Telugu Global
NEWS

పవన్‌కు రాపాక రంపం కోత

పవన్‌ కల్యాణ్‌కు ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పెద్ద సవాల్‌గా మారారు. జగన్‌ను ప్రతి అంశంలోనూ పవన్ వ్యతిరేకిస్తుంటే… రాపాక మాత్రం ప్రతి అంశంలోనూ జగన్ సూపర్ అంటూ జనసేనకు చుక్కలు చూపిస్తున్నారు. అసెంబ్లీలో తాను జనసేన పార్టీకి ఏ టూ జెడ్‌ కావడంతో రాపాక చెప్పిందే అధికారిక రికార్డుల్లోకి వెళ్తోంది. పవన్ బయట అరిచి గీ పెడుతున్నా… అసెంబ్లీలో మాత్రం రాపాక సింపుల్‌గా జగన్‌ మీరు సూపర్ అనేస్తున్నారు. కానీ అందరి తీలు తీస్తా అనే […]

పవన్‌కు రాపాక రంపం కోత
X

పవన్‌ కల్యాణ్‌కు ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పెద్ద సవాల్‌గా మారారు. జగన్‌ను ప్రతి అంశంలోనూ పవన్ వ్యతిరేకిస్తుంటే… రాపాక మాత్రం ప్రతి అంశంలోనూ జగన్ సూపర్ అంటూ జనసేనకు చుక్కలు చూపిస్తున్నారు.

అసెంబ్లీలో తాను జనసేన పార్టీకి ఏ టూ జెడ్‌ కావడంతో రాపాక చెప్పిందే అధికారిక రికార్డుల్లోకి వెళ్తోంది. పవన్ బయట అరిచి గీ పెడుతున్నా… అసెంబ్లీలో మాత్రం రాపాక సింపుల్‌గా జగన్‌ మీరు సూపర్ అనేస్తున్నారు. కానీ అందరి తీలు తీస్తా అనే చెప్పే పవన్ కల్యాణ్‌… రాపాకను మాత్రం ఏమీ చేయలేని స్థితి.

పవన్‌ కల్యాణ్‌తో, జనసేనతో వచ్చే లాభం లేదు… పోయే భవిష్యత్తు లేదన్న నిర్ధారణకు వచ్చిన తర్వాతే రాపాక ఇలా సొంత నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని భావిస్తున్నారు. పైగా జగన్‌తో ఎలాగో పాత పరిచయం ఉందాయే.

2009లో వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్… ఆయన మరణం తర్వాత జగన్‌కు జై కొట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా… జిల్లాలో జగన్‌ ఓదార్పు యాత్రకు దగ్గరుండి ఏర్పాట్లు చేశారాయన. ఓదార్పు యాత్రకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరుకాకూడదని నాడు రోశయ్య హెచ్చరించినా రాపాక మాత్రం ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గంలో వైఎస్‌ విగ్రహాలన్నీ వరప్రసాద్‌ ఏర్పాటు చేసినవే.

ఉప ఎన్నికల్లో డబ్బు ఖర్చుకు భయపడే నాడు తాను జగన్‌ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేకపోయానని చెబుతుంటారు రాపాక. అలా కొన్ని కారణాల వల్ల జగన్‌కు అప్పట్లో ఆయన దూరమైనా… జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రితో సన్నిహితంగానే ఉండగలుగుతున్నారు.

జగన్‌ కూడా రాపాక పట్ల సానుకూలంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేగా రాపాకను చూసిన ప్రతిసారి తాను రెండు చోట్ల ఓడియానన్న విషయం పవన్‌కు గుర్తుకు వస్తుందంటుందని భావిస్తున్నారు. అందుకే రాపాకకు పార్టీలో మర్యాదల విషయంలోనూ లోటు ఏర్పడింది. నాదెండ్ల మనోహర్ లాంటి వారు కూడా రాపాకపై జులుం ప్రదర్శిస్తున్నారు.

ఇవన్నీ చూసిన తర్వాతే రాపాక జనసేనకు మానసికంగా దూరమైనట్టు భావిస్తున్నారు. మూడు రాజధానులపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ రాపాక వరప్రసాద్‌ సొంత నిర్ణయానికే కట్టుబడడం ఖాయంగా కనిపిస్తుంది. జనసేన అధినేత వ్యతిరేకించినా రాపాక వరప్రసాద్ మాత్రం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. అలా చేసినా వరప్రసాద్‌పై జనసేన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.

ఇప్పటికే ఇంగ్లీష్‌పైనా పార్టీ లైన్‌కు విరుద్ధంగానే వరప్రసాద్ వ్యవహరించారు. రాజధానుల అంశంలోనూ పార్టీ లైన్‌ను వరప్రసాద్ ధిక్కరించేందుకు సిద్ధమయ్యారన్నది ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా తెలిసిపోతోంది.

ఒకవేళ వరప్రసాద్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేయడం లాంటిది చేస్తే అది ఆయనకే లాభించవచ్చు. వల్లభనేని వంశీ తరహాలోనే స్పీకర్ నుంచి అనుమతి తీసుకుని తటస్థ సభ్యుడిగా ఉండవచ్చు. పవన్ కల్యాణ్ బయట ప్రభుత్వంతో ఎంత గట్టిగా పోరాటం చేసినా… అసెంబ్లీలో మాత్రం జనసేన వాదన రాపాక వరప్రసాద్‌ రూపంలో బలహీనపడడం మాత్రం ఖాయం.

First Published:  6 Jan 2020 12:43 AM GMT
Next Story