Telugu Global
International

కరోనా కాటు... ఈ 5 రంగాలపై భయంకరమైన ఆర్థిక పోటు

కరోనా ప్రభావం.. ప్రజల ఆర్థిక సంక్షోభానికి దారి తీసే ప్రమాదకర స్థితికి చేరుకుంది. ప్రజల జీవితాలతో ముడి పడి ఉన్న అత్యంత ప్రధానమైన 5 రంగాలపై పెను ప్రభావాన్ని కలిగిస్తోంది. ఆ రంగాలు ఏంటి.. వాటి పరిస్థితి ఏంటో ఓ సారి చూద్దాం. 1. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి కుదేలు తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. ఒక్క తెలంగాణకే కరోనా ప్రభావం.. ఏకంగా 13 వేల కోట్ల ఆదాయాన్ని దూరం చేసింది. ఈ విషయాన్ని ఏకంగా […]

కరోనా కాటు... ఈ 5 రంగాలపై భయంకరమైన ఆర్థిక పోటు
X

కరోనా ప్రభావం.. ప్రజల ఆర్థిక సంక్షోభానికి దారి తీసే ప్రమాదకర స్థితికి చేరుకుంది. ప్రజల జీవితాలతో ముడి పడి ఉన్న అత్యంత ప్రధానమైన 5 రంగాలపై పెను ప్రభావాన్ని కలిగిస్తోంది. ఆ రంగాలు ఏంటి.. వాటి పరిస్థితి ఏంటో ఓ సారి చూద్దాం.

1. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి కుదేలు

తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. ఒక్క తెలంగాణకే కరోనా ప్రభావం.. ఏకంగా 13 వేల కోట్ల ఆదాయాన్ని దూరం చేసింది. ఈ విషయాన్ని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. సహాయక చర్యలు, జీతాల చెల్లింపునకు ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2. మీడియా ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ

దేశ వ్యాప్తంగా మీడియాపై ఆధారపడి లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. రిపోర్టర్లు, డెస్క్ సబ్ ఎడిటర్లు, మార్కెటింగ్, ఏజెన్సీ డీలర్లు, పేపర్ బాయ్స్, టెక్నికల్ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లు, పేపర్ డిజైనర్లు.. అదనంగా డిజిటల్ మీడియాకు సంబంధించిన విభాగాలు.. ఇలా అనేక విభాగాల్లో, వాటి అనుబంధ విభాగాల్లో చాలా మంది పని చేస్తున్నారు.

ఇలాంటి సందర్భాల్లో మీడియాకు ప్రధాన ఆర్థిక వనరు అయిన ప్రకటనల విభాగం దారుణంగా దెబ్బతింది. గతంలో వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏకంగా 80 నుంచి 90 శాతం ఆదాయం తగ్గిపోవడం.. ప్రముఖ సంస్థలు కూడా జీతాల్లో కోత విధించేలా చేస్తోంది. మరికొన్ని సంస్థల్లో అయితే ఉద్యోగులను ఇంటికి పంపించిన సందర్భాలనూ ఇటీవల మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి మీడియా సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.

3. ఆగిపోయిన సినీ పరిశ్రమ కార్యకలాపాలు

వేల కోట్ల రూపాయల మార్కెట్… సినీ పరిశ్రమ సొంతం. ప్రముఖ హీరోల సినిమాలు విడుదలైతే.. ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా రెండు మూడు వందల కోట్లు చాలా సులువుగా కొల్లగొట్టేస్తున్నాయి.

ఇలాంటి పరిశ్రమపై కరోనా ప్రభావం దారుణంగా పడింది. సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి. జూనియర్ ఆర్టిస్టులు రోడ్డున పడ్డారు. ఇతర విభాగాల సిబ్బందికి పని లేదు. నటులు, నిపుణులు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న పెద్దల సంగతి సరే. మిగతా వారి పరిస్థితే ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది.

వందల కోట్లు పెట్టుబడులు పెట్టిన నిర్మాతలకు.. ఆ రెవెన్యూ ఎలా తిరిగి సంపాదించుకోవాలన్నది అర్థం కాకుండా ఉంది.

4. నిలిచిపోయిన చిరు వర్తకుల వ్యాపారాలు

లాక్ డౌన్ ప్రభావం.. చిరు వర్తకులకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పగలంతా కష్టపడి అమ్మకాలు చేస్తే.. వచ్చే డబ్బుతో బతుకు బండిని లాగే వర్గానికి చెందిన వారు ఈ ప్రజలు.

ఇప్పుడు ఆంక్షల కారణంగా జనం బయటికి రావడం లేదు. ప్రభుత్వమే సరుకులు ఇంటికి పంపిస్తోంది. అవసరమైతే జనం నియమిత వేళల్లో బయటికి వచ్చి వారం, పది రోజులకు సరిపడా ఒకేసారి కొనుగోలు చేసుకువెళ్తున్నారు. ఈ ఫలితం… చిరు వర్తకులు, ఫుట్ పాత్ లపై అమ్మకాలు చేసి కుటుంబాలను పోషించుకునే వారికి తీరని ఇబ్బందులు మిగిల్చింది.

5. ఆగిన పరిశ్రమలు, నిలిచిన చేతి వృత్తులు.. ప్రశ్నార్థకంగా జీవితాలు

ఐటీ రంగానికి చెందిన వారు వర్క్ ఫ్రమ్ హోం అంటున్నారు. వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. పోలీసులు, డాక్టర్లు.. అత్యవసర సేవలకు చెందిన ప్రభుత్వ విభాగాలు, నిత్యావసర సరుకులకు చెందిన వ్యాపార కార్యకలాపాలు మినహా.. మిగిలిన అన్ని రంగాలు ఇప్పుడు స్తబ్దుగా మారిపోయాయి.

టిఫిన్ సెంటర్లు, సెలూన్ షాపులు, వలస కార్మికులు, జ్యువెల్లరీ కార్మికులు, భవన నిర్మాణ పనుల నుంచి మొదలు పెట్టి… భారీ పరిశ్రమల వరకూ అంతటా లాక్ డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆలయాల్లోనూ దేవుళ్లకు ఏకాంత సేవలే తప్ప వైభవోపేతమైన సేవలు పండగ రోజుల్లోనూ కరువైపోయాయి. ఆ రంగం ఈ రంగం అని తేడానే లేకుండా ఎటు చూసినా నిశ్శబ్దమైన వాతావరణం.. భయానకంగా కనిపిస్తోంది.

ఇంతటి ఉత్పాతాన్ని మిగులుస్తున్న కరోనా.. ఇంకెలాంటి భయానక వాతావరణాన్ని మిగులుస్తుందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ పరిణామాన్ని ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటాయి.. సమస్యలు ఎలా పరిష్కరిస్తాయి అన్నదే.. అంతటా చర్చనీయాంశంగా మారింది.

Next Story