Telugu Global
NEWS

రెవెన్యూ అధికారులపై ఏసీబీ దాడులకు కారణం ఇదేనా?

శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల సందర్భంగా కొంత అనధికారిక డబ్బు పట్టుబడింది. భూముల పాస్‌పుస్తకాలు రైతులకు ఇవ్వకుండా నొక్కిపెట్టిన వైనం తెలిసింది. అలాగే అనేక ప్రజావిజ్ఞప్తులు పరిశీలించకుండానే పక్కన పడేసిన ఆధారాలు లభించాయి. ఇలా అనేక అవకతవకలకు సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికాయి. ఏసీబీ డీజీ పిఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాలమేరకు జరిగిన ఈ దాడుల తరువాత ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగాయి? అనే విషయం మీద చర్చ […]

రెవెన్యూ అధికారులపై ఏసీబీ దాడులకు కారణం ఇదేనా?
X

శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల సందర్భంగా కొంత అనధికారిక డబ్బు పట్టుబడింది. భూముల పాస్‌పుస్తకాలు రైతులకు ఇవ్వకుండా నొక్కిపెట్టిన వైనం తెలిసింది. అలాగే అనేక ప్రజావిజ్ఞప్తులు పరిశీలించకుండానే పక్కన పడేసిన ఆధారాలు లభించాయి.

ఇలా అనేక అవకతవకలకు సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికాయి. ఏసీబీ డీజీ పిఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాలమేరకు జరిగిన ఈ దాడుల తరువాత ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగాయి? అనే విషయం మీద చర్చ మొదలైంది. రెవెన్యూ శాఖ లో పేరుకుపోయిన భయంకరమైన అవినీతి ఒక ప్రధాన కారణమైతే… మరో ముఖ్యమైన కారణం భూసేకరణ పేరుతో రెవెన్యూ అధికారులు సాగిస్తున్న దందా.

ఈ దందా గురించి ప్రభుత్వం గుర్తించేలోగానే ఏసీబీ గుర్తించినట్లుగా తెలుస్తోంది.

నవరత్నాలలో భాగంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. వచ్చే ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ నిర్ణయమే కొందరు రెవెన్యూ అధికారుల పాలిట కల్పవృక్షమూ, కామధేనువు అయ్యాయి.

సాధారణంగా పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ భూములను అందుకు వినియోగిస్తారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే ప్రైవేట్‌ వ్యక్తుల భూములను సేకరించి వాళ్ళకు అక్కడున్న భూముల ధరలకు అనుగుణంగా రెండున్నర రెట్లు కాంపెన్సేషన్‌ ఇస్తారు. సాధారణంగా ఇలా సేకరించే భూములకు మార్కెట్‌ రేటుకన్నా ఎక్కువ ధర లభిస్తుంది. దాంతో ఆ భూ యజమానులు కూడా హ్యాపీ.

రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కూడా ఎస్సీజెడ్‌ ల కోసం భూ సేకరణ జరిగింది. రైతులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాంపెన్సేషన్‌ లభించింది. దాంతో భూములు కోల్పోయిన వారెవరూ బాధపడలేదు.

కానీ ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న వైఖరి వల్ల కొంతమంది రైతులు జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు. రెవెన్యూ అధికారులనైతే శాపనార్ధాలు పెడుతున్నారు. కారణం ఏమిటంటే సాధారణంగా భూ సేకరణ జరిగేటప్పుడు అంతగా ధరలేని భూములనే సేకరిస్తారు.

కానీ ఇప్పుడు కొన్ని జిల్లాలలో రెవెన్యూ అధికారులు అత్యంత ఖరీదైన భూములను కూడా భూ సేకరణ కింద తీసుకుంటున్నామని రైతులకు నోటీసులు జారీ చేశారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిద్దామని రోడ్డుపక్కనే ఎకరా 3 కోట్లకు కొన్న భూమిని కూడా భూ సేకరణ కింద తీసుకుంటున్నామని, దానికి 30 లక్షలు కాంపెన్సేషన్‌ రావచ్చని రెవెన్యూ అధికారులు చెప్పడంతో భూ యజమానులు గగ్గోలు పెడుతూ కోర్టులకు ఎక్కడానికి లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత ఖరీదైన భూములు సేకరించాల్సిన అవసరం ఏమిటో? ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందో…. ఈ అధికారులకు పట్టదు.

రెవెన్యూ అధికారులు కొన్నిచోట్ల ప్రభుత్వ భూములు పక్కనే ఉన్నా వాటిని వదిలేసి అసైన్డ్‌ భూములను సేకరిస్తున్నారు. ఇంకొంతమంది అధికారులు మరో అడుగు ముందుకేసి స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూములను, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను అసైన్డ్‌ భూములకింద జమకట్టి భూ సేకరణ నోటీసులు అందజేస్తున్నారు.

నిజానికి స్వాతంత్ర్య సమరయోధులకు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్ళ తరువాత వాళ్లు అమ్ముకోవచ్చు. కానీ 50-60 ఏళ్ళ క్రితం ఇచ్చిన భూములను కూడా, అనేక చేతులు మారిన ఆ భూములను కూడా ఇప్పుడు రెవెన్యూ అధికారులు సేకరించే పనిలో పడ్డారు.

భూ సేకరణ లిస్టులోంచి మీ భూములను తప్పిస్తామంటూ బేరాలు పెట్టే బ్రోకర్లు కూడా కొన్ని రెవెన్యూ కార్యాలయాల్లో తిస్టవేసుకుని కూర్చున్నారు.

రైతుల భూమి రైతుల దగ్గరే ఉండిపోవాలంటే పెద్ద మొత్తంలో రెవెన్యూ అధికారులకు సమర్పించుకోవాల్సిన దుస్థితి. మరీ ముఖ్యంగా ఈ భూసేకరణ విషయంలో జిల్లా కలెక్టర్లు స్ట్రిక్ట్‌గా ఉంటే కిందిస్థాయి అధికారులకు మరింత ఎక్కువ పంట పండుతుంది. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టర్‌ భూసేకరణ విషయంలో లక్ష్యాలు సాధించాలని ఎక్కువ ఒత్తిడి చేసేకొద్దీ కింది స్థాయిలో అధికారుల పంట పండుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మొత్తంలో భూములకు నోటీసులు ఇవ్వడం…. మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది… రాకుండా ఉండాలంటే… అమ్యామ్యా… అంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు.

బహుశా ఈ విషయాలన్నీ ఏసీబీ డీజీ దృష్టికి వెళ్ళినట్లు ఉన్నాయి. అందుకే రెవెన్యూ ఆఫీసులపై నిన్న దాడులు జరిగాయని కొందరు భావిస్తున్నారు.

First Published:  25 Jan 2020 12:44 AM GMT
Next Story