Telugu Global
National

జట్కావాలా, ఆటోవాలాల పుత్రికోత్సాహం

దేశానికే ఖ్యాతి తెస్తున్న అట్టడుగు వర్గాల యువతులు రాణి, దీపిక, హిమ, స్వప్న, ద్యుతీ అసాధారణ ఘనత కంటే కూతుర్నేకనాలంటున్న సామాన్యులు ఆడపిల్లలు కుటుంబానికి భారం అనుకొనే రోజులు పోయాయి. పుత్రరత్నాల కంటే కుమార్తెలే మేలనుకొనే రోజులు వచ్చాయి. జట్కావాలా, ఆటోవాలా, రిక్షావాలాల కుటుంబాలలో జన్మించిన ఆడపిల్లలు క్రీడారంగంలో అంతర్జాతీయ ఖ్యాతి తెస్తూ, బంగారు తల్లులుగా గుర్తింపు నిలుస్తున్నారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు. భారత హాకీ మహిళా కెప్టెన్ రాణి రాంపాల్, మహిళల […]

జట్కావాలా, ఆటోవాలాల పుత్రికోత్సాహం
X
  • దేశానికే ఖ్యాతి తెస్తున్న అట్టడుగు వర్గాల యువతులు
  • రాణి, దీపిక, హిమ, స్వప్న, ద్యుతీ అసాధారణ ఘనత
  • కంటే కూతుర్నేకనాలంటున్న సామాన్యులు

ఆడపిల్లలు కుటుంబానికి భారం అనుకొనే రోజులు పోయాయి. పుత్రరత్నాల కంటే కుమార్తెలే మేలనుకొనే రోజులు వచ్చాయి. జట్కావాలా, ఆటోవాలా, రిక్షావాలాల కుటుంబాలలో జన్మించిన ఆడపిల్లలు క్రీడారంగంలో అంతర్జాతీయ ఖ్యాతి తెస్తూ, బంగారు తల్లులుగా గుర్తింపు నిలుస్తున్నారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు.

భారత హాకీ మహిళా కెప్టెన్ రాణి రాంపాల్, మహిళల విలువిద్యలో భారత నంబర్ వన్ దీపిక కుమారి, పరుగుల రాణులు హిమ దాస్, ద్యుతీ చంద్, బహుముఖ క్రీడాంశాలున్న హెప్టాథ్లాన్ లో భారత మెరుపుతీగ స్వప్నబర్మన్ వేర్వేరు క్రీడలకు చెందినా, దేశంలోని వేర్వేరు రాష్ట్ర్రాల నుంచి అంతర్జాతీయ క్రీడారంగంలోకి దూసుకొచ్చినా..ఈ ఐదుగురి మూలాలు, కష్టాలు మాత్రం ఒకేలా కనిపిస్తాయి.

జట్కావాలా కూతురు రాణి రాంపాల్

హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని జట్కావాలా కుటుంబం నుంచి భారత, ప్రపంచ మహిళా హాకీలోకి దూసుకొచ్చిన క్రీడాకారిణే 25 సంవత్సరాల రాణి రాంపాల్. తండ్రి జట్కాబండి నడిపి తెచ్చిన సంపాదనతోనే జీవించే ఐదుగురు పిల్లల నిరుపేద కుటుంబానకి చెందిన రాణి 13 సంవత్సరాల వయసులోనే హాకీ స్టిక్ చేతపట్టింది. 15 ఏళ్ల చిరుప్రాయంలోనే భారతజట్టులో సభ్యురాలిగా తొలి ప్రపంచకప్ లో పాల్గొంది.

2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ కు భారతజట్టు అర్హత సాధించడంలో ప్రధానపాత్ర వహించిన రాణికి 2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయిలో నిర్వహించిన.. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నిర్వహించిన ఆన్ లైన్ పోలింగ్ లో లక్షా 99వేల 477 ఓట్లు పోలయ్యాయి.మరో 24 మంది క్రీడాకారులతో ఈ అవార్డు కోసం రాణి రాంపాల్ పోటీపడింది. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఈ ఆన్ లైన్ పోలింగ్ లో పాల్గొన్నారు. చివరకు 25 సంవత్సరాల రాణి రాంపాల్ నే అరుదైన ఈ పురస్కారం వరించింది.

2016 లో అర్జున పురస్కారం అందుకొన్న రాణి నాయకత్వంలోనే భారతజట్టు 2018 ఆసియాక్రీడల హాకీలో రజత పతకం అందుకొంది. భారతజట్టు తరపున 240 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన రాణి రాంపాల్ కు 130కి పైగా గోల్స్ సాధించిన రికార్డు సైతం ఉంది.

ఆటోవాలా కుమార్తె దీపిక కుమారి..

జార్ఖండ్ రాష్ట్ర్రంలోని ఓ ఆటో డ్రైవర్ కుటుంబం నుంచి భారత విలువిద్య క్రీడలోకి చొచ్చుకు వచ్చిన బంగారు బాణమే దీపిక కుమారి. ఒకదశలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ప్రపంచకప్ లో బంగారు పతకంతో పాటు…కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలు సాధించిన దీపిక…2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి సైతం అర్హత సంపాదించింది.

ఇప్పటికే అర్జున పురస్కారం సాధించిన దీపిక జాతీయస్థాయిలో నంబర్ వన్ ఆర్చర్ గా తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తోంది.

ప్రపంచ, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్ లో భారత ఆశాకిరణం దీపికకుమారి మాత్రమే. ఆటోడ్రైవర్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషించిన నాన్న స్ఫూర్తితోనే తాను ఈస్థాయికి చేరుకోగలిగానని దీపిక పొంగిపోతోంది.

రిక్షావాలా బిడ్డ స్వప్న బర్మన్…

ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ లో భారత్ కు బంగారు పతకం సాధించిన ఆల్ రౌండ్ అథ్లెట్ స్వప్న బర్మన్…పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్పాయి గురి నుంచి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లోకి ప్రవేశించింది. పరుగు, జంప్, త్రో లాంటి ఏడు అంశాల సమాహారమే హెప్టాథ్లాన్. బహుముఖ క్రీడాంశాలున్న హెప్టాథ్లాన్ లో భారత్ కు ఆసియా క్రీడల్లో బంగారు పతకం అందించిన తొలి మహిళ స్వప్న బర్మన్. స్వప్న తండ్రి రిక్షావాలా కాగా…తల్లి టీ -ఎస్టేట్ లో కార్మికురాలిగా పనిచేస్తోంది.

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చిన స్వప్న…అంతర్జాతీయ అథ్లెట్ గా ఎదగటానికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా తన కుటుంబానికి, దేశానికే స్వప్న గర్వకారణం కాగలిగింది.

నేతన్న కుమార్తె ద్యుతీ చంద్….

ఒరిస్సాలోని ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన ద్యుతీ చంద్…భారత మహిళా అథ్లెటిక్స్ 100, 200 మీటర్ల పరుగులో నంబర్ వన్ రన్నర్ గా గుర్తింపు తెచ్చుకొంది.

పలు అంతర్జాతీయ పోటీలతో పాటు జకార్తా ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది. పేదరికంతో పాటు..పలు రకాల సమస్యలు, అవాంతరాలను అధిగమించిన ద్యుతీ…తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మాత్రమే కాదు…తన రాష్ట్ర్రానికి, దేశానికే వన్నె తెచ్చింది.

అసోం ఎక్స్ ప్రెస్ హిమా దాస్….

ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత మెరుపుతీగ హిమ దాస్…అసోంలోని ఓ నిరుపేద కుటుంబం నుంచి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ 400 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించిన భారత తొలి రన్నర్ గా చరిత్ర సృష్టించింది.

జకార్తా ఆసియా క్రీడల రిలే అంశాలలో రెండు బంగారు పతకాలు, మహిళల 400 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన ఘనత హిమదాస్ కు మాత్రమే దక్కుతుంది. మహిళల 400 మీటర్ల రిలే, మిక్సిడ్ రిలే అంశాలలో బంగారు పతకాలు సాధించిన హిమాదాస్ పలు అంతర్జాతీయ టోర్నీలలో సైతం స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా అసోం ఎక్స్ ప్రేస్ గా గుర్తింపు తెచ్చుకొంది. అసోంలో ముగిసిన ఖేలో ఇండియా గేమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన హిమ దాస్
భారత నవతరానికే ప్రతీకగా నిలిచింది.

నిరుపేద కుటుంబాల నుంచి అంతర్జాతీయస్థాయిలో రాణించి…దేశానికే గర్వకారణంగా నిలిచిన రాణి రాంపాల్, దీపిక కుమారి, స్వప్న బర్మన్, ద్యుతీ చంద్, హిమ దాస్ లాంటి కుమార్తెలను చూస్తే…కంటే కూతుర్నే కనాలని అనుకోక తప్పదు కాక తప్పదు.

First Published:  2 Feb 2020 12:05 AM GMT
Next Story