Telugu Global
NEWS

వంద దాటి వడివడిగా... విపక్షానికి అవకాశమే లేకుండా...!

తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఏక రూప చిత్రంలా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి చూసి.. ఈ మాట అనాల్సి వస్తోంది. 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. ఏకంగా 110 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ ఖాతాలో పడడం.. ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని తేల్చి చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ రాకపోయినా.. ఎక్స్ అఫిషియో ఓట్ల సాయంతో మరిన్ని స్థానాలు సొంతం చేసుకుంది. కార్పొరేషన్ల విషయానికి వస్తే.. అక్కడ కూడా అధికార పార్టీకి తమ బలం, […]

వంద దాటి వడివడిగా... విపక్షానికి అవకాశమే లేకుండా...!
X

తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఏక రూప చిత్రంలా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి చూసి.. ఈ మాట అనాల్సి వస్తోంది. 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. ఏకంగా 110 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ ఖాతాలో పడడం.. ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని తేల్చి చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ రాకపోయినా.. ఎక్స్ అఫిషియో ఓట్ల సాయంతో మరిన్ని స్థానాలు సొంతం చేసుకుంది.

కార్పొరేషన్ల విషయానికి వస్తే.. అక్కడ కూడా అధికార పార్టీకి తమ బలం, బలగం అండగా నిలిచి.. ఏకంగా 9 చోట్ల విజయం సాధించాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా కూడా.. కొన్ని చోట్ల మెజారిటీ రాని పరిస్థితుల్లో.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. కుర్చీని కైవసం చేసుకోలేకపోయాయి. ఈ విషయంపై.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.

ఈ విమర్శలను వేటినీ పట్టించుకోని టీఆర్ఎస్.. ప్రతి చోటా అధికారమే పరమావధిగా ప్రయత్నాలు చేసి విజయవంతం అయ్యింది. తెలంగాణలో తనకు పోటీ లేకుండా చూసుకుంది. ప్రతిపక్షాన్ని 10 మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితం చేసింది. అందుకే.. కేసీఆర్ కూడా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఓ మాట అన్నారు. ఇంతటి స్థాయిలో ఫలితాలు ఊహించలేదని. కానీ.. కాలం కలిసొచ్చి.. ప్రణాళిక ఫలించి.. టీఆర్ఎస్ ఇంతటి స్థాయి ఫలితాలు సాధించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక.. ప్రతిపక్షం విషయానికి వస్తే.. మరింతగా కాంగ్రెస్ పతనం కాగా.. ఇతర పార్టీలు నామమాత్రంగా స్థానాలు దక్కించుకున్నాయి. ఈ పరిణామం తెలంగాణ సమాజానికి మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రశ్నించే గొంతుకకు.. అధికార స్వామ్యంలో భాగస్వామ్యం లేకుంటే ఒక్క పార్టీదే పెత్తనంగా మారే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే.. జనం దృష్టిలో విపక్షాలు నమ్మకం పెంచుకోవాలని.. బలం పెంచుకోవాలని.. అప్పుడే టీఆర్ఎస్ కు దీటుగా కాకున్నా.. కనీసం ప్రజల గొంతుక వినిపించేందుకు అయినా వారికి చట్ట సభల్లో, స్థానిక సంస్థల్లో అవకాశం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ దూకుడు ముందు.. మిగతా పార్టీలు ఏం చేస్తాయో చూడాలి మరి.

First Published:  27 Jan 2020 11:49 PM GMT
Next Story