Telugu Global
Others

నిరసనకు హింస రంగు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ.) అమలును వ్యతిరేకిస్తూ సాగుతున్న నిరసనలు హింస స్వభావాన్ని చర్చనీయాంశం చేశాయి. ఈ సందర్భంగా కొన్ని అంశాలను నిశితంగా పరిశీలించవలసి ఉంది. శాంతికి ఉన్న సామాజిక ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడంకోసం ప్రభుత్వం హింసను ఖండిస్తోంది. హింస అక్రమమైందని అంటోంది. అంటే హింస అన్ని సందర్భాలలో విసర్జించదగిందని దాన్ని పూర్తిగా విడనాడాలని చెప్తోంది. ఏ నిరసన అయినా సంపూర్ణంగా శాంతియుతంగా కొనసాగాలన్న దృష్టితో చూస్తే ప్రభుత్వ వాదన సబబైందిగానే కనిపిస్తుంది. […]

నిరసనకు హింస రంగు
X

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ.) అమలును వ్యతిరేకిస్తూ సాగుతున్న నిరసనలు హింస స్వభావాన్ని చర్చనీయాంశం చేశాయి. ఈ సందర్భంగా కొన్ని అంశాలను నిశితంగా పరిశీలించవలసి ఉంది. శాంతికి ఉన్న సామాజిక ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడంకోసం ప్రభుత్వం హింసను ఖండిస్తోంది. హింస అక్రమమైందని అంటోంది. అంటే హింస అన్ని సందర్భాలలో విసర్జించదగిందని దాన్ని పూర్తిగా విడనాడాలని చెప్తోంది.

ఏ నిరసన అయినా సంపూర్ణంగా శాంతియుతంగా కొనసాగాలన్న దృష్టితో చూస్తే ప్రభుత్వ వాదన సబబైందిగానే కనిపిస్తుంది. అయితే దాదాపుగా శాంతియుతంగా కొనసాగిన నిరసనను హింసాత్మకంగా వర్ణించడం సముచితం కాదు.

ఈ నిరసనలకు కొన్ని నిర్దిష్ట అంశాలున్నాయి. వాస్తవం, ఇచ్చిన హామీలు నెరవేరక పోవడంవల్లే నిరసనలు పెల్లుబికాయి. ఆ హామీలు వాగ్దానాలు ఏమిటి? ఆందోళన, అనిశ్చితి, అభద్రత ఎందుకు అలుముకున్నాయి? వాస్తవం ఏమిటంటే పోలీసులు విద్యార్థుల విషయంలో అత్యంత కర్కషంగా వ్యవహరించారు. సానుకూలంగా ఈ చట్టాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం చేసిన వాగ్దానాల మాటేమిటి? అసలు ప్రభుత్వం చేయాల్సిన వాగ్దానాలేమిటి? ప్రభుత్వం బహుళత్వాన్ని, సుస్థిరతను పరిరక్షించి ప్రజలకు విశ్వాసం కల్పించాలి కదా? ఈ చట్టాన్ని రాజ్యాంగ మౌలిక సూత్రాల గీటు రాయి ఆధారంగా పరిశీలించాలి. పార్లమెంటు ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమైందేనా అని ఆలోచించాలి. ఈ చట్టం బహుళత్వాన్ని, సెక్యులరిజాన్ని దెబ్బ తీస్తోందన్న ఆందోళనతోనే నిరసనలు వ్యక్తమైనాయి.

ప్రస్తుత సందర్భంలో హింసను వక్రీకరించి చూస్తున్నారు. హింస చరిత్ర ఏమిటో కూడా పరిశీలించాలి. దళితుల మీద మూక దాడులు, సామాజికంగా వారిని వెలివేయడం, మహిళల మీద దాడులు, రైతుల ఆత్మ హత్యలు, అభివృద్ధి పేరిట ఆదివాసులను నిర్వాసితులను చేయడం, దుర్భర జీవన పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాలలో ప్రజల దుస్థితి, పట్టణ ప్రాంతంలో పేదల దయనీయమైన పరిస్థితి మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని హింసను గమనించకపోతే అసలు దృశ్యం కనిపించదు. నాణ్యమైన జీవనం అసాధ్యమైనప్పుడు ప్రజలు తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది. ఇలాంటి భిన్న రకాల హింసాకాండకు వ్యతిరేకంగానే ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.

ఇటీవలి కాలంలో సామాజిక సంబంధాలలో హింసను నిరంతరం ప్రేరేపిస్తున్నారు. పైగా ప్రజల నిరసనను వ్యతిరేకించే మిషతో హింసను రెచ్చగొడ్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల నిరసనకు హింసాత్మక పద్ధతుల్లో జవాబు చెప్తున్నారు. హింస కేవలం నిరసనకారులకే పరిమితం అవుతుందని భావించడం ఉచితమైన వాదన కాదు. పౌరులకు భద్రత కొరవడడం, నిరుద్యోగం, అసమానతలు, అన్యాయాలు పెరిగిపోయినప్పుడు నిరసన పెల్లుబుకక తప్పదు.

మితవాద రాజకీయాలను సమర్థించే వారు నిరసనల్లోనే కాక మొత్తం సామాజిక సంబంధాలలో హింసను ప్రేరేపిస్తున్నారు. బూటకపు వార్తలు ప్రచారంలో పెట్టడం, కుట్ర చేస్తున్నారన్న ప్రచారం చేయడం, మతోన్మాదానికి ఊతమిస్తున్న సామాజిక మాధ్యమాలు పెచ్చరిల్లడంతో నిరసనలకు వక్ర భాష్యం చెప్తూ హింస చెలరేగుతోందని ప్రచారం చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో మతోన్మాద దృక్కోణంతో జరుగుతున్న విష ప్రచారం విద్వేషాన్ని నింపుతోంది. మితవాద రాజకీయ పార్టీలు బూటకపు వార్తలకు ప్రచారం కల్పిస్తున్నాయి. ఈ వికృత ప్రచారంలో చిక్కుకున్న వారు తాము ఒక నిర్దిష్ట మతం వారిని ద్వేషించాలని భావిస్తున్నారు.

ఇలాంటి వారు మానవతావాద దృష్టి ప్రదర్శించే వారిని తూలనాడుతున్నారు. సామాజిక సంబంధాలను పటిష్ఠం చేయాలన్న ఆలోచన లేని వారు, నైతిక ప్రమాణాలను పట్టించుకోని వారు బూటకపు వార్తలను సులభంగా నమ్ముతారు. వెలుపలి నుంచి హింసను ప్రవేశ పెట్టడంవల్ల కలిగే పరిణామాలు ఏమిటి? సమాజంలోని వివిధ వర్గాల వారి మధ్య వైషమ్యాలు పెరుగుతాయి. సామాజిక సంబంధాలకు విఘాతం కల్గినందువల్ల జనంలో అభద్రతాభావం, నిఘా పెరిగిపోతుంది. బూటకపు ప్రచారాలకు సునాయాసంగా బలవుతారు.

అయితే ఇలాంటి బూటకపు వార్తల విష వలయం నుంచి ప్రజలను రక్షించడం ఎలా అన్నది పెద్ద ప్రశ్న. నైతికత ఆధారంగా నిర్ణయానికి రావడంవల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండవచ్చు. సమష్టి శ్రేయస్సు గురించి ఆలోచించి, శాంతి సామరస్యాలు కొనసాగాలన్న భావనను పెంపొందించుకుంటే బూటకపు ప్రచారాన్ని నమ్మకుండా ఉండడం సాధ్యం అవుతుంది. ప్రజలలో ఈ లక్షణం కొరవడినంత కాలం నిరసనకు హింస రంగు పులుముతూనే ఉంటారు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Next Story