యధావిధిగా టోక్యో ఒలింపిక్స్, టీ-20 ప్రపంచకప్
వాయిదా ఆలోచనలేదన్న నిర్వాహక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానదేశాలన్నీ ఓవైపు కరోనా వైరస్ ముప్పుతో గడగడలాడిపోతుంటే…మరోవైపు యూరోపియన్ ఫుట్ బాల్, కోపా అమెరికా కప్ లాంటి ప్రధాన సాకర్ టోర్నీలను నిర్వాహక సంఘాలు ఏడాదిపాటు వాయిదా వేయటం ద్వారా ఊపిరి పీల్చుకొన్నాయి. అయితే…టోక్యో వేదికగా జరగాల్సిన 2020 ఒలింపిక్స్ ను, ఆస్ట్ర్రేలియా వేదికగా జరగాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ టోర్నీలను మాత్రమే వాయిదా వేసే ఆలోచన తమకు ఏదీ లేదని ఆ రెండు నిర్వాహక సంఘాలు ప్రకటించాయి. జులై 24 […]
- వాయిదా ఆలోచనలేదన్న నిర్వాహక సంఘాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రధానదేశాలన్నీ ఓవైపు కరోనా వైరస్ ముప్పుతో గడగడలాడిపోతుంటే…మరోవైపు యూరోపియన్ ఫుట్ బాల్, కోపా అమెరికా కప్ లాంటి ప్రధాన సాకర్ టోర్నీలను నిర్వాహక సంఘాలు ఏడాదిపాటు వాయిదా వేయటం ద్వారా ఊపిరి పీల్చుకొన్నాయి.
అయితే…టోక్యో వేదికగా జరగాల్సిన 2020 ఒలింపిక్స్ ను, ఆస్ట్ర్రేలియా వేదికగా జరగాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ టోర్నీలను మాత్రమే వాయిదా వేసే ఆలోచన తమకు ఏదీ లేదని ఆ రెండు నిర్వాహక సంఘాలు ప్రకటించాయి.
జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ ఒలింపిక్స్..
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ 2020 ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. ఈపోటీలలో ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలకు చెందిన 12వేలమందికి పైగా అథ్లెట్లు పోటీపడనున్నారు.
అయితే…శీతలదేశమైన జపాన్ లో సైతం కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడంతో జపాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
కరోనా వైరస్ వ్యాప్తిని ఓ కంట గమనిస్తూనే ఉన్నామని, ఒలింపిక్స్ ను వాయిదా వేసే ఆలోచన ఏదీ తమకు లేదని నిర్వాహక సంఘం ప్రతినిధి తమ మనసులో మాట బయటపెట్టారు.
స్పాన్సర్లతోనూ, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంప్రతినిధులతోనూ నిర్వాహక టోక్యో ఒలింపిక్స్ సంఘం సవివరింగా చర్చించిన తర్వాత ఈ ప్రకటన చేసింది.
భారత అథ్లెట్ కు కిరణ్ రిజ్జూ సందేశం..
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత అథ్లెట్లందరూ…కరోనావైరస్ ముప్పు తో నిరాశకు గురికారాదని, తమ సాధనను కొనసాగించాలని కోరారు.
ఒలింపిక్స్ లో పాల్గొంటున్నామన్న భావనతోనే ప్రాక్టీసు కొనసాగించాలని, సన్నద్ధంకావాలని సూచించారు.
వాయిదా లేని టీ-20 ప్రపంచకప్
ఇప్పటికే మహిళా టీ-20 ప్రపంచకప్ ను అట్టహాసంగా నిర్వహించిన క్రికెట్ ఆస్ట్ర్రేలియా..అక్టోబర్ లో జరగాల్సిన పురుషుల టీ-20 ప్రపంచకప్ ను సైతం ముందుగా ప్రకటించిన కార్యక్రమం ప్రకారమే నిర్వహిస్తామని ధీమాగా చెబుతోంది.
అక్టోబర్ నాటికి కరోనా వైరస్ ముప్పు సమసిపోయే అవకాశం ఉందని భావిస్తోంది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకూ ఆస్ట్ర్రేలియాలోని ఏడు వేదికల్లో.. ప్రపంచకప్ పోటీలను నిర్వహించాల్సి ఉంది. వచ్చే 60 రోజుల కాలం తమకు ఎంతో కీలమని, కరోనా వైరస్ వ్యాప్తిని గమనిస్తూనే ఉంటామని…దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి
ప్రకటించింది.
మొత్తం పరిస్థితులు అనుకూలిస్తే, కరోనా వైరస్ కరుణించి ఉపశమనమిస్తే…ప్రపంచంలోనే రెండు అతిపెద్ద క్రీడాసంబరాలు ఒలింపిక్స్, టీ-20 ప్రపంచకప్ టోర్నీలు.. యధావిధిగానే జరుగనున్నాయి. ఏ నిముషానికి ఏమి జరుగునో ఆ కరోనా వైరస్ కు మాత్రమే తెలియాలి.