Telugu Global
NEWS

ఐదు నెలలకే ప్రశ్నిస్తున్న చంద్రబాబు... ఐదేళ్లలో ఏం ఊడబెరికావ్..

ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు బెదరగొట్టి వెనక్కు తగ్గేలా చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోందని… కానీ అలాంటి వాటికి తగ్గే ప్రసక్తే లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తామంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా అంగీకరించలేదని… ఇబ్బందులు వస్తాయని కేంద్ర పెద్దలు కూడా చెప్పారన్నారు. కానీ ఒప్పించి పెట్టడం వల్ల… రైతులకు ఉచిత విద్యుత్‌ అంశాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ఆరోగ్య శ్రీని కూడా కొందరు అప్పట్లో వ్యతిరేకించారని […]

ఐదు నెలలకే ప్రశ్నిస్తున్న చంద్రబాబు... ఐదేళ్లలో ఏం ఊడబెరికావ్..
X

ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు బెదరగొట్టి వెనక్కు తగ్గేలా చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోందని… కానీ అలాంటి వాటికి తగ్గే ప్రసక్తే లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తామంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా అంగీకరించలేదని… ఇబ్బందులు వస్తాయని కేంద్ర పెద్దలు కూడా చెప్పారన్నారు. కానీ ఒప్పించి పెట్టడం వల్ల… రైతులకు ఉచిత విద్యుత్‌ అంశాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.

ఆరోగ్య శ్రీని కూడా కొందరు అప్పట్లో వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడుతాయంటూ టీడీపీ నేతలు వాదన చేశారన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్‌పైనా అదే వాదన చేస్తున్నారని విమర్శించారు. కొన్ని పత్రికలు నిత్యం ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా బ్యానర్‌ కథనాలు ఎందుకు రాస్తున్నాయో అర్థం కావడం లేదని…. అదే మీడియా పెద్దలు, నేతలు మాత్రం వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని… పేదలు మాత్రం ఇంగ్లీష్ చదువుకోవడానికి వీల్లేదన్నట్టుగా వారి తీరు ఉందన్నారు.

రాజధానికి 34వేల ఎకరాలు పూలింగ్‌లో తీసుకున్న చంద్రబాబు… తన హయాంలో కేవలం నాలుగు భవనాలను మాత్రమే నిర్మించగలిగారన్నారు. అందులోకూ ఒక భవన నిర్మాణం ఇంకా 50 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. హైకోర్టు భవనం కూడా పూర్తిగా నిర్మించలేదని…90 శాతం నిర్మాణం మాత్రమే పూర్తయిందన్నారు.

రాజధాని రైతులకు కౌలు చెల్లించామని… వారికి భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలన్న హామీకి కట్టుబడే ఉన్నామన్నారు. చంద్రబాబు విధానమే దోపిడిపూరితమని… అమాయకుడు దొరికితే ముంచేయడమే చంద్రబాబుకున్న అలవాటన్నారు.

ప్రపంచ రాజధాని కడతానన్న చంద్రబాబు తన హయాంలో రాజధాని నిర్మాణానికి కేవలం నాలుగువేల 900 కోట్లు మాత్రమే ఎందుకు కేటాయించారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇది అవాస్తవమని చంద్రబాబు చెబితే తాము అసెంబ్లీలో నిరూపించేందుకు సిద్దమన్నారు. బడ్జెట్‌లో కేవలం ఒకశాతం మాత్రమే రాజధాని నిర్మాణానికి కేటాయించిన చంద్రబాబు… ఇప్పుడు రాజధాని పర్యటన చేస్తానని చెప్పడం ఏమిటని నిలదీశారు.

తీరా ఎన్నికలకు వెళ్లే ముందు 36వేల కోట్లకు టెండర్లు పిలిచారని.. కానీ టెండర్లకు ఆర్థిక శాఖ అనుమతి గానీ, బడ్జెట్ కేటాయింపులు గానీ, ప్రణాళిక గానీ ఏమీ లేవన్నారు. ఎలాగో ఓడిపోతున్నానని ముందే గ్రహించి కమిషన్ల కోసం టెండర్లు పిలిచారన్నారు. చంద్రబాబును చరిత్ర క్షమించబోదన్నారు. ఐదు నెలలకే ఏం చేశారని ప్రశ్నిస్తున్న చంద్రబాబునాయుడు ఐదేళ్లలో ఏం ఊడబెరికారో చెప్పాలన్నారు.

ప్రజల నుంచి తిరస్కరణకు గురైన చంద్రబాబు ఇప్పుడు తమను డిక్టేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు తెలుసు కాబట్టే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సైలెంట్‌గా పనిచేసుకుపోతున్నారన్నారు. ఇసుక అంటూ తెగ హడావుడి చేశారని కానీ ఈరోజు ఎక్కడైనా ఇసుక సమస్య ఉందా అని ప్రశ్నించారు.

అవినీతిపై ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రభుత్వమే 14400 టోల్‌ఫ్రీ నెంబర్‌ తెచ్చిందని… ఇది దేశంలోనే తొలిసారి అన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం ఉండాలన్నారు. ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌ ద్వారా అధికారులపైనే కాకుండా, అనధికారుల అవినీతిపైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

గతంలో రెండు ప్రభుత్వాల్లో తాను పనిచేశానని… ఎన్నడూ కూడా పోతూపోతూ ఒక ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయల పెండింగ్‌ బిల్లులు ఉంచి వెళ్లిన సందర్భం లేదన్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండి కూడా అమరావతిపై గెజిట్‌ ఇచ్చుకోవడం చేతగాని చంద్రబాబు… ఇప్పుడు తన వల్లే అమరావతి భారతదేశ పటంలోకి వచ్చిందని చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు.

First Published:  25 Nov 2019 11:14 AM GMT
Next Story