Telugu Global
International

కరోనా దెబ్బతో 2020 వింబుల్డన్ రద్దు

టోర్నీ రద్దుతో ఫెదరర్, సెరెనా షాక్ కరోనా వైరస్ దెబ్బతో…విశ్వవిఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సైతం రద్దుల పద్దులో చేరిపోయింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత… వార్షిక వింబుల్డన్ టోర్నీ రద్దుకావడం ఇదే మొదటిసారి. 1877 నుంచి క్రమం తప్పకుండా జరుగుతూ వస్తున్న ఈ గ్రాండ్ స్లామ్.. గ్రాస్ కోర్టు టెన్నిస్ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. అంతేకాదు… జీవితకాలంలో ఒక్కసారి ఈ టోర్నీలో పాల్గొన్నా తమ జన్మధన్యమైనట్లుగానే టెన్నిస్ ప్లేయర్లు భావిస్తారు. జూన్ 29 నుంచి రెండువారాలపాటు సాగే […]

కరోనా దెబ్బతో 2020 వింబుల్డన్ రద్దు
X
  • టోర్నీ రద్దుతో ఫెదరర్, సెరెనా షాక్

కరోనా వైరస్ దెబ్బతో…విశ్వవిఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సైతం రద్దుల పద్దులో చేరిపోయింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత… వార్షిక వింబుల్డన్ టోర్నీ రద్దుకావడం ఇదే మొదటిసారి.

1877 నుంచి క్రమం తప్పకుండా జరుగుతూ వస్తున్న ఈ గ్రాండ్ స్లామ్.. గ్రాస్ కోర్టు టెన్నిస్ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. అంతేకాదు… జీవితకాలంలో ఒక్కసారి ఈ టోర్నీలో పాల్గొన్నా తమ జన్మధన్యమైనట్లుగానే టెన్నిస్ ప్లేయర్లు భావిస్తారు.

జూన్ 29 నుంచి రెండువారాలపాటు సాగే ఈ టోర్నీ కోసం సీడెడ్ ప్లేయర్లంతా ఎంతో ఆశతో ఎదురుచూడటమే కాదు…సాధన చేస్తూ వచ్చారు.

ఫెదరర్, సెరెనా షాక్…

వింబుల్డన్ చరిత్రలో అత్యధికంగా రోజర్ ఫెదరర్ ఎనిమిదిసార్లు పురుషుల సింగిల్స్ టైటిల్స్ నెగ్గితే… అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ ఆరుసార్లు విజేతగా నిలిచింది. ఈ ఇద్దరూ..2020 టోర్నీలో మరోసారి తమ అదృష్టం పరీక్షించుకోవాలని ఆశించారు.

అయితే … కరోనా వైరస్ దెబ్బతో పోటీలు రద్దు చేస్తున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించడంతో.. తాము తీవ్రనిరాశకు గురైనట్లు ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రకటించారు.

వచ్చే ఏడాది జరిగే 2021 వింబుల్డన్ టోర్నీ నాటికి..ఇటు ఫెదరర్, ఇటు సెరెనా ఇద్దరూ 40వ పడిలో పడనున్నారు. గత ఏడాది టోర్నీలో విజేతలుగా నిలిచిన సిమోనా హాలెప్, నొవాక్ జోకోవిచ్ డిఫెండింగ్ చాంపియన్లుగా టైటిల్ వేటకు దిగాలని భావించినా ఆ అవకాశం లేకుండాపోయింది.

వింబుల్డన్ తో తనకు ప్రత్యేక అనుబంధమే ఉందని…ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయటం మినహా వేరే దారిలేదని ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ జోకోవిచ్ ట్విట్ చేశాడు.

మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా మాత్రం…వింబుల్డన్ లేని ఏడాదిని, టెన్నిస్ ను ఊహించడం చాలా కష్టమని వాపోయింది.

బిల్లీ జీన్ కింగ్ కు సైతం తప్పని నిరాశ

1961 నుంచి తాను ప్రతిఏడాది వింబుల్డన్ కు హాజరవుతూ వస్తున్నానని…తన జీవితకాలంలో తొలిసారిగా వింబుల్డన్ కు దూరం కావడం కష్టమేనని ఆరుసార్లు విన్నర్, మాజీ దిగ్గజం బిల్లీ జీన్ కింగ్ పేర్కొంది.

మొత్తం మీద టోక్యో ఒలింపిక్స్, యూరోపియన్ ఫుట్ బాల్, కోపా అమెరికా కప్ సాకర్ టోర్నీ, యూరో లీగ్, ఫార్ములావన్ లాంటి మేటి అంతర్జాతీయ పోటీలన్నీ రద్దులు, వాయిదాల పద్దులో చేరగా… తాజాగా వింబుల్డన్ సైతం వచ్చి వాటి సరసన చేరినట్లయ్యింది.

First Published:  2 April 2020 9:51 AM GMT
Next Story