Telugu Global
NEWS

భారత టెస్ట్ చరిత్రలో అరుదైన మ్యాచ్

కోల్ కతా వేదికగా నేటినుంచే తొలి డే-నైట్ టెస్ట్ ప్రపంచ క్రికెట్ కు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత గడ్డపై అత్యంత అరుదైన టెస్ట్ మ్యాచ్ కు…భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. భారత క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల  వరకూ జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం బెంగాల్ […]

భారత టెస్ట్ చరిత్రలో అరుదైన మ్యాచ్
X
  • కోల్ కతా వేదికగా నేటినుంచే తొలి డే-నైట్ టెస్ట్

ప్రపంచ క్రికెట్ కు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత గడ్డపై అత్యంత అరుదైన టెస్ట్ మ్యాచ్ కు…భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రంగం సిద్ధమయ్యింది.

భారత క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు.

డే-నైట్ టెస్టుగా 359వ మ్యాచ్….

భారతజట్టు 1932లో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన నాటినుంచి…ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఇటీవలే బంగ్లాదేశ్ తో ముగిసిన తొలిటెస్ట్ వరకూ 538 టెస్టులు ఆడింది. ఈ మ్యాచ్ లన్నీ పట్టపగలు సహజసిద్ధమైన వెలుతురులోనే నిర్వహించారు.

అయితే..ఇటు సహజసిద్ధమైన వెలుగు…ఫ్లడ్ లైట్ల వెలుగుల నడుమ నిర్వహించే మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను మాత్రం నవంబర్ 22 నుంచి 25 వరకూ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలిసారిగా నిర్వహించడానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

రెడ్ బాల్ కు బదులుగా పింక్ బాల్ తో…

సాంప్రదాయ యాపిల్ రంగు బంతుల స్థానంలో…గులాబీరంగు బంతులతో ఈ డే-నైట్ టెస్టును నిర్వహిస్తున్నారు. ఎస్జీ బ్రాండ్ కంపెనీ తయారుచేసిన మొత్తం 72 పింక్ బాల్స్ ను అందుబాటులో ఉంచారు.

టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్…మిగిలిన అగ్రశ్రేణిజట్లతో పోల్చిచూస్తే…కాస్య ఆలస్యంగానే డే-నైట్ టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.

1932 నుంచి 2019 ప్రస్తుతసిరీస్ తొలిటెస్ట్ వరకూ 538 టెస్టులు ఆడిన భారత్ కు 155 విజయాలు, 165 పరాజయాలు, 217 డ్రాలు, ఓ టై ఫలితాలు ఉన్నాయి.

ఇక..9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా భారత్ కు 10 టెస్టుల్లో 8 విజయాలు, 2 డ్రా మ్యాచ్ ల రికార్డు ఉంది.

హాటుకేకుల్లా 4రోజుల టికెట్లు…

డే-నైట్ టెస్ట్ మ్యాచ్ మొదటి నాలుగురోజుల ఆట టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడుపోయినట్లు బెంగాల్ క్రికెట్ సంఘం ప్రకటించింది. రోజుకు 68వేల మంది సభ్యుల చొప్పున మ్యాచ్ కు హాజరుకానున్నారు.

ఈ మ్యాచ్ ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలసి…ఈడెన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన అతిపెద్ద గంటను మోగించడం ద్వారా.. డే-నైట్ టెస్టును ప్రారంభించనున్నారు.

ప్రధాన అతిథుల నడుమ…

భారత ఉపఖండంలోనే జరుగుతున్న మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా హాజరుకావాలంటూ…భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు ఇప్పటికే ఆహ్వానాలు అందచేశారు.

బంగ్లా ప్రధాని తమ ఆహ్వానాన్ని మనించారని, భారత ప్రధాని జవాబు కోసం ఎదురుచూస్తున్నామని బెంగాల్ క్రికెట్ సంఘం ప్రతినిధి తెలిపారు.

సచిన్, సానియాలకూ పిలుపు…

మాస్టర్ సచిన్ టెండుల్కర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, చెస్ మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ మ్యాచ్ కు కానున్న ప్రధాన అతిథుల్లో ఉన్నారు.

మ్యాచ్ లో తలపడనున్న రెండుజట్ల సభ్యులతో పాటు…బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు, షూటర్ అభినవ్ భింద్రాలను సన్మానించాలని బెంగాల్ క్రికెట్ సంఘం నిర్ణయించింది.

50 రూపాయలకే టెస్ట్ మ్యాచ్ టికెట్…

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరుగనున్న మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ రోజువారీ టికెట్లను కేవలం 50 రూపాయల ధరకే విక్రయించడం విశేషం.

142 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది కేవలం 12వ డే-నైట్ టెస్ట్ మ్యాచ్ గా రికార్డుల్లో చేరనుంది.

First Published:  21 Nov 2019 7:32 PM GMT
Next Story