Telugu Global
International

కరోనా ఇక ప్రతీ ఏడాది వస్తూనే ఉంటుంది " శాస్త్రవేత్తలు

కరోనా వైరస్‌ను శాశ్వతంగా భూమిపై నుంచి రూపుమాపడం కష్టమేనని, ఇకపై ప్రతీ ఏడాది ఈ వైరస్ ”ఫ్లూ” జ్వరంలాగే వస్తూనే ఉంటుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కరోనా వైరస్ ప్రభావంపై ‘బ్లూంబర్గ్’ సంస్థ పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఇచ్చిన సమాచారాన్ని క్రోఢీకరించి తయారు చేసిన ఒక నివేదికలో పలు విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ కుటుంబంలోని గత వైరస్‌ల మాదిరిగా ఈ సార్-కోవ్2 వైరస్ లేదని… దీని జన్యు నిర్మాణం చాలా వైవిధ్యంగా […]

కరోనా ఇక ప్రతీ ఏడాది వస్తూనే ఉంటుంది  శాస్త్రవేత్తలు
X

కరోనా వైరస్‌ను శాశ్వతంగా భూమిపై నుంచి రూపుమాపడం కష్టమేనని, ఇకపై ప్రతీ ఏడాది ఈ వైరస్ ”ఫ్లూ” జ్వరంలాగే వస్తూనే ఉంటుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

కరోనా వైరస్ ప్రభావంపై ‘బ్లూంబర్గ్’ సంస్థ పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఇచ్చిన సమాచారాన్ని క్రోఢీకరించి తయారు చేసిన ఒక నివేదికలో పలు విషయాలు వెల్లడించింది.

కరోనా వైరస్ కుటుంబంలోని గత వైరస్‌ల మాదిరిగా ఈ సార్-కోవ్2 వైరస్ లేదని… దీని జన్యు నిర్మాణం చాలా వైవిధ్యంగా ఉందని వారు పేర్కొన్నారు. గతంలో వచ్చిన సార్స్ వైరస్‌ను పూర్తిగా నాశనం చేయగలిగామని.. కానీ ఇప్పటి వైరస్ మనుషుల్లో ఉండిపోయి.. మళ్లీ మళ్లీ వస్తుంటుందని వారు పేర్కొన్నారు. ఈ కరోనా వైరస్‌ను రూపుమాపలేకపోవడానికి గల కారణాలను కూడా విశ్లేషించారు. కరోనా వైరస్ ప్రభావానికి గురైతే జర్వం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనపడుతుంటాయి. కాగా ఇటీవల ఇలాంటి లక్షణాలేవి లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అవుతోంది.

ఇలా ఎలాంటి లక్షణాలు లేకుండా (అసింప్టమాటిక్) మనిషిలో కోవిడ్-19 పూర్తిగా సంక్రమిస్తుంది. వీరికి టెస్టులు చేస్తేనే కాని వ్యాధి బారిన పడినట్లు తెలియదు. ఇలాంటి వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్నారు. కొంత మందికి కరోనా వైరస్ శరీరంలోనే ఉండిపోతుంది. కాని వెంటనే ప్రభావం చూపదు. అలా వైరస్ భూమిపై చక్కర్లు కొడుతూనే ఉంటుంది కాని పూర్తిగా నాశనం కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సార్స్ వ్యాధి సంక్రమించినప్పుడు మనుషులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారందరినీ క్వారంటైన్ చేయడం వల్ల ఇప్పుడు ఆ వైరస్ భూమిపై లేకుండా పోయింది. గత 17 ఏళ్లుగా ఎప్పుడూ సార్స్ కనిపించలేదు. కానీ, కరోనా వైరస్‌ను క్వారంటైన్ చేసినా రూపుమాపలేము. చైనాలోనే వందలాది అసింప్టమాటిక్ కేసులు కనపడుతున్నాయి. ఇది ఒక అంటువ్యాధిగా ప్రపంచంలో ఉండిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరి కొన్ని సంవత్సరాల పాటు కరోనా వైరస్ మానవ సమాజంలో ఉండిపోతుంది. వాతావరణంలోని మార్పులను బట్టి అది బయటపడుతుందని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథోజెన్ బయోలజీ డైరెక్టర్ జిన్ క్వి స్పష్టం చేశారు.

అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్టియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు.

కోవిడ్-19 సీజనల్ వ్యాధిలా మారిపోయిందని, ప్రస్తుతం దక్షిణార్థ గోళంలో ఈ వైరస్ ఎక్కువగా సంక్రమిస్తోంది. కారణం అక్కడ చల్లదనం పెరగడమే అని ఆయన చెబుతున్నారు. ప్రతీ చలికాలంలో కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపడం ఖాయమని ఆయన అంటున్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ నాశనం అవుతుందని చెబుతున్నారు. కానీ ఆ వైరస్ నాశనం కావాలంటే 56 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి కావాలి.

ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఎండా కాలంలో అంత వేడి ఉండదు. కాబట్టి కరోనాను పూర్తిగా నాశనం చేయడం ఇప్పట్లో అయ్యే పని కాదు అని ఆయన స్పష్టం చేశారు.

First Published:  29 April 2020 4:41 AM GMT
Next Story