Telugu Global
NEWS

కష్టకాలంలో ఒకే నెలలో 132 కోట్లు ఆదా!

ఇష్టమొచ్చినట్టు అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసే వ్యవహారానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. తక్కువ ధరకు లభించే చోటే విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. దీని వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవుతోంది. లాక్‌ డౌన్ వేళ ఏపీ విద్యుత్ సంస్థలు చేసిన ప్రయత్నాల కారణంగా 132 కోట్ల రూపాయలు ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఆదా అయింది. లాక్‌డౌన్ ప్రకటించగానే పరిశ్రమల విద్యుత్‌ వినియోగం భారీగా పడిపోతుందని ముందే గ్రహించిన ఏపీ విద్యుత్ సంస్థలు… మార్కెట్‌లో […]

కష్టకాలంలో ఒకే నెలలో 132 కోట్లు ఆదా!
X

ఇష్టమొచ్చినట్టు అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసే వ్యవహారానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. తక్కువ ధరకు లభించే చోటే విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. దీని వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవుతోంది. లాక్‌ డౌన్ వేళ ఏపీ విద్యుత్ సంస్థలు చేసిన ప్రయత్నాల కారణంగా 132 కోట్ల రూపాయలు ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఆదా అయింది.

లాక్‌డౌన్ ప్రకటించగానే పరిశ్రమల విద్యుత్‌ వినియోగం భారీగా పడిపోతుందని ముందే గ్రహించిన ఏపీ విద్యుత్ సంస్థలు… మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందని అంచనా వేశాయి. అందుకు తగ్గట్టుగానే మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ లభించే అవకాశాలకోసం జల్లెడ పట్టారు. ఆ దిశగా అధికారులు విజయవంతమయ్యారు. లాక్‌డౌన్ మొదలవగానే తక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు నేతృత్వంలో సీనియర్ ఇంజనీర్ల ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

ఈ బృందం ఎప్పటికప్పుడు మార్కెట్‌లో పరిస్థితిని అంచనా వేస్తూ ఒప్పందాలున్న సంస్థల విద్యుత్‌ ధరతో, మార్కెట్‌లో లభించే విద్యుత్‌ ధరలను పోల్చి చూస్తూ తక్కువ ధరకు విద్యుత్‌ను కొంటూ వచ్చారు. ఏప్రిల్‌లో 824 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయగా… గతంలో ఎన్నడూ లేని విధంగా యూనిట్‌కు రూ. 2.16 నుంచి 2.66 రూపాయలకే విద్యుత్‌ను కొంటూ వచ్చారు. విద్యుత్‌ కొనుగోలుకు ఏపీ ఈఆర్‌సీ అనుమతించిన ధర కంటే ఇది 1.60 రూపాయలు తక్కువగా ఉంది.

ఇలా చౌకగా విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల ఏప్రిల్‌ నెలలో 132 కోట్లు ఆదా అయింది. 132 కోట్లు ఆదా చేసిన ఉన్నతాధికారులను ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఇబ్బందుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను గట్టెక్కించేందుకు ఇదే కృషిని కొనసాగించాలని కోరారు.

బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండడంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేశారు. దీని వల్ల థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత విద్యుత్ డిమాండ్‌ పెరిగినా… వేసవి వల్ల వినియోగం అధికమైనా మే నెలలో ఈ బొగ్గు సాయంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు సమర్థవంతంగా నడుస్తాయని… ఈ ఏడాది విద్యుత్‌ కష్టాలు ఉండబోవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడు వారాలకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి.

First Published:  29 April 2020 2:00 AM GMT
Next Story