Telugu Global
NEWS

జగన్ కు ఇంత ధైర్యం ఎలా వచ్చింది.... డబ్బులు ఎక్కడనుంచి తెస్తారు?

ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ జగన్మోహన్ రెడ్డి చేతికి ఎముక లేకుండా ఎడా పెడా వరాలు ఇవ్వడం, వాటిని అనతి కాలంలోనే నెరవేర్చడం చూస్తుంటే ఆర్థిక నిపుణులకు కూడా అంతుబట్టడం లేదు. రాష్ర్టం ఆర్థికంగా ఇబ్బంది కరమైన పరిస్థితుల్లో ఉంటే, ఇన్ని వరాలు, కోట్ల రూపాయలు ఎలా సమకూరుస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రులు, ఫైనాన్స్ విభాగంలోని సీనియర్ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఒకానొక దశలో సంక్షేమ కార్యక్రమాలను నిలిపి వేయాలని కూడా వారు జగన్ కి […]

జగన్ కు ఇంత ధైర్యం ఎలా వచ్చింది.... డబ్బులు ఎక్కడనుంచి తెస్తారు?
X

ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ జగన్మోహన్ రెడ్డి చేతికి ఎముక లేకుండా ఎడా పెడా వరాలు ఇవ్వడం, వాటిని అనతి కాలంలోనే నెరవేర్చడం చూస్తుంటే ఆర్థిక నిపుణులకు కూడా అంతుబట్టడం లేదు. రాష్ర్టం ఆర్థికంగా ఇబ్బంది కరమైన పరిస్థితుల్లో ఉంటే, ఇన్ని వరాలు, కోట్ల రూపాయలు ఎలా సమకూరుస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మంత్రులు, ఫైనాన్స్ విభాగంలోని సీనియర్ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఒకానొక దశలో సంక్షేమ కార్యక్రమాలను నిలిపి వేయాలని కూడా వారు జగన్ కి సూచించారు. కానీ జగన్ వారిని సున్నితంగా మందలించారు. అన్నీ నేను చూసుకుంటాను. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను… అంటూ ఆయన ముందుకు వెళుతున్నారు.

నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలే కాకుండా, వాటికంటే ఎక్కువ ప్రయోజనకరమైన అంశాలను జగన్ భుజాలపై వేసుకొని ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువ చేస్తున్నారని, నిధులన్నీ వాటికే సరిపోతున్నాయని స్వపక్షంలోని వారు సైతం ఆందోళన చెందుతుంటే తాజాగా ఆరోగ్యశ్రీలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టారు.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే రోగాల సంఖ్యను పెంచి వాటికి సహాయం అందించడం, వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం, రోగి విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 ఇవ్వడం, నెలకు రూ.5వేలు చెల్లించడం వంటివి విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు.

ఎన్నోఏళ్లుగా మూలన పడి ఉన్న 108,104 వాహనాలను తిరిగి రోడ్డు పైకి ఎక్కించడం చేస్తున్నారు.ఆరోగ్యశ్రీని పక్కనే ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ర్టాలకు కూడా విస్తరించడం అనేది సాసహోపేతమైన చర్య. కానీ దీనివల్ల ఎంతో మంది రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది.

సుదీర్ఘకాలంగా ప్రభుత్వ వైద్యశాలలు మూసివేత ధోరణిలోనే ఉన్నాయి. డాక్టర్లు లేక, మందులు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనుంచి, జిల్లా కేంద్ర ఆసుపత్రుల వరకూ అన్నీ అపసవ్య మార్గంలోనే నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్ది, పాఠశాలల్లో లాగానే ఆసుపత్రులకు కూడా నాడు-నేడు అని ప్రారంభించబోతున్నారు.

మనిషి సంపాదనలో సగానికి పైగా ఆసుపత్రులకే చెల్లించే అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని గాడిన పెట్టడం అనేది విప్లవాత్మకమైన చర్యగానే భావించాలి. ఇప్పటికే పాఠశాలల్ని చక్కదిద్దే కార్యక్రమం ఆరంభం అయిన నేపథ్యంలో ఇపుడు సగటు మనిషికి కావాల్సిన వైద్యం కూడా ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందేలా జగన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించబోతోంది.

అయితే వీటికి నిధులు ఎక్కడివి? ఎలా సమకూరుస్తారు? అనేదే అసలైన ప్రశ్న. దీనికి జగన్ ఒక్కరి దగ్గరే సరైన సమాధానం ఉంది. గతంలో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఎలాంటి కార్యక్రమం జరగాలన్నా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేవారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు నిర్వహించేవి. కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు. ప్రైవేటు హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మీడియా లో ప్రకటనల కోసం కూడా కోట్లు ఖర్చు అయ్యేవి. కానీ ఇపుడు వాటికి అయ్యే ఖర్చు పెద్దగా లేదు.

ముఖ్యమంత్రి కార్యక్రమాలన్నీ 90శాతం సమావేశాలు, సమీక్షలు సి.ఎం. ఇంటిదగ్గర క్యాంపు కార్యాలయంలోనే జరుగుతున్నాయి. 10శాతం మాత్రమే బయట జరుగుతున్నాయి. దీంతో దుబారా ఖర్చు తగ్గింది. ఈమొత్తాన్ని ప్రజాహిత కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. మంత్రులు, అధికారులకు అయ్యే ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. ఈమొత్తాన్ని కూడా ప్రజాహితానికే వినియోగిస్తున్నారు. ఈవిషయం తెలీక అందరూ ముఖ్యమంత్రిని ఆడిపోసుకోవడం, ఆందోళన చెందడం చేస్తున్నారు.

మొత్తం మీద చంద్రబాబు హయాంలో జరిగిన దుబారాని, అవినీతిని చాలా వరకు జగన్ అరికట్టగలిగాడు. ఉదాహరణకు చంద్రబాబు అధికారులతో సమావేశం జరిపితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేవి. ఇప్పుడు ఈ ఖర్చులు వేలల్లోకి కుదించేశాడు జగన్. అలాగే అనేక మిగతా కార్యక్రమాల్లో కూడా. అందుకే అంత ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు.

First Published:  2 Dec 2019 8:25 AM GMT
Next Story