Telugu Global
Others

నిరాశావాద రాజకీయాల వెల్లువ

కొన్ని రకాల నిరాశావాద ధోరణులు పెచ్చరిల్లడం చాలా ఆందోళనాకరంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఈ ధోరణి ప్రబలుతోంది. అనుసరించే ప్రక్రియల్లోనూ, దృఢమైన స్థాయిలోనూ ఈ ధోరణి వ్యక్తమవుతోంది. ప్రక్రియలకు సంబంధించినంత మేరకు సుస్థిరమైన ప్రక్రియలను జవదాటుతున్నారు. ఉదాహరణకు తెల్లవారుతుండగానే మంత్రివర్గం చేత ప్రమాణం స్వీకరింప చేయించడం. ఇది కచ్చితంగా రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే. చట్టసభల సభ్యులు అధికారంలో ఉన్న పార్టీ పంచన చేరడం, లేదా అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీని ఆశ్రయించడం దృఢమైన స్థాయిలో ఎదురవుతున్న నిరాశావాదానికి […]

నిరాశావాద రాజకీయాల వెల్లువ
X

కొన్ని రకాల నిరాశావాద ధోరణులు పెచ్చరిల్లడం చాలా ఆందోళనాకరంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఈ ధోరణి ప్రబలుతోంది. అనుసరించే ప్రక్రియల్లోనూ, దృఢమైన స్థాయిలోనూ ఈ ధోరణి వ్యక్తమవుతోంది. ప్రక్రియలకు సంబంధించినంత మేరకు సుస్థిరమైన ప్రక్రియలను జవదాటుతున్నారు.

ఉదాహరణకు తెల్లవారుతుండగానే మంత్రివర్గం చేత ప్రమాణం స్వీకరింప చేయించడం. ఇది కచ్చితంగా రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే. చట్టసభల సభ్యులు అధికారంలో ఉన్న పార్టీ పంచన చేరడం, లేదా అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీని ఆశ్రయించడం దృఢమైన స్థాయిలో ఎదురవుతున్న నిరాశావాదానికి తార్కాణం. మహారాష్ట్రలో ఇటీవలి రాజకీయ పరిణామాలు దీనికి మంచి ఉదాహరణ. చపల చిత్తత, ద్రోహం, రహస్య వ్యవహారాలు ఈ ధోరణికి మరో పార్శ్వం.

ఈ ధోరణులవల్ల రాజ్యాంగ సూత్రాలను విసర్జించడమే కాక చట్టసభల సభ్యులు నీతిబాహ్యంగా ప్రవర్తించడానికీ అవకాశం వస్తోంది. మరో రకంగా చెప్పాలంటే చట్టసభల సభ్యులు యదేచ్ఛగా నిర్ణాయక కట్టుబాట్ల మీద సునాయాసాంగా దాడి చేయగలుగుతున్నారు. ఈ రాజ్యాంగ నియమాలను పాటించవలసిన అవసరాన్ని న్యాయస్థానాలు అనేకసార్లు నొక్కి చెప్పాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది.

రాజకీయాలు అనిశ్చితంగా ఉన్నప్పుడు, ఎన్నికల ఫలితాలు నిర్దిష్టంగా లేనప్పుడు వ్యవస్థలను వక్రీకరించడానికి రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు అనువైన నేపథ్యం సమకూర్చే మాట వాస్తవమే. కానీ ఇది రాజకీయ పార్టీలు, నాయకులు అధికారం సంపాదించడానికి, అధికారాన్ని అంటిపెట్టుకోవడానికి, కంచె దాటడానికి ఉపయోగపడేవే. మహారాష్ట్రలో ఇటీవలి పరిమాణాలు ఈ విషయాన్ని కొట్టొచ్చినట్టు నిరూపించాయి.

నిరాశావాద రాజకీయాలు పెరగడానికి ఉన్న పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోక తప్పదు. వ్యక్తిగత, ప్రైవేటు ప్రయోజనాలు కాపాడుకోవడానికి వీలుండడంవల్లే నిరాశావాద రాజకీయాలకు ఊతం వస్తుంది. ఈ ప్రయోజనాలు పొందాలన్న బలమైన కోరిక వ్యక్తులలోనూ, వ్యక్తుల సమూహంలోనూ, కడకు రాజకీయ పార్టీలలోనూ ప్రస్ఫుటంగానే కనిపిస్తుంది. ఇలాంటి స్థితిలో నైతిక విలువలకు కట్టుబడడం సహజంగానే అప్రధానం అయిపోతుంది. వ్యక్తిగత ప్రయోజనాలు నిజాయితీని అనుసరించే ప్రక్రియలోనూ, ఇతరత్రా నియమాలను దెబ్బ తీస్తాయి.

నిరాశావాద రాజకీయాలు అనుసరించే వారికి దాపరికంలేని నడవడిక మీద, సంవాద పూరితమైన రాజకీయాల మీద ఏ మాత్రం పట్టింపు ఉండదు. వీరు ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రక్రియలను ఈసడిస్తారు. ఆలోచించి, చర్చించి నిర్ణయానికి రావడానికి ఇలాంటి వారు ససేమిరా ఇష్టపడరు. నైతికతకు కట్టుబడే వారైతే తిమ్మిని బమ్మిని చేసే ఒత్తిడులకు లొంగరు. అలాంటి ఒత్తిడుల దుష్పరిణామాల గురించి ఆలోచిస్తారు. మరొకరి కుట్రలకు, కూహకాలకు బలి కాకుండా ఉండాలంటే దిగజారే రీతిలో ప్రవర్తించకూడదు. నిజానికి ఇలా దిగజారుడు తనానికి దూరంగా ఉండడం అంటే తమపట్ల తామే నిజాయితీగా వ్యవహరించడం.

దిగజారుడు రాజకీయాల మీద ఆధారపడడంవల్ల ప్రజాస్వామ్యం మనలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగైంది అనడం అది అందని ఆశయం అయినందువల్ల కాదు. అది ఉత్తమ రాజకీయ ఆచరణ మీద ఆధారపడింది. ఈ ఆచరణను ప్రజా ప్రతినిధులు తమ నడవడికలో ప్రదర్శించాలి. చట్ట సభల సభ్యులు, వ్యవస్థల అధిపతులైన గవర్నర్లు, రాజ్య వ్యవస్థలు ఈ సూత్రాలను ఆదరిస్తేనే అసలైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అంటే వ్యవస్థలు ఉత్తమ రాజకీయాలను అనుసరించగలగాలి.

ప్రస్తుతం భారత రాజకీయాలు నిరాశావాదంలోనే కూరుకుపోయాయి. ఇందులో ఆశావాదం మచ్చుకు కూడా కనిపించడం లేదు. నిరాశావాదం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థల మూలుగలను పీల్చేస్తోంది. మేలైన ప్రజాస్వామ్యం దాపరికం లేని తత్వం, ప్రజాస్వామ్య ఆవరణలో నిజాయితీగా మెలగడం మీద ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా మంచి చెడ్డలను వివేచించడం, నిజాయితీగా చర్చించడం ఇలాంటి రాజకీయాలకు వెన్నెముక.

ఈ సందర్భంలో రాజకీయ పార్టీలు నిర్దేశిత ప్రమాణాలను పాటించాలి. మెరుగైన రాజకీయాలకు మార్గదర్శకత్వం వహించాలి, నియంత్రించాలి. ఉత్తమ రాజకీయాలకు కట్టుబడి ఉండవలసిన రాజకీయ పార్టీ కూడా దిగజారుడు ధోరణి ప్రదర్శిస్తోందని రాజకీయ వ్యాఖ్యాతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. వీరి దృష్టిలో అలా మెలగవలసిన రాజకీయ పార్టీ కూడా ద్రోహానికి పాల్పడుతున్నట్టు, కుటిలంగా వ్యవహరిస్తున్నట్టు లెక్క.

వ్యక్తిగతంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దాపరికం లేకుండా, మర్యాదకరంగా వ్యవహరించాలని సామాన్యులు కోరుకుంటారు. తద్వారా ఆ రాజకీయ నాయకులు, పార్టీలు తమను తాము కాపాడుకోవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుందని భావిస్తారు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  1 Dec 2019 7:00 AM GMT
Next Story