Telugu Global
Others

కుల అఘాయిత్యాలు, సామాజిక మాధ్యమం

దళితుల మీద తరచుగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషాదకర పరిస్థితి గురించే డా. బి.ఆర్. అంబేద్కర్ అనేక దశాబ్దాల కిందే ఆవేదన వ్యక్తం చేశారు. అంటరాని వారి మీదే అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయని ఆయన నిలదీశారు. ఈ విషాదం ఈ మధ్య మరింత తీవ్రంగా కొనసాగుతోంది. దళితుల మీద అత్యాచారాలు ఒక జాతరలా సాగుతున్నాయి. ఒక వేపున ఈ అఘాయిత్యాలను చూసి ఆనందించే వారు ఉన్నారు. మరో వేపున ఇది అగ్రకులాధిపత్యానికి సంకేతం అన్న వాస్తవమూ […]

కుల అఘాయిత్యాలు, సామాజిక మాధ్యమం
X

దళితుల మీద తరచుగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషాదకర పరిస్థితి గురించే డా. బి.ఆర్. అంబేద్కర్ అనేక దశాబ్దాల కిందే ఆవేదన వ్యక్తం చేశారు. అంటరాని వారి మీదే అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయని ఆయన నిలదీశారు. ఈ విషాదం ఈ మధ్య మరింత తీవ్రంగా కొనసాగుతోంది.

దళితుల మీద అత్యాచారాలు ఒక జాతరలా సాగుతున్నాయి. ఒక వేపున ఈ అఘాయిత్యాలను చూసి ఆనందించే వారు ఉన్నారు. మరో వేపున ఇది అగ్రకులాధిపత్యానికి సంకేతం అన్న వాస్తవమూ బోధ పడ్తోంది. దళిత మహిళలను, పురుషులను నగ్నంగా నడిపిస్తే పైశాచిక ఆనందం అనుభవించే వారు ఉన్నారు. దళితులను బహిరంగంగా చితగ్గొట్టడం అగ్రకులాల ఆధిపత్య ధోరణికి నిదర్శనం. ఇందులో సామాజిక మాధ్యమాల బాధ్యతా ఉంది. పైగా దృశ్య రూపంలో ఈ అఘాయిత్యాలను ప్రచారంలో పెడ్తున్నారు.

బహుశా 2004లో సామాజిక మాధ్యమం అస్తిత్వంలోకి వచ్చినప్పటి నుంచి సజీవ చిత్రాలు, వార్తలు, కుల అఘాయిత్యాలు విరివిగా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంతకు ముందు ఇవి పత్రికల్లో మాత్రమే కనిపించేవి. వీటిని చూసే దళితుల మీద జరిగే అఘాయిత్యాల గురించి తెలిసేది. పత్రికల్లో వచ్చే ఈ వార్తలను చూసే దళితులు ఉమ్మడిగా తమ స్థితిగతులను గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. సామాజిక మాధ్యమాలలో ఈ అంశాలు అందుబాటులోకి రావడంవల్ల బాధితుల మీద, అఘాయిత్యాలకు పాల్పడే వారి మీద కూడా ప్రభావం కనిపిస్తోంది.

బాధితులు అనుభవిస్తున్న బాధ తీవ్రత ఏమిటో సామాజిక మాధ్యమాలవల్ల తెలుస్తోంది. బాధితుడైన వ్యక్తితో పాటు ఆ వర్గానికి చెందిన వారు తమ నైతికతకు కలుగుతున్న నష్టం ఏమిటో తెలుసుకోగలుగుతున్నారు. తమ నైతికతకు భంగం కలిగిందనుకునే వారు ఆత్మ న్యూనతా భావానికి గురవుతారు. అవమాన పడ్తారు. గుజరాత్ లోని ఊనాలో, రాజస్థాన్ లోని నాగౌర్ లో దళితుల మీద జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఆ వర్గంలో తీవ్ర వ్యధకు దారి తీశాయి. అఘాయిత్యానికి పాల్పడిన వారు తమ ఆధిక్యతను చాటుకోవడంతో పాటు తామేదో ఘనకార్యం సాధించామనుకుని సంబరపడ్డారు. ఆ రకంగా సామాజిక మాధ్యమాలు కులాధిక్యతను పెంచి పోషించడానికి తోడ్పడ్డాయి. మరో వేపు దళితులు ఆత్మ న్యూనతా భావానికి గురయ్యారు.

అందుకే చాలా సందర్భాలలో తమ మీద అఘాయిత్యాలు జరిగినా ఫిర్యాదు చేయకుండా, ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్.ఐ.ఆర్.) దాఖలు అయ్యేట్టు చూడకుండా తల దించుకు ఉండి పోయారు. కొన్ని సందర్భాల్లో నిరసన కూడా వ్యక్తం చేశారు. అవమానానికి వ్యతిరేకంగా ఇంకో రకంగా చెప్పలంటే ఆత్మ గౌరవం కోసం పోరాడవలసిన ఆవశ్యకత ఉందని కూడా దళితులు గుర్తించారు. నయా ఉదారవాదం జోరు అందుకున్న సమయంలో కూడా ఈ ధోరణి వ్యక్తమవుతోంది. నయా ఉదారవాద రాజకీయ ఆర్థిక స్థితికి, అలాంటి విధాయక భాషకు మధ్య ఉన్న సంబంధాన్ని ఘన శ్యాం షా “నయా ఉదారవాద రాజకీయ ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఉద్రిక్తతలు” అన్న వ్యాసంలో విడమర్చారు. ఈ వ్యాసం 2017 సెప్టెంబర్ 2 ఇ.పి.డబ్ల్యు. సంచికలో ప్రచురితమైంది.

సామాజిక మాధ్యమం ఒక రకంగా కులాధిపత్యాన్ని సుస్థిరం చేయడానికీ ఉపకరిస్తోంది. అట్టడుగు వర్గాల వారిని కించ పరచడానికి అగ్ర వర్ణాల వారు సామాజిక మాధ్యమాలను విపరీతంగా వినియోగిస్తున్నారు. అత్యాచారాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ద్వారా ఈ పని చేస్తున్నారు. అయితే ఇదే మాధ్యమం గతి తప్పి ప్రతికూలంగా కూడా మారవచ్చు.

నాగౌర్ సంఘటనపై పోలీసుల ప్రకటనను చూసినా సామాజిక మాధ్యమంలో బాగా ప్రచారంలోకి వచ్చిన వీడియో ఆధారంగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన ఉదంతాన్ని చూసినా సామాజిక మాధ్యమాల విస్తృతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే అగ్రవర్ణాల వారు తమ మీద ప్రతిగా మరో ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయించగలిగారని దళితులు అంటున్నారు. తమ మీద దాడికి సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. దాఖలైన తరవాత అగ్ర వర్ణాల వారు తమ మీద దొంగతనం కేసు మోపారని దళితులు చెప్తున్నారు. అంతే కాదు దళితులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయించకుండా అగ్ర వర్ణాల వారు అనేక ప్రయత్నాలు చేశారు.

భిన్నమైన ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలైనప్పుడు ఆ ప్రభావం విధ్వంసకరంగా ఉంటుంది. అగ్రవర్ణాల వారి దురాగతాలు కప్పి పుచ్చడానికి, వాస్తవం బయటపడకుండా చేయడానికీ తోడ్పడవచ్చు. కడకు ఇది న్యాయస్థానంలో విచారణకు అవరోధం కలిగించవచ్చు. తాము నిర్ణీత ప్రక్రియకు కట్టుబడాల్సి ఉంటుంది కనక అఘాయిత్యానికి పాల్పడిన వారు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా నిరోధించలేమని పోలీసులు వాదించే అవకాశం కలుగుతుంది.

దీనివల్ల నిజం ఏ వైపున ఉన్నా దళితులు దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్. నిజమే అయినా అవతలి పక్షం దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్. అసత్యం కాదేమో అనుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా దళితుల మీద జరిగిన అఘాయిత్యంలో ఎంత నిజమున్నా దాని మీద నీలి నీడలు కమ్ముకునే వీలుంటుంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.

అలాంటప్పుడు అఘాయిత్యం అన్నది ఒక అభిప్రాయంగా మారి న్యాయస్థానం విచారణలోనే నిజం నిగ్గు తేలాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఈ వ్యవహారం న్యాయస్థానం విచారణలో ఉంటుంది కనక దళితుల వాదనకు విలువ లేకుండా పోవచ్చు. ఎందుకంటే కోర్టు మెట్లెక్కే సదుపాయం వారికి ఎప్పుడైనా పరిమితమే.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Next Story