Telugu Global
International

టోక్యో ఒలింపిక్స్ పై కరోనా మేఘాలు

వాయిదాకు పెరుగుతున్న ఒత్తిడి ప్రపంచ దేశాలన్నీ కరోనా ముప్పును ఎదుర్కొనడానికి ఓవైపు నానాపాట్లు పడుతుంటే… మరోవైపు టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేసే ప్రసక్తే లేదని, ముందుగా నిర్ణయించిన ప్రకారమే జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ధీమాగా చెబుతోంది. అయితే…. రోజురోజుకూ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువవుతూ ఉండడంతో…వివిధ దేశాల క్రీడా సమాఖ్యలు, అథ్లెట్లు మాత్రం ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 51 శాతం ఒలింపిక్స్ […]

టోక్యో ఒలింపిక్స్ పై కరోనా మేఘాలు
X
  • వాయిదాకు పెరుగుతున్న ఒత్తిడి

ప్రపంచ దేశాలన్నీ కరోనా ముప్పును ఎదుర్కొనడానికి ఓవైపు నానాపాట్లు పడుతుంటే… మరోవైపు టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేసే ప్రసక్తే లేదని, ముందుగా నిర్ణయించిన ప్రకారమే జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ధీమాగా చెబుతోంది.

అయితే…. రోజురోజుకూ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువవుతూ ఉండడంతో…వివిధ దేశాల క్రీడా సమాఖ్యలు, అథ్లెట్లు మాత్రం ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

51 శాతం ఒలింపిక్స్ బెర్త్ లు పూర్తి….

టోక్యోనగరం వేదికగా రెండువారాలపాటు సాగే ఒలింపిక్స్ లో 27కు పైగా క్రీడాంశాలలో 204 దేశాలకు చెందిన 12వేలమంది అథ్లెట్లు పోటీపడబోతున్నారు.

వివిధ క్రీడల్లో అర్హత కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీల ద్వారా ఇప్పటికే 51 శాతం బెర్త్ లు పూర్తయ్యాయని, మరో 49 శాతం ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని నిర్వాహక సంఘం చెబుతోంది.

మిగిలిన బెర్త్ ల అర్హత కోసం నిర్వహించాల్సిన పోటీలకు కరోనా దెబ్బ తగలడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

అథ్లెట్లకు టెన్షన్ టెన్షన్….

ప్రపంచ క్రీడాసంరంబం టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి గత మూడుసంవత్సరాలుగా సన్నాహాలు చేసుకొంటూ, సాధన చేస్తూ కొండంత ఆశతో ఎదురుచూస్తున్న వివిధ దేశాల అథ్లెట్లు… అనుకోని అతిథిలా వచ్చిన కరోనా వైరస్ ముప్పుతో ఒణికిపోతున్నారు.

మరో నాలుగుమాసాలలో జరిగే ఒలింపిక్స్ కు సమాయత్తం కావాలో… లేక క్వారెంటైన్ లో ఉండిపోవాలో అర్థంకాక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కరోనా వైరస్ భయం నడుమ అథ్లెట్లు ఏకాగ్రతతో సాధన చేసే పరిస్థితి లేకుండా పోయిందని, తీవ్రఒత్తిడిలో పడిపోయారని అమెరికా అథ్లెటిక్స్ సమాఖ్య, అమెరికా పారా ఒలింపిక్ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఒలింపిక్స్ నిర్వహించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి.

అంతేకాదు…భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్,చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సైతం… ఒలింపిక్స్ ను వాయిదా వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన క్రీడాకార్యక్రమాలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయని, కరోనా దెబ్బ నుంచి కోలుకోడానికి, సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేమని అంటున్నారు.

పరిస్థితి సాధరణ స్థితికి వచ్చిన తర్వాతే ఒలింపిక్స్ నిర్వహిస్తే బాగుంటుందని చెబుతున్నారు. నార్వే ఒలింపిక్స్ సమాఖ్య సైతం.. క్రీడల్ని వాయిదా వేయాలంటూ ఓ లేఖను పంపింది.

కరోనా వైరస్ ను జపాన్ ప్రభుత్వం అదుపు చేసినా క్రీడలు నిర్వహించడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.

ఒలింపిక్స్ కు ఆటంకాలు మామూలే…

1896 ఏథెన్స్ ప్రారంభ క్రీడల నుంచి ఒలింపిక్స్ కు అవాంతరాలు, పరీక్షలు ఎదురుకావడం ఇదే మొదటిసారికాదు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1916, 1940, 1944 ఒలింపిక్స్ రద్దు కాగా… 1936 బెర్లిన్, 1956మెల్బోర్న్, 1964 టోక్యో, 1976 మాంట్రియెల్,1980 మాస్కో ఒలింపిక్స్, 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్…. రాజకీయ కారణాలతో బహిష్కరణలకు గురయ్యాయి.

అయితే…వైరస్ కారణంగా ఒలింపిక్స్ సందిగ్ధంలో పడటం మాత్రం ఇదే మొదటిసారి. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉన్నామని..నిర్వాహక సంఘంతో సవివరంగా చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకొంటామని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు థామస్ బెక్ చెబుతున్నారు.

ఏదిఏమైనా… ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జులై 24న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభంకావడం అంతతేలిక ఏమాత్రం కాబోదు.

First Published:  22 March 2020 11:55 PM GMT
Next Story