Telugu Global
Others

స్థల వివాదం నుంచి విశృంఖల భావనలు

సుప్రీంకోర్టు అయోధ్య వివాదంలో ఇటీవల ఇచ్చిన తీర్పు కేవలం ఒక స్థలానికి సంబంధించింది. ఈ స్థలం తమదని కోర్టులో అనేకమంది పిటిషన్లు దాఖలు చేశారు. చాలా మంది ఈ అంశాన్ని న్యాయస్థానానికి లాగారు. కోర్టు తీర్పుతో ఈ వివాదం సమసి పోయిందని అనేకమంది భావిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఒక మత విశ్వాసం ఆధారంగా ఒక వర్గానికి ఆ స్థలాన్ని కట్టబెట్టింది. వివాదాస్పద స్థలం ఎవరిది, ఆ స్థలం ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రజల మనస్సుల్లో విశృంఖలమైన ఆలోచనలు […]

స్థల వివాదం నుంచి విశృంఖల భావనలు
X

సుప్రీంకోర్టు అయోధ్య వివాదంలో ఇటీవల ఇచ్చిన తీర్పు కేవలం ఒక స్థలానికి సంబంధించింది. ఈ స్థలం తమదని కోర్టులో అనేకమంది పిటిషన్లు దాఖలు చేశారు. చాలా మంది ఈ అంశాన్ని న్యాయస్థానానికి లాగారు. కోర్టు తీర్పుతో ఈ వివాదం సమసి పోయిందని అనేకమంది భావిస్తున్నారు.

సర్వోన్నత న్యాయస్థానం ఒక మత విశ్వాసం ఆధారంగా ఒక వర్గానికి ఆ స్థలాన్ని కట్టబెట్టింది. వివాదాస్పద స్థలం ఎవరిది, ఆ స్థలం ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రజల మనస్సుల్లో విశృంఖలమైన ఆలోచనలు చెలరేగడానికి ఈ తీర్పు దోహదం చేసింది. ఈ స్థలం తమకే చెందిందని వ్యాజ్యమాడిన మతం వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కూడా న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రధానంగా భౌతికమైన స్థలానికి సంబంధించింది. అందువల్ల ఈ తీర్పు ఆ స్థలాన్ని వివాదాలనుంచి గట్టెక్కించి న్యాయపరంగా ఆధీనంలోకి తీసుకోవడానికి ఉపకరిస్తుందని అనుకోవచ్చు.

న్యాయస్థానం ఈ స్థల వివాదాన్ని పరిష్కరించడం ద్వారా తన ప్రయోజనం నెరవేరిందని భావించినట్టే. ఒక స్థలం న్యాయం కలగజేయడానికి సాక్ష్యాధారంగా పనికొచ్చినట్టే. అయితే ఈ న్యాయనిర్ణయం కొంతమందికి సంతృప్తి కలిగించకపోవచ్చు. నిజానికి న్యాయవ్యవస్థ ఈ అంశంపై మరిన్ని వ్యాజ్యాలకు తావిచ్చేట్టు కూడా ఉంది.

ఒక స్థలం దాని భౌతిక ధర్మాలనుబట్టి కాకుండా సర్వోన్నత న్యాయస్థానం మత విశ్వాసాలను ఆసరాగా చేసుకుని తీర్పు చెప్పినందువల్ల దానికి పవిత్రత కూడా ఆపాదించినట్టయింది కనక దాని గురించి అనేక రకాల ఊహల్లో విహరించడానికి కూడా విస్తరిస్తుంది. ఆ రకంగా అవ్యక్తమైన స్థలానికి లేదా తెలియని స్థలం అన్న ఊహకు రెక్కలు వస్తాయి.

ఈ ఊహలు మానసిక, సాంస్కృతిక స్థాయిలో విహరిస్తాయి. ఒక స్థలం ఊహల్లో విహరించినప్పుడు అది ఒక మానసిక అవస్థకు, విచలితం చేసే భావోద్వేగాలకు, ద్వేషానికి, పగ తీర్చుకోవడాని, ప్రతీకారానికి తావిస్తుంది. ఆ స్థలాలు ఒక పేలుడు పదార్థంగా మారి పోతాయి. అవి పేలనూ వచ్చు. ఒక నిర్దిష్ట సాంస్కృతిక ఆవరణలో వ్యక్తుల మీద భయంకరమైన భావ వ్యక్తీకరణ జరుగుతోంది. ఈ తీర్పు తర్వాత ఒక మత వర్గం వారు అత్యుత్సాహంతో చేసిన నినాదాలే దీనికి సాక్ష్యం.

శ్రీ రాముడిని తలుచుకుని ఒకర్నొకరు ఇది వరకు జై సీతారామ్, రాంరాం అని పలకరించుకునే వారు. ఇప్పుడు జై శ్రీరాం నినాదంగా మారిపోయి పలకరింపులకూ అదే ఆధారమైంది. ఇది సాధారణంగా ఒకరినొకరు పలకరించుకునే భాష మాత్రం కాదు. బహిరంగంగా ఇలాంటి భాష వాడడంవల్ల సాధారణంగా దూకుడు లేని భాష వినడానికి అలవాటుపడ్డ వారు సాంస్కృతికంగా కుంచించుకుపోతారు. ఆ పలకరింపులో మత పరమైన భావ వ్యక్తీకరణ చేరిపోయింది.

ఈ రొదలో ఇతరుల వాణి వినిపించకుండా పోతుంది. ఇలా నోరు మూయించడమే గట్టిగా అరిచేవాళ్ల లక్షణం. ఒక స్థలానికి ఉన్న శక్తి, ఆధిపత్యం ఉద్రేకాలు రెచ్చిపోవడానికి దారి తీస్తుంది. ఈ ఉద్రేకాలను ఇతరుల మీద రుద్దుతారు. కాని అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే కోర్టుల వ్యవస్థ అందరి భావ వ్యక్తీకరణకూ స్థానం ఇప్పించగలుగుతుందా?

ప్రస్తుతం సామాజిక-సాంస్కృతిక ఆవరణలు, చివరకు మానసిక ఆవరణలూ మతం రంగు పులుముకుంటున్నాయి. ఈ సంకుచిత ధోరణి కొందరు దిక్కుతోచని, నోరు విప్పలేని స్థితిలో పడిపోవడానికి దారి తీస్తుంది. దీనికి “ఒక జాతికి ప్రత్యేకం” అన్న ముద్దుపేరు కూడా పెట్టొచ్చు. ఇలాంటి భావాలను ప్రోది చేసేవారు ఇతరుల మీద ఆధిపత్యం చెలాయిస్తారు.

ఇతరులకన్నా తాము అధికులమన్న భావన కలగజేస్తారు. ఇతరులు తమకు దాసోహం అనాలనుకుంటారు. అప్పుడు మనసులు గిడసబారి పోతాయి. సాంస్కృతికంగా బందీలైపోతారు. నైరూప్యమైన దాన్ని భౌతికమైందిగా భావిస్తారు. ఇలాంటి స్థితిలో రాజకీయ సమీకరణ సాధ్యం కాకుండా పోతుంది.

అందువల్ల ఒక స్థలం, లేదా ఒక నేల చెక్క స్థగితం కాకుండా, నైరూప్యమైనది కాకుండా భౌతికమైంది కావడాన్ని నిరోధించడానికి ఏం చేయాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. లేదా ఆ స్థలాలను విశాల ఆవరణలుగా మార్చడానికి గతిశీలమైనవిగా మార్చడానికి ఏం చేయాలి అని అడగవలసి వస్తుంది. ఇతరులను గౌరవించడం ఎలా అన్న ప్రశ్నా ఉదయిస్తుంది.

అందుకే ఒక అంశం కేవలం న్యాయపరమైన వ్యవహారంగా కాక అందరికీ వర్తించే విషయమై పోతుంది. అయోధ్య వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా చూపించే స్థలాన్నైనా గతి శీలంగా మార్చడం సాధ్యమా? ఇతరులను సహజంగా గౌరవించే స్థలంగా మార్చడం సాధ్యమా? విశ్వజనీనమైన భావనలకు అవకాశం ఉండాలంటే సంకుచిత భావనలను విడనాడాలి. ఈ ప్రత్యామ్నాయ స్థలమైనా సంకుచిత ధోరణులకు తావివ్వకుండా విశాల ఆవరణకు అవకాశం ఇవ్వాలి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  25 Nov 2019 12:20 AM GMT
Next Story