Telugu Global
Others

పేరుకే పరిమితమైన గణతంత్రం

దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. జనావళిలో ఎక్కువ భాగం, ప్రధానంగా అణగారిన వర్గాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ దుస్థితి యుద్ధంలాంటివాటివల్ల తలెత్తలేదు. మన దేశాన్ని ఎవరూ చుట్టుముట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఈ విపత్కర పరిస్థితికి కారణం. నింగిలోని చందమామను నేలమీదకు దింపి చేతిలో పెడతామని వాగ్దానం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అన్నింటికన్నా మించి “అత్యధిక పాలన, అతి తక్కువ ప్రభుత్వం ఉంటుంది” అని హామీ […]

పేరుకే పరిమితమైన గణతంత్రం
X

దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. జనావళిలో ఎక్కువ భాగం, ప్రధానంగా అణగారిన వర్గాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ దుస్థితి యుద్ధంలాంటివాటివల్ల తలెత్తలేదు. మన దేశాన్ని ఎవరూ చుట్టుముట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఈ విపత్కర పరిస్థితికి కారణం.

నింగిలోని చందమామను నేలమీదకు దింపి చేతిలో పెడతామని వాగ్దానం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అన్నింటికన్నా మించి “అత్యధిక పాలన, అతి తక్కువ ప్రభుత్వం ఉంటుంది” అని హామీ ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే దాపరికం లేని తత్వం గల దేశాల జాబితాలో మనం కింది స్థాయిలో ఉన్నాం. అత్యధిక సంఖ్యాక ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను పట్టించుకునే నాథుడే లేడు. వీరి గురించి ప్రస్తావించే వారే కనిపించడం లేదు. మీడియా మీద ప్రభుత్వ నియంత్రణ విపరీతంగా ఉన్నందువల్ల అవి ప్రభుత్వ ప్రచార బాకాలుగా దిగజారిపోయాయి. సామాజిక మాధ్యమాలలో అభిప్రాయ వ్యక్తీకరణపై కనిపించని కత్తెరలు పడ్తున్నాయి. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అని రాజ్యాంగ పీఠికలో గొప్పగా చెప్పుకున్న ఉదాత్త ఆశయాలు కనిపించకుండా పోయాయి.

ప్రతి పౌరుడికీ ఆలోచించే స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, మత విశ్వాసల స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ కల్పిస్తామని రాజ్యాంగ పీఠికలో చెప్పుకున్నాం. గత రెండు మూడేళ్ల వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ ఉదాత్త ఆశయాలన్నింటినీ అటకెక్కించేశాం. మతాల వారీగా జన సమీకరణ నిరాఘాటంగా కొనసాగుతోంది. మైనారిటీ మతాల వారిని, ముఖ్యంగా ముస్లింలను పనిగట్టుకుని వేధిస్తున్నారు. అధికార పక్షానికి నచ్చని ఆలోచనలను, భావాలను ద్వేషిస్తున్నారు. సమాజంలో విద్వేషం పడగ విప్పుతోంది. ప్రసిద్ధులైన మేధావులను కొందరిని హతమార్చారు.

సమాజ పరిరక్షకులమని చెప్పుకునే వారు తాము నమ్మే నైతిక విలువలను బలవంతంగా జనం మీద రుద్దుతున్నారు. మహిళలను వేధిస్తున్నారు. గో సంరక్షణ పేరిట పరిరక్షకుల అవతారమెత్తిన అల్లరి మూకలు దళితులను, ముస్లింలను హతమారుస్తున్నారు. జాతీయవాదం అన్న మహత్తర భావన స్థానంలో హిందుత్వ జాతీయతా వాదాన్ని జనంపై రుద్దుతున్నారు. హిందుత్వ ఎజెండాకు అనువుగా విద్యా వ్యవస్థను విరూపం చేస్తున్నారు. సెక్యులర్ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతానికి అనుగుణంగా హిందూ రాష్ట్రంగా మార్చేస్తున్నారు.

కులం, మతం, స్త్రీలు-పురుషులు అన్న భేదం లేకుండా అందరి స్థాయీ ఒకటే ఉంటుందని, అందరికీ సమానావకాశలు ఉంటాయని రాజ్యాంగ పీఠిక పూచీ పడుతున్నా మహిళల మీద అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దళితులదీ అదే పరిస్థితి. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. గిరిజనుల హక్కులను యదేచ్ఛగా కాల రాస్తున్నారు. సమానత్వం అన్న లక్ష్యాన్ని అందనంత దూరానికి విసిరేశాం. వ్యక్తి గౌరవం ఎందుకూ కొరగానిదైపోయింది. మనమే రూపొందించుకున్న “భారతీయులమైన మనం” అని ప్రారంభమయ్యే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ఈ విపరీత ధోరణులను తిరస్కరించాలి. మన గణతంత్రానికి విఘాతం కలిగించే ధోరణులను ఓడించి తీరాలి.

ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మన స్వాతంత్ర్యానికి, సార్వభౌమాధికారానికి ముప్పు ఏర్పడుతోంది. అంతర్జాతీయ రంగంలో మనం స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాం. భారత్ అమెరికాకు తోకలా మారిపోయింది. లాభాపేక్ష తప్ప మరో ధ్యాస లేని పెట్టుబడిదారులకు ఊడిగం చేసే స్థితికి దిగజారాం.

నల్ల ధనాన్ని, అవినీతిని రూపుమాపడానికి, నకిలీ నోట్ల బెడద అధిగమించడానికి, తీవ్రవాదులకు నిధులందకుండా చేయడానికే పెద్ద నోట్ల రద్దు అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాట నిఖార్సైన అసత్యంగా మిగిలిపోయింది. 90శాతం నల్ల ధనం పన్నులు ఎగవేయడానికి అనువైన ఇతర దేశాలలోనే దాచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ప్రతి రూపాయి వెనక్కు తెస్తామని ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ మాటలు శుష్క వాగ్దానమేనని తేలిపోయింది. పెద్ద నోట్ల రద్దు అటు నల్ల ధనాన్నీ అరికట్టలేదు, ఇటు అవినీతికీ కళ్లెం వేయలేదు. పైగా అవినీతి కొత్త వేషధారణతో ముందుకొస్తోంది. ఉన్నత స్థాయిలో అవినీతి అంతకంతకూ పెరిగిపోతోంది.

పెద్ద నోట్ల రద్దు తీవ్రవాదులకు నిధులు అందకుండా చూడడంలో వీసమెత్తు ఫలితమైనా సాధించలేదు. తీవ్రవాదుల చేతిలో భద్రతా దళాల వారు బలవుతూనే ఉన్నరు. తీవ్రవాదుల చేతిలో మరణించిన భద్రతా దళాల సంఖ్య 2015 తో పోలిస్తే 2016లో రెట్టింపు అయింది. రాజ్యాంగం, గణతంత్రం ఘనత గురించి ఊకదంపుడు ఉపన్యాసాలకు కొదవే లేదు. ఆచరణ మాత్రం పూజ్యం.

First Published:  23 Jan 2020 5:23 AM GMT
Next Story