. దీంతో చాలా మందికి పనులే దొరకడం లేదని చెబుతున్నారు.

ఇక కొన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ సాయం కూడా అందలేదు. కరోనా కాలంలో ఇబ్బందులు పడకూడదని కుటుంబానికి 1500 రూపాయలు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాని ఇప్పుడు ఆ డబ్బు చాలా మందికి అందలేదని సదరు సర్పంచ్ చెబుతున్నారు. గ్రామాల్లోని చాలా మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన డబ్బు కూడా అందలేదు. జన్ ధన్ ఖాతాలు ఉన్నా వారికి ఎలాంటి పైకం అకౌంట్లలో వేయలేదు.

ప్రస్తుతం మొక్కజొన్న పంట చేతికి వచ్చిందని.. ఈ పంటను నిల్వ చేయడానికి గోదాములు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా కూరగాయలు, మొక్కజొన్న, మైసూర్ పప్పు పండిస్తుంటారు. ఇక్కడ పువ్వుల ఉత్పత్తి కూడా ఎక్కువగానే జరుగుతుంది.

అయితే పూలు, కూరగాయలను వీళ్ల గ్రామాలకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లోనే అమ్ముతుంటారు. కాని లాక్‌డౌన్ కారణంగా నగరంలోని మార్కెట్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యలు కరువయ్యాయి. దీంతో పంట చేతికి వచ్చినా అలాగే వదిలేయడంతో నాశనం అవుతోందని ఒక యువ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నగరానికి తీసుకెళ్లే దారి లేకపోవడంతో ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముతున్నట్లు తెచ్చాడు.

ఇలా గ్రామీణ జీవనం, ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. కూలీ లేక.. వ్యవసాయ పనులు లేక.. పంటను అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. కరోనా బాధితులు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా లేకపోయినా.. రెడ్ జోన్ల మాదిరి నిబంధనలు పాటించాల్సి రావడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి జీవనం సాధారణ స్థితికి వస్తేనే కాని ఇబ్బందులు తొలగవని.. కాని ప్రస్తుత పరిస్థితుల్లో పూర్వ స్థితికి ఎప్పుడొస్తామో అర్థం కావట్లేదన్నారు. త్వరలోనే అన్నీ సర్థుకుంటాయనే ఆశాభావంతో గ్రామీణులు ఎదురుచూస్తున్నారు.

First Published:  4 May 2020 8:52 PM GMT
Next Story