Telugu Global
NEWS

రాజధానిపై సొంత సామాజికవర్గం వారితో బాబు ఒప్పందం చేసుకున్నారు...

మూడు ప్రాంతాల్లో మూడు రాజ్యాంగ వ్యవస్థలను పెట్టాలనుకోవడం మంచి నిర్ణయమన్నారు ఉత్తరాంధ్ర సీనియర్ నేత దాడి వీరభద్రరావు. మన దేశంలోనూ అనేక రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరో చోట ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్, గోవా, నాగాలాండ్ రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట ఉంటే హైకోర్టు మరొక చోట నెలకొల్పారని దాడి వీరభద్రరావు గుర్తు చేశారు. చంద్రబాబు 120 ఏళ్ల యోగిశ్వరుడిలాగా కథలు చెబుతున్నారని… ఇన్ని రాష్ట్రాల్లో ఇలా […]

రాజధానిపై సొంత సామాజికవర్గం వారితో బాబు ఒప్పందం చేసుకున్నారు...
X

మూడు ప్రాంతాల్లో మూడు రాజ్యాంగ వ్యవస్థలను పెట్టాలనుకోవడం మంచి నిర్ణయమన్నారు ఉత్తరాంధ్ర సీనియర్ నేత దాడి వీరభద్రరావు. మన దేశంలోనూ అనేక రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరో చోట ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్, గోవా, నాగాలాండ్ రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట ఉంటే హైకోర్టు మరొక చోట నెలకొల్పారని దాడి వీరభద్రరావు గుర్తు చేశారు.

చంద్రబాబు 120 ఏళ్ల యోగిశ్వరుడిలాగా కథలు చెబుతున్నారని… ఇన్ని రాష్ట్రాల్లో ఇలా హైకోర్టు ఒకచోట, రాజధాని మరోచోట ఉంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అలాంటి ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కనీసం హైకోర్టు బెంచ్‌ను కూడా ఏర్పాటు చేయలేకపోయిన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన చేశారని ఫైర్ అయ్యారు.

అన్ని వ్యవస్థలు ఒకేచోట కేంద్రీకరించడం వల్ల కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతాయన్నారు. ఆ ఆవేదనతోనే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లు వస్తున్నాయన్నారు. అలాంటి డిమాండ్‌ లు రాకుండా సరైన పరిష్కారంగా జగన్‌మోహన్ రెడ్డి విధానం నిలుస్తుందన్నారు.

దేశంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లు చాలా చోట్ల ఉన్నాయని… జగన్‌ మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఆయా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా ఆలోచన చేయడం ఖాయమని దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు.

‘అమ్మ కంటే అమరావతి గొప్ప’ అని చంద్రబాబు మాట్లాడడం ఘోర తప్పిదమన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సంస్థలు అక్కడే ఉంటాయని చెబుతున్నా సరే… విశాఖలో, కర్నూలులో ఏవీ ఏర్పాటు చేయకుండా అన్ని అమరావతిలోనే ఉంచాలని మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో తన సామాజికవర్గం వారందరినీ పిలిపించుకుని మాట్లాడి…. వారు మద్దతుగా నిలిచినందుకు ఇక్కడే రాజధాని ఏర్పాటు చేస్తానని… చంద్రబాబు ముందుగా ఒప్పందం చేసుకున్నారని దాడి వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం ఎన్నికల్లో చంద్రబాబుకు ఆయన వర్గం వారు భారీగా డబ్బు సరఫరా చేశారన్నారు. సొంత సామాజికవర్గం వారితో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారని వెల్లడించారు.

గుంటూరు వైపు, నూజివీడు వైపు అంటూ ప్రజలను దారి మళ్లించి… సొంత మనుషులతో మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు. చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్‌ వ్యాపారిలాగా మాట్లాడుతున్నారే గానీ… ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం లేదన్నారు. అలా మాట్లాడుతూ కూడా ఏమాత్రం సిగ్గుపడని వ్యక్తి ఈ దేశంలో చంద్రబాబు మాత్రమేనన్నారు. ప్రజలకు గుర్తు ఉండదన్న చులకన భావనతోనే చంద్రబాబు ఇలా పదేపదే అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు.

ఆర్‌బీఐ లాంటి సంస్థలకు ఉచితంగా భూమి ఇవ్వాల్సిందిపోయి ఎకరానికి నాలుగు కోట్లు తీసుకున్నారని… అదే చంద్రబాబు తన మనుషులకు మాత్రం కేవలం ఎకరా లక్ష రూపాయలకే అమరావతిలో కేటాయించారన్నారు. ఇలా చేసినందుకు చంద్రబాబుకు సిగ్గుగా అనిపించలేదా అని నిలదీశారు. నాలుగు వేల ఎకరాలకు పైగా సొంత మనుషుల చేత ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భాగంగా కొనుగోలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు.

విశాఖను నాశనం చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తుంటే దాన్ని నాశనం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మీద చంద్రబాబుకు ఎందుకింత కక్ష, ద్వేషం అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా ఇలాగే ఉండిపోవాలా అని నిలదీశారు.

చంద్రబాబుకు వంతపాడుతున్న పవన్‌ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఒక రాజధాని కట్టలేని వారు మూడు రాజధానులు కడుతారా? అని ప్రశ్నిస్తున్న పవన్ కల్యాణ్… ఈ ప్రశ్నను ఐదేళ్లు పాలించిన చంద్రబాబును అడాల్సిందన్నారు. చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలను జగన్‌ను అడగడం సరికాదన్నారు.

ఈ రాష్ట్రంలో భూములను ఆన్‌లైన్ చేసి… వేల ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు వారి పేర్ల మీద రాయించుకున్నది నిజం కాదా అని దాడి వీరభద్రరావు నిలదీశారు.

First Published:  18 Dec 2019 1:28 AM GMT
Next Story