Telugu Global
NEWS

వార్నింగ్‌ వంశీకా? జూనియర్ ఎన్టీఆర్‌కా?

మంత్రి కొడాలి నాని, టీడీపీపై తిరుగుబాటు చేసిన వల్లభనేని వంశీలను నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్యకృష్ణ ఒక వీడియో ద్వారా హెచ్చరించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబును నాని, వంశీనే కాదు చాలా మంది వైసీపీ నేతలు తీవ్రంగానే విమర్శిస్తున్నారు. వారిలో కొందరు టీడీపీ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారందరికి కాకుండా కేవలం కొడాలి నాని, వల్లభనేని వంశీలకే చైతన్య కృష్ణ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అన్నదే ప్రశ్న. వల్లభనేని వంశీ గానీ, కొడాలి నాని […]

వార్నింగ్‌ వంశీకా? జూనియర్ ఎన్టీఆర్‌కా?
X

మంత్రి కొడాలి నాని, టీడీపీపై తిరుగుబాటు చేసిన వల్లభనేని వంశీలను నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్యకృష్ణ ఒక వీడియో ద్వారా హెచ్చరించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబును నాని, వంశీనే కాదు చాలా మంది వైసీపీ నేతలు తీవ్రంగానే విమర్శిస్తున్నారు. వారిలో కొందరు టీడీపీ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారందరికి కాకుండా కేవలం కొడాలి నాని, వల్లభనేని వంశీలకే చైతన్య కృష్ణ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అన్నదే ప్రశ్న.

వల్లభనేని వంశీ గానీ, కొడాలి నాని గానీ ఇప్పటికీ నందమూరి అభిమానులుగానే ఉన్నారు. కేవలం చంద్రబాబును మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని చంద్రబాబు లాగేసుకుని నాశనం చేస్తున్నారనేది వంశీ ఆరోపణ. ఇప్పటికైనా టీడీపీని చంద్రబాబు నందమూరి కుటుంబానికి అప్పగించాలని వల్లభనేని వంశీలాంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

నారా ఫ్యామిలీ నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో పాటు నందమూరి కుటుంబానికి పార్టీని అప్పగించాలని డిమాండ్ చేస్తున్న వారిపై నందమూరి చైతన్య కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడమే కొత్తగా ఉంది.

వల్లభనేని వంశీ కూడా ఇటీవల ప్రెస్‌మీట్‌లో… నారా లోకేష్‌కు పోటీ అవుతారన్న ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్‌ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. 2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని ఆ తర్వాత ఫలితాలు రాగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్రతి చోటా టీడీపీ ఓడిపోయిదని ఈనాడు పత్రికలో రాయించారని వంశీ ఆరోపించారు. ఒక్క వంశీనే కాకుండా టీడీపీ శ్రేణుల్లోనూ చంద్రబాబు తర్వాత నారా లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్‌కు నాయకత్వం అప్పగించడం బెటర్ అన్న చర్చ ఇటీవల మొదలైంది.

టీడీపీ నాయకత్వాన్ని నందమూరి కుటుంబానికి అప్పగించాలంటున్న వారు.. బాలకృష్ణ పేరును కూడా సూచించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే నందమూరి కుటుంబంలోని పలువురికి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వయసు వారికి నచ్చడం లేదన్న అభిప్రాయం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్‌ తమందరి కంటే గొప్పోడా అన్న భావన ఆ కుటుంబంలోని కొందరిలో ఉంది. అలాంటి వారు చంద్రబాబు లేదా నారా లోకేష్‌ చేతిలో టీడీపీ ఉండడాన్ని అయినా ఒప్పుకుంటారేమో గానీ… జూనియర్ ఎన్టీఆర్‌ పట్ల సుముఖత చూపే పరిస్థితి కనిపించడం లేదు.

ఎన్నికల తర్వాత ఆగస్టు నెలలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని.. టీడీపీని నడిపించడానికి తామంతా ఉన్నామని వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం వర్లరామయ్య కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని చెప్పారు.

ఇప్పుడు నందమూరి చైతన్య కృష్ణ… జూనియర్ ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావించకపోయినా… జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితులైన వల్లభనేని వంశీకి వార్నింగ్ ఇవ్వడం ద్వారా తన మనసులోని అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించినట్టు అయింది.

టీడీపీ నాయకత్వం నందమూరి కుటుంబం చేతిలోకి రాకపోయినా పర్వాలేదు గానీ… జూనియర్ ఎన్టీఆర్‌ నాయకత్వాన్ని మాత్రం సహించేది లేదన్న ధోరణి కనిపిస్తోంది.

బాలకృష్ణ చిన్నల్లుడి ప్రకటన చూసినా, బాబు తరపున వర్ల రామయ్య మాటలు చూసినా, ఇప్పుడు చైతన్య కృష్ణ వ్యాఖ్యలు చూసినా జూనియర్ ఎన్టీఆర్‌ను రానివ్వకూడదు అన్న ఆలోచనే వీరిలో కనిపిస్తోంది.

చంద్రబాబును అనేక మంది విమర్శిస్తున్నప్పటికీ వారందరికీ వార్నింగ్ ఇవ్వకుండా… కొడాలి నాని, వంశీలకు మాత్రమే చైతన్య కృష్ణ వార్నింగ్ ఇవ్వడానికి కారణం…. వారిద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితులు అవడమే అయి ఉండవచ్చు.

First Published:  21 Nov 2019 5:35 AM GMT
Next Story