Telugu Global
Others

వ్యాపారం ముఖ్యం-ప్రాణం తృణప్రాయం

భారత నగరాలలో అనేక ఘోర అగ్ని ప్రమాదాలు జరిగాయి. సురక్షితంగా ఉంటాయని, శ్రద్ధగా చూస్తారని అనుకున్న ఆసుపత్రుల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి. తళుకుబెళుకులతో కూడిన రెస్టారెంట్లు, పబ్బులు, చిన్న హోటళ్లు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదాల్లో మనుషులు బుగ్గి అయ్యారు. ఆస్తులు దహించుకుపోయాయి. అయినా నగరాలు విస్తరించాలని వాదించే వారు భద్రత, పర్యావరణాన్ని, చట్టాలను ఖాతరు చేయడం లేదు. “సులభంగా వ్యాపారం చేసుకోవడం” అన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. పరిస్థితి ఎలా ఉన్నా […]

వ్యాపారం ముఖ్యం-ప్రాణం తృణప్రాయం
X

భారత నగరాలలో అనేక ఘోర అగ్ని ప్రమాదాలు జరిగాయి. సురక్షితంగా ఉంటాయని, శ్రద్ధగా చూస్తారని అనుకున్న ఆసుపత్రుల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి. తళుకుబెళుకులతో కూడిన రెస్టారెంట్లు, పబ్బులు, చిన్న హోటళ్లు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదాల్లో మనుషులు బుగ్గి అయ్యారు. ఆస్తులు దహించుకుపోయాయి. అయినా నగరాలు విస్తరించాలని వాదించే వారు భద్రత, పర్యావరణాన్ని, చట్టాలను ఖాతరు చేయడం లేదు.

“సులభంగా వ్యాపారం చేసుకోవడం” అన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. పరిస్థితి ఎలా ఉన్నా తమ ఉద్యోగం ఊడనందుకు జనం సంతృప్తి పడవలసి వస్తోంది. పరిశ్రమలు, వ్యవస్థల యజమానులు కార్మిక చట్టాలకు కట్టుబడి ఉండే స్థితే లేదు. ఎందుకంటే చట్టాలు అమలు చేస్తే పోయేది కార్మికుల ఉద్యోగాలే.

వైపరీత్యం ఏమిటంటే అత్యంత అననుకూల పరిస్థితుల్లో కూడా శ్రమజీవులు పట్టణాల్లో, నగరాల్లో నివసించగలుగుతున్నారని, పని చేస్తున్నారని, ప్రయాణిస్తున్నారని ప్రశంసల జల్లు కురిపిస్తుంటారు. దిల్లీ, ముంబై లాంటి నగరాలు సచేతనంగా ఉన్నందువల్లే శ్రమజీవులు తమ లాఘవం ప్రదర్శించగలుగుతున్నారని అంటారు. ఇది భయంకరమైన ఆలోచన.

2019 డిసెంబర్ 8వ తేదీన దిల్లీలోని అనాజ్ మండీలో అగ్నిప్రమాదంలో 43 మంది కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్నది సచేతనమైన నగరాల పుణ్యంగానేనా లేదా వారికి ఉపాధి కల్పిస్తున్నందువల్లేనా? అసలు ప్రశ్న ఏమిటంటే ఈ పేద కార్మికులకు దివారాత్రాలు సురక్షితం కాని ప్రదేశాల్లో పని చేయడం మినహా గత్యంతరం ఏమైనా ఉందా? ఇలాంటి కార్మికులు పొట్ట చేత పట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన వారే. తమకు రక్షణ ఉండదని, మౌలిక సదుపాయాలు కూడా ఉండవని తెలిసినా బతుకుదెరువుకోసం పని చేయక తప్పని వారే. దిల్లీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్, బిహార్ నుంచి వలస వచ్చిన వారే. మరణించిన 43 మంది కార్మికులు పరిశ్రమలో పని చేస్తూ సంచులు, టోపీలు, దుస్తులు తయారు చేసే వారు. ఈ పరిశ్రమ దేశ రాజధానికోని ఇరుకు సందుల్లో ఉంది.

దేశంలోని పట్టణ ప్రాంతాలలో పేద కార్మికులకు ఉండే పని చేసే తత్వం, లాఘవానికి అనేక అర్థాలు ఉన్నాయి. వారు పని చేసే చోట్లు వాణిజ్య సముదాయాలు. అయితే అవి సురక్షితం కాని, ప్రమాదకరమైన భవనాల్లో ఉంటాయి. ఉపాధి పోతుందన్న భయంతో వారు ఎక్కువ గంటలు పని చేయవలసి వస్తుంది. దీనికి తోడు అధికార యంత్రాంగం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తుంది. నియమాలను, పర్యావరణ నిబంధనలను పాటించరు. అగ్ని ప్రమాదం జరిగిన పరిశ్రమ యజమాని, మేనేజర్ ఏ నిబంధననూ పాటించలేదు. కార్మికుల, ముఖ్యంగా వలస కార్మికుల ప్రాణం తృణప్రాయమైంది. చట్టాలు పిచ్చుక గూళ్లలా గజిబిజిగా ఉంటాయి. చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఈ నిబంధనలను పాటించలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తారు. “పరిఢవిల్లుతున్న” నగరాల్లో ఆదాయ సముపార్జనకు, నిబంధనలు ఉల్లంఘించడానికి ఏ మాత్రం పొంతన ఉండదు.

అనాజ్ మండీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి. సత్వర, పరివ్యాప్త పట్టణీకరణకు మూల్యం చెల్లించేది చివరకు కార్మికులే. నగరాల రాజకీయ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం వీరే. వీరు తక్కువ వేతనానికి పని చేయడంవల్ల ఆ పరిశ్రమల యజమానులకు ఖర్చులు తగ్గుతాయి. నిజానికి ఇలాంటి కుటీర పరిశ్రమలు నివాస ప్రాంతాలలోనే ఉండాలి. కానీ అధికారులు పట్టించుకోనందువల్ల చట్టాలు కాగితాలకే పరిమితం అవుతాయి. మరీ విచిత్రం ఏమిటంటే అనాజ్ మండీలోని ఈ పరిశ్రమ “చట్ట విరుద్ధం” అయిందైనందువల్ల అధికారులు తనిఖీలు చేయలేక పోయారని మీడియాలో రావడం. నమోదైన పరిశ్రమలను మాత్రమే తాము తనిఖీ చేయగలుగుతామని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు.

అనాజ్ మండీ భవనం ఆవాస ప్రాంతం మధ్యలో ఉంది. అక్కడ ఉన్న స్థలాన్ని బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశం ఊందని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ పరిశ్రమకు కింది అంతస్తులో మాత్రమే అనుమతి ఉంది. కానీ వాస్తవానికి ఈ భవనం మొత్తాన్ని వాణిజ్య ప్రయోజనాలకే వినియోగించుకుంటున్నారు. ఈ పరిశ్రమకు ఏ లైసెన్సూ లేదు. మునిసిపాలిటీ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అనుమతి లేదు. అగ్నిమాపక దళం నుంచి నిరభ్యంతర పత్రం కూడా లేదు. ఆ భవన నిర్మాణానికి స్థానిక సంస్థ నుంచి అనుమతి కూడా లేదు. అక్కడ దగ్ధం కావడానికి ఆస్కారం ఉన్న కాగితాలు, ప్లాస్టిక్, రెగ్జిన్ మొదలైన పదార్థాలన్నీ ఉన్నాయి. కార్మికులు పని చేసే, నిద్రపోయే చోట్ల కూడా ఈ సామాగ్రి అంతా నిలవచేసి ఉంది.

డిసెంబర్ 8న అగ్ని ప్రమాదం జరగగానే రాజకీయ పార్టీలు పోటీలు పడి పరిహారం ప్రకటించాయి. పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. భారీ ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఇదే ధోరణి వ్యక్తం అవుతుంది. ఇదే రాజకీయ పార్టీలు మురికి వాడలను, అనుమతులు లేని భవనాలను క్రమబద్ధీకరించాలని కోరతాయి. ఈ కోర్కెలు ఎన్నికల సమయంలో గట్టిగా వినిపిస్తుంటాయి. మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించడానికి ఏ పార్టీ శ్రద్ధ తీసుకోదు. అగ్నిమాపక యంత్రాలు, వాహనాలు, పరికరాలు అందుబాటులో ఉండవు.

అనాజ్ మండీ ప్రమాదానికి గురైన కార్మికులకు న్యాయం జరగాలని కోరే తీరిక మీడియాకు గానీ, పౌరసమాజానికిగానీ ఉండదు. దిల్లీలోని ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాద బాధితులు సుదీర్ఘ కాలంపాటు న్యాయ పోరాటం చేయవలసి వచ్చింది. చివరకు వారి ఓర్మి అపహాస్యం పాలు కావడం తప్ప ఒరిగిందేమీ లేదు. అనాజ్ మండి అగ్ని ప్రమాద బాధితుల వ్యవహారాన్ని కొద్ది రోజులు గడిస్తే అందరూ మర్చి పోతారు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Next Story