Telugu Global
National

లాక్‌డౌన్ వేళ ఆస్తి అమ్మి పేదలకు అన్నం పెడుతున్న అన్నదమ్ములు

ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్న కాలమిది. అసలే లాక్‌డౌన్.. తర్వాత మనకు నిత్యావసరాలు దొరకవేమో అని ఇండ్లలోనే స్టాక్ పెట్టుకుంటున్న వారిని చూస్తున్నాం. పేదోళ్లకు సహాయం కాదు కదా కనీసం ఇంటి ముందుకు వచ్చినోళ్లకు కూడా బిక్షం పెట్టని రోజులు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం కరోనా కారణంగా చాలామంది తమ స్వార్థం చూసుకునే వాళ్లే తయారయ్యారు. ఇలాంటి సమయంలో ఇద్దరు అన్నాదమ్ములు తమ భూమిని రూ.25 లక్షలకు అమ్మి ఆ డబ్బుతో లాక్‌డౌన్ వల్ల పనులు లేక […]

లాక్‌డౌన్ వేళ ఆస్తి అమ్మి పేదలకు అన్నం పెడుతున్న అన్నదమ్ములు
X

ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్న కాలమిది. అసలే లాక్‌డౌన్.. తర్వాత మనకు నిత్యావసరాలు దొరకవేమో అని ఇండ్లలోనే స్టాక్ పెట్టుకుంటున్న వారిని చూస్తున్నాం. పేదోళ్లకు సహాయం కాదు కదా కనీసం ఇంటి ముందుకు వచ్చినోళ్లకు కూడా బిక్షం పెట్టని రోజులు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం కరోనా కారణంగా చాలామంది తమ స్వార్థం చూసుకునే వాళ్లే తయారయ్యారు. ఇలాంటి సమయంలో ఇద్దరు అన్నాదమ్ములు తమ భూమిని రూ.25 లక్షలకు అమ్మి ఆ డబ్బుతో లాక్‌డౌన్ వల్ల పనులు లేక ఆకలితో ఉన్న వాళ్లకు ఆహారం అందిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో తాజమ్ముల్ పాషా, ముజమ్మిల్ పాషా అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో రోజువారీ కూలీలు, కార్మికులు వారి కుటుంబాలు పడుతున్న బాధను చూసి ఈ సోదరులు తమ భూమిని అమ్మి వాళ్ళందరికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తమకు ఉన్న భూమిలో కొంత భాగాన్ని అమ్మేసి ఆ డబ్బుతో బియ్యం, పప్పులు, వంట నూనె ఇతర సామాగ్రిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఇక రోజూ ఆహారం సిద్దం చేయడానికి తమ ఇంటి పక్కనే టెంట్ వేసి కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు.

”మా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బతకడానికి కోలార్‌లోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాం. అక్కడి ప్రజలు హిందూ, ముస్లిం, సిక్కు అనే వేర్పాటు భావనలు లేకుండా మమ్మల్ని కూడా అక్కున చేర్చుకుని సహాయపడ్డారు” అని తాజమ్ముల్ పాషా అన్నాడు.

”మేం చాలా పేదరికంలో పెరిగాము. కాని అన్ని వర్గాల ప్రజలు ఇచ్చిన సహకారంతోనే ఇవ్వాళ ఈ స్థితికి చేరుకున్నాం. మా స్నేహితుడికే భూమిని అమ్మగా అతడు సకాలంలో డబ్బు సమకూర్చాడు. అగ్రిమెంట్ బాండ్‌పై సంతకం చేసి మా స్నేహితుడికి ల్యాండ్ అప్పగించాం. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే అతడికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం” అని ఆ సోదరులు చెబుతున్నారు.

పాషా సోదరులు అరటి పంట సాగు చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారు. తల్లిదండ్రులను కోల్పోయిన సమయంలో తాజమ్ముల్‌కు 5 ఏండ్లు, ముజమ్మిల్‌కు 3 ఏండ్లు. బతకడానికి చక్‌బల్లాపూర్ నుంచి అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలార్ వెళ్లారు. అలా అంచలంచెలుగా ఎదిగి ఇవాళ ఇతరులకు సహాయం చేసేంత స్థితికి చేరుకున్నారు.

ఈ లాక్‌డౌన్ సమయంలో దాదాపు 3 వేల కుటుంబాలకు బియ్యం, పప్పులు, నూనె, చక్కెర, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేశారు. అంతే కాకుండా పేదలకు శానిటైజర్లు, మాస్కులు కూడా పంచి పెట్టారు. వీరి ఔదార్యానికి ప్రతీ ఒక్కరు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు.

First Published:  26 April 2020 1:50 AM GMT
Next Story