Telugu Global
National

కరోనాతో కలిసి జీవించాల్సిందే... ఇదే వాస్తవం " ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

కరోనా ఇప్పట్లో పోయేది కాదన్న నిర్దారణకు ప్రపంచం వస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేత సూచనలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా దేశం స్తంభించిపోవడంతో కోట్లాది మంది నిరుపేదలు, దినసరి కూలీలు, కార్మికులు అల్లాడిపోతున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు ప్రాణాలకు తెగించి వేల కిలోమీటర్ల నడకకు భార్యా పిల్లలతో కలిసి సిద్దమైన దృశ్యాలు భారతావనిని కదిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేతకు, సడలింపులకు డిమాండ్‌లు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేయాలన్న ఆలోచనకు ఇన్ఫోసిస్ […]

కరోనాతో కలిసి జీవించాల్సిందే... ఇదే వాస్తవం  ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
X

కరోనా ఇప్పట్లో పోయేది కాదన్న నిర్దారణకు ప్రపంచం వస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేత సూచనలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా దేశం స్తంభించిపోవడంతో కోట్లాది మంది నిరుపేదలు, దినసరి కూలీలు, కార్మికులు అల్లాడిపోతున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు ప్రాణాలకు తెగించి వేల కిలోమీటర్ల నడకకు భార్యా పిల్లలతో కలిసి సిద్దమైన దృశ్యాలు భారతావనిని కదిలిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేతకు, సడలింపులకు డిమాండ్‌లు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేయాలన్న ఆలోచనకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా గొంతు కలిపారు. ఇంకా లాక్‌డౌన్ పొడిగిస్తే కరోనా మరణాలకు మించి దేశంలో ఆకలి మరణాలు సంభవించే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.

పనిచేయగలిగే అవకాశం ఉన్న వారంతా వీలైనంత త్వరగా ఉత్పత్తిలో భాగస్వామ్యం కావాలని … ఆ దిశగా ఏర్పాటు చేయడం మంచిదని సలహా ఇచ్చారు. లాక్‌డౌన్ పొడిగింపు ఇక దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌కే పట్టుబడితే ఆకలి మరణాలను కోవిడ్‌ మరణాల కంటే ఎక్కువగా చూడాల్సి ఉంటుందన్నారు.

దేశంలో కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య భారీగా లేదని గుర్తు చేశారు. ఏటా వివిధ కారణాల వల్ల 90 లక్షల మంది మరణిస్తున్నారని… అందులో కాలుష్యం కారణంగా నాలుగో వంతు మరణాలు ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. కానీ కరోనా వల్ల రెండు నెలల్లో కేవలం వెయ్యి మంది మాత్రమే దేశంలో మరణించారని నారాయణమూర్తి గుర్తు చేశారు.

దేశంలో 19 కోట్ల మంది అసంఘటిత, స్వయం ఉపాధి మీద బతుకుతున్నారని… లాక్‌ డౌన్ పొడిగిస్తే వారి పరిస్థితి మరింత దెబ్బతింటుందని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రస్తుతం భారీగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో యువతలో ఉన్న జన్యు పరిస్థితుల కారణంగా వైరస్‌ లక్షణాలు బయటపడడం లేదని… అలాంటి పరిస్థితి వల్ల వైరస్ మరొకరికి సోకుతూనే ఉంటుందన్నారు. ఇలాంటి వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో కరోనా వైరస్‌తో కలిసి జీవించడమే మన ముందున్న మార్గమని అంగీకరించకతప్పదని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.

First Published:  30 April 2020 8:30 AM GMT
Next Story