Telugu Global
International

శాటిలైట్లకు దొరికిన కిమ్ ట్రైన్... అక్కడెందుకుంది?

ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులు మీడియా ముందుకు వచ్చి తాము తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. కాని సుప్రీం లీడర్ కిమ్ మాత్రం అసలు పత్తా లేకుండా పోయారు. ఆయనకు శస్త్ర చికిత్స జరిగిందని.. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయారనే వార్తలు వచ్చాయి. ఒక […]

శాటిలైట్లకు దొరికిన కిమ్ ట్రైన్... అక్కడెందుకుంది?
X

ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులు మీడియా ముందుకు వచ్చి తాము తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. కాని సుప్రీం లీడర్ కిమ్ మాత్రం అసలు పత్తా లేకుండా పోయారు. ఆయనకు శస్త్ర చికిత్స జరిగిందని.. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయారనే వార్తలు వచ్చాయి. ఒక రహస్య ప్రదేశంలో చికిత్స తీసుకుంటున్నారనే రిపోర్టులు కూడా లీకయ్యాయి.

కాగా, కిమ్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేందుకు వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న 38 నార్త్ అనే వెబ్ సైట్ అనేక శాటిలైట్ చిత్రాలను విశ్లేషించింది. ఉత్తర కొరియా, దాని చుట్టు పక్కల ప్రాంతాలపై ఈ వెబ్‌సైట్ నిరంతరం నిఘా వేస్తూ ఉండే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంది. ఈ వెబ్‌సైట్ ఇటీవల కొన్ని శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి.. కిమ్‌కు చెందిన ఒక ట్రైన్ ఏప్రిల్ 21 నుంచి 23 వరకు ఉత్తర కొరియా తూర్పు తీరంలో ఉన్న వోన్‌సన్ అనే రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్నట్లు గుర్తించింది.

ఈ నగరంలో ఉన్న సదరు రైల్వే స్టేషన్ ను కేవలం కిమ్, అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఉపయోగిస్తారు. అక్కడ కిమ్ పర్సనల్ ట్రెయిన్ తప్ప వేరే ఏ ట్రెయిన్‌ను నిలిపి ఉంచరు. ఈ నగరాన్ని విడిదిగా మాత్రమే కిమ్ ఉపయోగిస్తుంటారు. కాగా, మూడు రోజుల పాటు ఆ ట్రైన్ అక్కడ ఆగి ఉండటంతో కిమ్ ఆ నగరంలో ఉండి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అతని ఆరోగ్యంపై మాత్రం ఈ చిత్రాల ద్వారా ఒక అంచనాకు రాలేమని సదరు వెబ్‌సైట్ తెలిపింది.

కాగా, కిమ్ ఏప్రిల్ 15న కూడా తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు హాజరు కాలేదు. ఆనాటి నుంచే కిమ్ ఆరోగ్యంపై అనేక అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు కిమ్ అనారోగ్యం వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికా నిఘా విభాగం కూడా కిమ్ విషమ పరిస్థితుల్లో ఉన్నారన్న వార్తలు అబద్దమని చెబుతోంది.

కాగా, పెంటగాన్‌లో పని చేసే అధికారి మాత్రం.. కిమ్‌కు సంబంధించిన ట్రైన్ వోన్‌సాన్‌లో ఉందంటే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు నిజమయ్యే ఉంటాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉత్తరకొరియా ఎలాంటి మిలటరీ కార్యకలాపాలు మాత్రం చేయట్లేదని చెప్పారు.

ఇక దక్షిణ కొరియా కూడా కిమ్ అనారోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమనే చెబుతోంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు కిమ్ నుంచి ఒక సందేశం వచ్చిందని.. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోందంటూ కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొనడం గమనార్హం.

కాగా ప్రస్తుతం కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు తెరపడాలంటే ఆయనే మీడియా ముందుకు రావల్సి ఉందని అంటున్నారు. అంతర్జాతీయా మీడియా కూడా ఉత్తరకొరియా నుంచి ఎలాంటి వార్తలు వస్తాయా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.

First Published:  26 April 2020 6:25 AM GMT
Next Story