Telugu Global
International

హెల్మెట్ ధరించడం కంటే చావటమే మేలు

ఇది… కింగ్ వివియన్ రిచర్డ్స్ మాట హెల్మెట్ లేకుండానే అలవోకగా పరుగులు సాధించిన కింగ్ ఆధునిక క్రికెట్లో బ్యాటింగ్ అనగానే…హెల్మెట్, గార్డ్, ఆర్మ్ గార్డ్స్, పక్కటెముకల గార్డ్స్, తైప్యాడ్స్ ధరించిన బ్యాట్స్ మన్ మాత్రమే నేటితరంవారికి గుర్తుకు వస్తారు. అయితే… 1970 దశకంలో హెల్మెట్లు లేకుండానే, ఎలాంటి రక్షణ కవచాలు ధరించకుండానే… అరివీర భయంకర ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని అలవోకగా హుక్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లు, పుల్ షాట్లు బాదేస్తూ… టన్ను కొద్దీ పరుగులు సాధించిన మొనగాళ్లలో ముందుగా  చెప్పుకోవాల్సింది… కరీబియన్ […]

హెల్మెట్ ధరించడం కంటే చావటమే మేలు
X
  • ఇది… కింగ్ వివియన్ రిచర్డ్స్ మాట
  • హెల్మెట్ లేకుండానే అలవోకగా పరుగులు సాధించిన కింగ్

ఆధునిక క్రికెట్లో బ్యాటింగ్ అనగానే…హెల్మెట్, గార్డ్, ఆర్మ్ గార్డ్స్, పక్కటెముకల గార్డ్స్, తైప్యాడ్స్ ధరించిన బ్యాట్స్ మన్ మాత్రమే నేటితరంవారికి గుర్తుకు వస్తారు.

అయితే… 1970 దశకంలో హెల్మెట్లు లేకుండానే, ఎలాంటి రక్షణ కవచాలు ధరించకుండానే… అరివీర భయంకర ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని అలవోకగా హుక్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లు, పుల్ షాట్లు బాదేస్తూ… టన్ను కొద్దీ పరుగులు సాధించిన మొనగాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది… కరీబియన్ క్రికెట్ బ్యాటింగ్ ఆల్ టైమ్.. గ్రేట్ సర్ ఇజాక్ వివియన్ రిచర్డ్స్ పేరు మాత్రమే.

ఆ రోజుల్లో క్రికెట్ అభిమానులంతా రిచర్డ్స్ ను కింగ్ రిచర్డ్స్ అంటూ అభిమానంతో పిలుచుకొనేవారు. వివియన్ రిచర్డ్స్ బ్యాట్ పట్టుకొని… నిర్భయంగా… వేటకు
బయలుదేరిన కొదమసింహలా…ఠీవీగా నడుచుకొంటూ వస్తుంటే…ప్రత్యర్థి ఆటగాళ్లు, ప్రధానంగా బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం, అభిమానులు కేరింతలు కొడుతూ ఉండటం ఏకకాలంలో జరిగిపోతూ ఉండేవి.

బ్యాటింగ్ ప్యాడ్స్, గ్లౌవ్స్ మాత్రమే ధరించి…నెత్తిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు టోపీ మాత్రమే పెట్టుకొని…చూయింగ్ గమ్ నములుతూ వీవ్ రిచర్డ్స్ అలవోకగా షాట్లు కొడుతూ, బౌలర్లను ఊచకోత కోసిన తీరు క్రికెట్ చరిత్రలో ఓ అపూర్వఘట్టంగా నిలిచిపోతుంది. నాటితరం అభిమానులకు ఆ దృశ్యాలు, జ్ఞాపకాలు ఇప్పటికీ గొప్ప అనుభూతినే కలిగిస్తాయి.

హెల్మెట్ లేకుండానే…?

వీవ్ రిచర్డ్స్ ఆడే రోజుల్లో…బౌన్సర్లు, షార్ట్ పిచ్ బాల్స్ పైన నియంత్రణలేదు, నిబంధనలు అసలే లేవు. అంతేకాదు…డెన్నిస్ లిల్లీ, జెఫ్ థాంప్సన్, ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, రిచర్డ్ హ్యాడ్లీ, బాబ్ విల్లిస్, వసీం అక్రం, కపిల్ దేవ్ లాంటి ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లు సవాలు విసురుతూ ఉండేవారు.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బంతులను రిచర్డ్స్ అలవోకగా ఎదుర్కొంటూ, ఎదురుదాడికి దిగటం ద్వారా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించేవాడు.

బౌండ్రీలు కొట్టటం, సిక్సర్లు బాదటం చూయింగ్ గమ్ నమలటంలాంటిదేనన్నట్లు అనిపించేవాడు.
తనకు హెల్మెట్ ధరించి బ్యాటింగ్ చేయటం అసౌకర్యమనిపించేదని, బ్యాటింగ్ అంటే హెల్మెట్ లేకుండా చేసేది మాత్రమేనని తాను భావించేవాడినని, ఒకవేళ బంతి వచ్చి తలకు బలంగా తాకినా…క్రికెట్ ఆడుతూ మరణించడానికే ఇష్టపడేవాడినని…కింగ్ రిచర్డ్స్ ఓ ఇంటర్వ్యూలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పాడు.

తన వ్యక్తిగత దంత వైద్యుడు సైతం…హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ కు దిగడమే ప్రమాదకరమని, పళ్ల రక్షణ కోసం మౌత్ గార్డ్ ను వాడమని తరచూ సలహా ఇచ్చినా తాను ఖాతరు చేసేవాడిని కానని గుర్తు చేసుకొన్నాడు.

చూయింగ్ గమ్ సీక్రెట్..?

బ్యాటింగ్ కు దిగిన సమయంలో చూయింగ్ గమ్ నమలటం తనకు అదనపు బలమని, చూయింగ్ గమ్ నములుతూ ఉంటే తన ఏకాగ్రత పెరుగుతూ ఉండేదని, తన బ్యాటింగ్ కూ తెలియకుండా ఓ లయ వచ్చేదని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు.

చూయింగ్ గమ్ నములుతూ బ్యాటింగ్ చేయటం చాలామంది బ్యాట్స్ మన్ లకు ఇబ్బందిగా అనిపించేదని, చూయింగ్ గమ్ నమలటం మీద ఏకాగ్రత నిలిపి.. బ్యాటింగ్ పైన మనసు లగ్నం చేయటంలో విఫలమై అవుటయ్యేవారని రిచర్డ్స్ తెలిపాడు.

పైగా గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఫార్ములావన్ రేస్ లతో పోల్చిచూస్తే… హెల్మెట్ లేకుండా ఆడే క్రికెట్.. అంత ప్రాణాంతకం కాదన్నది రిచర్డ్స్ అభిప్రాయం.

68 సంవత్సరాల రిచర్డ్స్ 1974- 1991 మధ్యకాలంలో వెస్టిండీస్ జట్టులో మాస్టర్ బ్యాట్స్ మన్ గా కొనసాగాడు. 1974 నవంబర్ 22న భారత ప్రత్యర్థిగా టెస్ట్ అరంగేట్రం చేసిన వివియన్ రిచర్డ్స్.. తన కెరియర్ లో 121 టెస్టులు ఆడి 24 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలతో 8వేల 540 పరుగులు సాధించాడు.

187 వన్డేలు ఆడి 11 శతకాలు, 45 అర్ధశతకాలతో పాటు 6 వేల 721 పరుగులు నమోదు చేశాడు.

బౌలర్ గా టెస్టు మ్యాచ్ ల్లో 32 వికెట్లు, వన్డే మ్యాచ్ ల్లో 118 వికెట్లు పడగొట్టిన మొనగాడు వివియన్ రిచర్డ్స్. వంద సంవత్సరాలకోసారి… రిచర్డ్స్ లాంటి అసాధారణ క్రికెట్ ప్రపంచ క్రికెట్లోకి వస్తూ ఉంటారు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ నుంచి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లంతా కింగ్ రిచర్డ్స్ ను చూసి స్ఫూర్తి పొందినవారే. హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేయటానికి, 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బంతులను ఎదుర్కొనాలంటే ..గుండెధైర్యం ఉండి తీరాల్సిందే.

First Published:  9 April 2020 9:19 PM GMT
Next Story